పెరుగుతున్న కరోనా కేసులు.. రోగులు ఇంట్లో ఉండకపోవడం వల్లే..!

ABN , First Publish Date - 2020-08-12T18:53:44+05:30 IST

సిద్ధిపేట జిల్లాలో మంగళవారం 151 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి ఒక రిటైర్డ్‌ ఉద్యోగి, మంగళవారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. రోగులు ఇంట్లో ఉండకపోవడం వల్లే..!

జిల్లాలో 151 పాజిటివ్‌ కేసులు.. ఇద్దరి మృతి



సిద్దిపేట(ఆంధ్రజ్యోతి): సిద్ధిపేట జిల్లాలో మంగళవారం 151 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి ఒక రిటైర్డ్‌ ఉద్యోగి, మంగళవారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. సిద్దిపేట పట్టణంలో 44 కేసులు నమోదు కాగా, రెండు ఇళ్లలోనే 9 కేసులు వచ్చినట్లు తెలిసింది. పటేల్‌పుర, నాసర్‌పుర, కోటిలింగాల ప్రాంతం, భారత్‌నగర్‌, బోయిగల్లీ తదితర ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. డీఎంహెచ్‌వో కార్యాలయంలో గతంలో ఐదుగురికి కరోనా సోకగా, మంగళవారం మరో ఇద్దరికి పాజిటివ్‌గా గుర్తించారు. కాగా సిద్దిపేట రూరల్‌లో ఒకరు, నారాయణరావుపేటలో ఇద్దరు, గజ్వేల్‌లో 18 మందికి, బెజ్జంకిలో ఆరుగురు, చేర్యాలలో ఏడుగురు, చిన్నకోడూరులో ముగ్గురు, దుబ్బాకలో ఐదుగురు, హుస్నాబాద్‌లో ఐదుగురు, జగదేవ్‌పూర్‌లో ముగ్గురు, కోహెడలో ముగ్గురు, కొమురవెల్లిలో నలుగురు, కొండపాకలో ఆరుగురు, మద్దూరులో ఇద్దరు, మిరుదొడ్డిలో 15 మంది, ములుగులో ముగ్గురు, రాయపోల్‌లో ఐదుగురు, తొగుటలో తొమ్మిది మంది, వర్గల్‌లో ఏడుగురు, నంగునూరులో ఇద్దరు, మర్కుక్‌లో ఒకరు కరోనా బారినపడ్డారు.


సిద్దిపేటలోని కొందరు ఆర్‌ఎంపీలు, ప్రైవేటు వైద్యులు కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స చేస్తున్నా, వైద్య ఆరోగ్యశాఖకు కనీస సమాచారం అందించడం లేదు. పలువురు రోగులు ఇంట్లో ఉండకుండా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారనే ఆరోపణలున్నాయి. అలాంటి కేసులు ఎక్కడున్నాయో తెలియకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు, డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు స్కానింగ్‌, ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేయిస్తూ చికిత్సలు అందిస్తున్నారు. కొందరు కమీషన్ల కోసం కక్కుర్తిపడి లక్షణాలు లేని వారికి కూడా పరీక్షలు చేయిస్తున్నట్లు సమాచారం.


సిద్దిపేటలో బంద్‌ విధించాలి

సిద్దిపేటలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, అందులో ఎక్కువమంది వ్యాపారవర్గానికి చెందినవారు కావడం కలవరం రేపుతున్నది. గతంలో కొన్ని వ్యాపార సంఘాలు స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చినా స్పందన లేదు. దీంతో సిద్దిపేటలో బంద్‌ అమలయ్యేలా చూడాలని హరీశ్‌రావును కోరుతూ పలువురు వాట్సాప్‌ గ్రూప్‌లలో సందేశాలు పెడుతున్నారు. 

Updated Date - 2020-08-12T18:53:44+05:30 IST