హైదరాబాద్‌లో ఆపరేషన్.. నడుమునొప్పి తగ్గిందని సంతోషించేలోపే అతడికి కరోనా..

ABN , First Publish Date - 2020-06-30T21:47:39+05:30 IST

సిద్దిపేట పట్టణంలోని మారుతినగర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి(61) సోమవారం కరోనాతో మృతి చెందినట్లు తెలిసింది. సిరిసిల్లాకు చెందిన

హైదరాబాద్‌లో ఆపరేషన్.. నడుమునొప్పి తగ్గిందని సంతోషించేలోపే అతడికి కరోనా..

సిద్దిపేటలో కరోనాతో ఒకరి మృతి.. 


సిద్దిపేట టౌన్‌ (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట పట్టణంలోని మారుతినగర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి(61) సోమవారం కరోనాతో మృతి చెందినట్లు తెలిసింది. సిరిసిల్లాకు చెందిన ఓ వ్యక్తి రియల్‌ఎస్టెట్‌ నిర్వహిస్తూ ఆరేళ్ల నుంచి సిద్దిపేట పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు కరోనా టెస్టును నిర్వహించగా అతనికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు సమాచారం. కాగా సిద్దిపేట పట్టణంలోని పటేల్‌పురా కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తి కుటుంబంలోని ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు సోమవారం రాత్రి వెల్లడించారు. 


వృత్తిరీత్యా మిల్లు వ్యాపారం చేస్తున్న వ్యక్తితో పాటు అతడి కుటుంబసభ్యులు ఇటీవలే ఆనారోగ్యానికి గురికావడంతో విషయం తెలుసుకున్న వైద్యాధికారులు వారి నమూనాలు సేకరించగా, ముగ్గురికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వారు ఎవరెవరితో తిరిగారు అనే విషయంపై అధికారులు ఆరా తీయగా దాదాపు 22 మందిని గుర్తించినట్లు తెలిసింది. ఇటీవలే ఆ వ్యక్తి ఓ మిల్లు పార్టనర్లను కలిశారని ఇప్పటివరకు 14 మంది నుంచి నమూనాలు సేకరించామని, మరో 8 మంది నుంచి మంగళవారం నమూనాలు సేకరిస్తామని అధికారులు చెప్పా రు. కరోనా వైరస్‌ దృష్ట్యా ప్రజలు స్వచ్ఛందంగా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యశాఖ డీఎస్ వో పవన్‌రెడ్డి తెలిపారు. 


అర్జున్‌పట్లలో ఒకరికి 

నడుమునొప్పి నుంచి విముక్తికి సర్జరీ చేయించుకున్న వ్యక్తికి మళ్లీ నొప్పి రావడంతో తిరిగి సర్జరీ అవసరమని అడ్మిట్‌ చేసుకున్న డాక్టర్లు చివరకు కరోనా పాజిటివ్‌ అని తేల్చారు. మద్దూరు మండలంలోని అర్జున్‌పట్ల గ్రామ నివాసి అయిన ఓ వ్యక్తి కొంత కాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దానికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. నొప్పి తగ్గిందని సంతోషపడుతున్న క్రమంలో 15 రోజుల తర్వాత మళ్లీ నొప్పి తిరగదోడింది. దీంతో సర్జరీ చేసిన సదరు ఆస్పత్రికి వెళ్లగా మళ్లీ సర్జరీ చేస్తామని అడ్మిట్‌ చేసుకున్నారు. ఎందుకైనా మంచిదని ఈ నెల 25న కరోనా టెస్ట్‌కు పంపించగా 26న పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. కాగా, ఆయన వెంట ఉన్న ఐదుగురికి స్ర్కీనింగ్‌ నిర్వహించి హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించినట్టు మద్దూరు పీహెచ్‌సీ వైద్యాధికారి రాజు తెలిపారు. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు.  

Updated Date - 2020-06-30T21:47:39+05:30 IST