వైద్యం కోసం హైదరాబాద్‌కు ఓ మహిళ.. అనుమానంతో కరోనా పరీక్షలు చేస్తే..

ABN , First Publish Date - 2020-07-02T22:19:46+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో బుధవారం నలుగురికికరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. జహీరాబాద్‌-1, బీరంగూడ-1, భానూర్‌-1, బొల్లారం ఒకరికి కరోనా సోకిందని

వైద్యం కోసం హైదరాబాద్‌కు ఓ మహిళ.. అనుమానంతో కరోనా పరీక్షలు చేస్తే..

సంగారెడ్డి జిల్లాలో నలుగురికిపాజిటివ్‌


సంగారెడ్డి అర్బన్‌(ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డి జిల్లాలో బుధవారం నలుగురికికరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. జహీరాబాద్‌-1, బీరంగూడ-1, భానూర్‌-1, బొల్లారం ఒకరికి కరోనా సోకిందని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి 81 మంది శాంపిళ్లను సేకరించి కొవిడ్‌ నిర్ధారణ కోసం బుధవారం గాంధీకి పంపామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. ఆస్పత్రిలోని కరోనా వార్డులో పాజిటివ్‌ బాధితులు ఐదుగురు, అనుమానిత లక్షణాలతో చేరిన నలుగురు మెత్తం తొమ్మిది మంది ఉన్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.సంగారెడ్డి తెలిపారు.


ఉత్తర్‌పల్లిలో పాజిటివ్‌ కేసుతో అప్రమత్తత

కంది మండలపరిధిలోని ఉత్తర్‌పల్లి గ్రామంలో మంగళవారం ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో గ్రామంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం గ్రామానికి చెందిన మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని పీహెచ్‌సీ వైధ్యాధికారి ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళను చికిత్స నిమిత్తం గాంధి ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. అయితే ఆ మహిళకు నివాసం ఉంటున్న గ్రామంలో బుధవారం సర్వే నిర్వహించారు. ఆమె కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచి లక్షణాలపై ఆరా తీస్తున్నారు. సర్పంచ్‌ బాలయ్య కర్రలతో అడ్డుకట్ట ఏర్పాటు చేయించారు. ఆ మహిళ ఉంటున్న వీధి వైపునకు వెళ్లకుండా డప్పు చాటింపు వేయించామని, క్వారంటైన్‌లో ఉన్నవారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు సర్పంచ్‌ తెలిపారు. 


ఔదత్‌పూర్‌లో ఆరుగురికి హోం క్వారంటైన్‌ 

నాగల్‌గిద్ద మండల పరిధిలోని ఔదత్‌పూర్‌లో రెండు కరోనా పాజిటివ్‌ నమోదు కావడంతో ప్రజలు ఒక్క సారిగా ఉలికికపడ్డారు. దీంతో బుధవారం కర్‌సగుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్‌ ఉషారాణి గ్రామాన్ని సందర్శించి పాజిటివ్‌ వచ్చిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడంతో పాటు వారికి సన్నిహితంగా ఉన్న ఆరుగురిని గుర్తించి హోం క్వారంటైన్‌ విధించారు. 

Updated Date - 2020-07-02T22:19:46+05:30 IST