వణుకు పుట్టిస్తున్న కరోనా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 994 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-08-07T19:13:28+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 994 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 559 నమోదు కాగా, రంగారెడ్డిలో 415 కేసులు నమోదయ్యాయి.

వణుకు పుట్టిస్తున్న కరోనా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 994 కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 994 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 559 నమోదు కాగా, రంగారెడ్డిలో 415 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో 20 కేసులు నమోదు కాగా ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో 36 మందికి పాజిటివ్‌

షాద్‌నగర్‌ డివిజన్‌లో గురువారం 252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 36 మందికి పాజిటివ్‌ వచ్చింది. అందులో షాద్‌నగర్‌ పట్టణానికి చెందినవారు 9మంది ఉం డగా... కొత్తూర్‌కు చెందినవారు 8 మంది ఉన్నట్లు తెలిపారు. మిగతా 19 మంది ఇతర మండలాలకు చెందిన వారున్నారు.


చేవెళ్లలో యూనియన్‌ బ్యాంకు బంద్‌

 చేవెళ్ల యూనియన్‌ బ్యాంకులో పనిచేస్తున్న ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రెండురోజులుగా బ్యాంకు సేవలను నిలిపివేశారు. ఈనెల 8వ తేదీ వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని బ్యాంకు మేనేజర్‌ నోటిస్‌ బోర్డు ఏర్పాటు చేశారు. 


పట్నం డివిజన్‌లో 24 మందికి..

ఇబ్రహీంపట్నం డివిజన్‌లో గురువారం 189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్‌ అని తేలింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీలో 82 మందికి పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌ఎన్‌సీలో 39 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. మంచాల పీహెచ్‌సీలో ఏడుగురికి పరీక్షలు చేయగా ఒకరికి, ఎలిమినేడు పీహెచ్‌సీలో 22 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి, దండుమైలారం పీహెచ్‌సీలో 17 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి, మాడ్గుల మండలం ఇర్విన్‌ పీహెచ్‌సీలో ఐదుగురికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. యాచారం పీహెచ్‌సీలో ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా మంతన్‌గౌరెల్లికి చెందిన ఒకరు, యాచారానికి చెందిన ఒకరు, తాడిపర్తికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


ఆమనగల్లులో ఐదుగురికి కరోనా 

ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాల పరిధిలోని 24 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో గురువారం 167 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


కందుకూరులో ఐదుగురికి..

కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 48మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అందులో తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన నలుగురికి, హర్షగూడకు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాండూరులో 10 కేసులు నమోదు కాగా, నవాబ్‌పేటలో 2, మోమిన్‌పేట్‌లో 2, బంట్వారం, వికారాబాద్‌, పెద్దేముల్‌, బషీరాబాద్‌  మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  జిల్లాలో పాజిటివ్‌ కేసులు 583కు చేరుకోగా, వారిలో 290 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆసుపత్రిలో 29 మంది, హోంకేర్‌, హోం ఐసోలేషన్‌లో 261 మంది చికిత్స తీసుకుంటుండగా, 270 మంది కరోనా చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు జిల్లాలో 23 మంది మృతి చెందారు. 


ధారూరులో రెండు పాజిటివ్‌ కేసులు

ధారూరు గ్రామంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి రాజు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి కిట్లు అందజేసి వారి కుటుంబాలను హోంక్వారంటైన్‌ చేశామని ఆయన వివరించారు.


శామీర్‌పేట పీహెచ్‌సీలో 10 పాజిటివ్‌ కేసులు

శామీర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 89మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌ సోకినట్లు వైద్యులు చెప్పారు. తూంకుంటలో 3, శామీర్‌పేట 1, అలియాబాద్‌ 1, పోతారం 2, అల్వాల్‌ 1, జీడిమెట్ల 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. 


అధికారుల్లో కరోనా కలవరం

కరోనా నియంత్రణకు వైద్య సిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసు, స్థానిక సంస్థల అధికారులు ముందుండి పనిచేస్తున్నారు. దీంతో వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, తుమ్ములు వంటివి రాగానే వెంటనే పరీక్షలు చేయించుకుంటున్నారు. మేడ్చల్‌ జిల్లాలో ఒక అదనపు కలెక్టర్‌తోపాటు జడ్పీ సీఈవోతోపాటు పలువురు మండల అధికారులు, కలెక్టరే ట్‌తోపాటు మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వైద్య, పోలీసు సిబ్బందికి కూడా కరోనా వ్యాధి సోకింది. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. జిల్లాయంత్రాంగం అప్రమత్తమై అత్యవసరమైతేనే కార్యాలయాల్లోకి రావాలని అధికారులు కోరుతున్నారు. పలు శాఖల్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఫిర్యాదులను ఫిర్యాదు బాక్సులో వేయాలని సూచిస్తున్నారు. అధికారులను, సిబ్బందిని కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అనుమతి లేకుండా ఎవరూ రాకూడదని బోర్డులను పెట్టారు. ఒకవేళ అధికారిని కలిసినా భౌతిక దూరం పాటించేలా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాల్లో ఎవరికైనా కరోనా సోకితే సిబ్బంది ఆందోళనకు గురై సెలవులు పెడుతున్నారు. 


కార్యాలయాల్లో వద్ద శానిటైజర్‌ తప్పనిసరి

కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో కార్యాలయాల వద్ద శానిటైజర్‌ బాక్సులను ఏర్పాటు చేశారు. మాస్కులు లేకుండా ఎవరినీ కార్యాలయాల ప్రాంగణంలోకి  అనుమతించడంలేదు. కలెక్టరేట్‌తోపాటు పలు కార్యాలయాల వద్ద టెంపరేచర్‌ చూసిన తర్వాతనే అనుమతిస్తున్నారు.

Updated Date - 2020-08-07T19:13:28+05:30 IST