హైదరాబాద్‌లో అంతటా విస్తరిస్తున్న కరోనా.. ఇప్పటి వరకు కేసులు లేని చోట కూడా..

ABN , First Publish Date - 2020-05-27T16:04:05+05:30 IST

సంజీవరెడ్డినగర్‌, సుభాష్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ.. ఇలా కొత్త ఏరియాల్లోకి కరోనా ప్రవేశిస్తోంది. నిన్న, మొన్నటి వరకూ ఆయా ప్రాంతాల్లో దరిదాపుల్లో

హైదరాబాద్‌లో అంతటా విస్తరిస్తున్న కరోనా.. ఇప్పటి వరకు కేసులు లేని చోట కూడా..

కొత్త ఏరియాల్లో కరోనా...

గ్రేటర్‌ అంతటా విస్తరిస్తున్న వైరస్‌ 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): సంజీవరెడ్డినగర్‌, సుభాష్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ.. ఇలా కొత్త ఏరియాల్లోకి కరోనా ప్రవేశిస్తోంది. నిన్న, మొన్నటి వరకూ ఆయా ప్రాంతాల్లో దరిదాపుల్లో కూడా వైరస్‌ ఆనవాళ్లు లేవు. అక్కడ కూడా ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి చెందడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. 


మార్చి నెలలో కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకింది. కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులలో ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ మందికి వైరస్‌ సోకలేదు. మొదటి సారి కరోనా సోకిన మహేంద్రహిల్స్‌  ఏరియాలో కేవలం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికే పరిమితమైంది. అతనితో సన్నిహితంగా మెలిగిన తల్లిదండ్రులు, చికిత్సలు పొందిన ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఎవరికీ వైరస్‌ సోకలేదు. ఏప్రిల్‌లో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో ఎక్కువగా కరోనా కేసులు బయట పడ్డాయి. ఒక్కో కుటుంబంలో పదుల సంఖ్యలో వైరస్‌ బారిన పడ్డారు. ఎల్బీనగర్‌, వనస్థలిపురం సైదాబాద్‌, మలక్‌పేట, వనస్థలిపురం, జియాగూడ, ఆసిఫ్ నగర్‌, హయత్‌నగర్‌, మంగళ్‌హాట్‌ పరిసరాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. పలువురు గంజ్‌ వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, ఇతర జబ్బులున్న రోగులకు వైరస్‌ సోకుతుండడంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు కొత్త ఏరియాల్లో కూడా మహమ్మారి తిష్ఠ వేస్తోంది.  


ఆ ఏరియాల్లో పరిస్థితి ఇలా...

ప్రస్తుతం సంజీవరెడ్డినగర్‌ పరిసర కాలనీలోకి వైరస్‌ వ్యాపించింది. అయిదారు రోజుల క్రితం సుభా్‌షనగర్‌లో ఓ వృద్ధురాలికి వైరస్‌ సోకింది. ఆమె నుంచి కుటుంబ సభ్యులు ముగ్గురికి కరోనా వ్యాప్తి చెందింది. అశోక్‌ కాలనీలో ఓ యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రెండు వారాల క్రితం  గురుమూర్తి కాలనీలో మొదటి కరోనా కేసు నమోదు అయింది. ఓ జిమ్‌ ట్రైనర్‌కు వైరస్‌ రావడంతో అధికారులు అక్కడ చర్యలు కట్టుదిట్టం చేశారు. అదే ప్రాంతానికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారికి కూడా కరోనా సోకింది. మార్చిలో బల్కంపేటకు చెందిన ఇద్దరికి వైరస్‌ వచ్చింది. 


మూసాపేట సర్కిల్‌ పరిధిలోని అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో మొదటిసారి ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అక్కడి నుంచి పరిసరాల కాలనీల్లో వేగంగా వైరస్‌ విస్తరించింది. దాదాపు 24 మంది మహమ్మారి బారిన పడ్డారు. మూసాపేట్‌ డివిజన్‌ బబ్బుగూడకు చెందిన వృద్ధుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకునే వాడు. కరోనా సోకడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. 


కూకట్‌పల్లి సర్కిల్‌ ఎల్లమ్మబండలోని 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. అతని డ్రైవర్‌కు వైరస్‌ సోకింది. గాజులరామారం సర్కిల్‌ జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శేరిలింగంపల్లి సర్కిల్‌ పాపిరెడ్డికాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


బోరబండ బంజారానగర్‌లో మటన్‌ విక్రయించే వ్యక్తికి కరోనా సోకింది. అతని కుటుంబంలోని ఏడుగురి నమూనాలు సేకరించి పరీక్ష చేయగా అతని తల్లికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లో నివసిస్తున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని ఓం నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. 


బంజారాహిల్స్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ యువతికి మార్చిలో కరోనా సోకింది. ఆమె నుంచి ఎవరికీ వైరస్‌ విస్తరించలేదు. ఆ తర్వాత ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిచేసే అంకాలజిస్టుకు ఏప్రిల్‌లో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మణికొండలో అనుమానిత కేసు నమోదైంది. కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో ఓ సాఫ్ట్‌వేర్‌  ద్వారా అతని కుటుంబంలో నలుగురికి వైరస్‌ సోకింది. మియాపూర్‌ మాతృశ్రీనగర్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌ దంపతులకు  కరోనా ఉన్నట్లు తేలింది. 


భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్‌ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న  ఇద్దరికి కరోనా సోకింది. వారికి భోజనం తెచ్చే తండ్రికి, దుకాణంలో సహకరించే తల్లి వైరస్‌ బారిన పడ్డారు. ఇలా.. వారి కుటుంబంలోని ఎనిమిది మంది వైర్‌సతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో కొద్ది రోజులు బంగ్లాదేశ్‌ మార్కెట్‌ను బంద్‌ చేశారు. 


ఇంటి వరకే కట్టడి...

ఇంతకు ముందు పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంతం మొత్తాన్ని కట్టడి జోన్‌గా ప్రకటించి రాకపోకలను నియంత్రించే వారు. ఇప్పుడు కేసులు నమోదవుతున్న కొత్త ఏరియాల్లో.. పాజిటివ్‌ వచ్చిన ఇంటి వరకే కట్టడిని పరిమితం చేస్తున్నారు. 


గ్రేటర్‌లో మరో 38 మందికి...

గ్రేటర్‌లో తాజాగా 38 మందికి వైరస్‌ సోకింది. పహడీషరీఫ్‌లో మటన్‌ విక్రయాలు నిర్వహించే ఓ వ్యాపారి కుటుంబంలో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జియాగూడకు చెందిన బంధువులు పహడీషరీఫ్‌లో నివసించే వారి ఇంటికి రావడంతో వారికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. వృద్ధురాలు, ఆమె ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనమడు, ముగ్గురు పిల్లలు, బంధువులకు వైరస్‌ సోకింది. హర్షగూడ ప్రాంతంలో మటన్‌ విక్రయాలు జరిపే నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మటన్‌ విక్రయాలు జరిపే కుటుంబంలోని నలుగురికి కూడా పాజిటివ్‌ వచ్చింది. 


కొండాపూర్‌లో అయిదుగురికి..

కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా భార్య, కొడుకు(3), బామ్మర్ది, అతని కూతురుకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పాజిటివ్‌ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  

Updated Date - 2020-05-27T16:04:05+05:30 IST