వదలనంటోంది.. నెల్లూరులో 250, సూళ్లూరుపేటలో 126 కేసులు

ABN , First Publish Date - 2020-07-04T21:43:43+05:30 IST

మహమ్మారి కరోనా తగ్గనంటోంది. జిల్లావ్యాప్తంగా 849 పాజిటివ్‌ కేసులు ఉంటే నెల్లూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోనే 376 కేసులు ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగి ప్రమాదం ఉండటంతో

వదలనంటోంది.. నెల్లూరులో 250, సూళ్లూరుపేటలో 126 కేసులు

తగ్గనంటున్న కరోనా మహమ్మారి

సడలింపులతో మరింత ఉధృతి


నెల్లూరు (వైద్యం) : మహమ్మారి కరోనా తగ్గనంటోంది. జిల్లావ్యాప్తంగా 849 పాజిటివ్‌ కేసులు ఉంటే నెల్లూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోనే 376 కేసులు ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగి ప్రమాదం ఉండటంతో అన్ని వర్గాల్లో వణుకు మొదలైంది. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా నెల్లూరు నగరం మొత్తం వైరస్‌ విస్తరించేసింది. దీంతో రోజుకు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక సూళ్లూరుపేలో మొన్నటివరకు కోయంబేడుతో వణికిన పట్టణ వాసులకు ఇప్పుడు పరిశ్రమల దిగులు పట్టుకుంది. ఇక్కడ లాక్‌డౌన్‌ యథావిధిగా కొనసాతుండటంతో వ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.


నెల్లూరుపై కరోనా రక్కసి ప్రభావం తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాలకు వైరస్‌ విస్తరిస్తుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంది. ఇప్పటిదాకా 250 కేసులు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. మార్చి 9వ తేదీన ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు నగరానికి చెందిన విద్యార్థి తొలి కరోనా వైర్‌సకు గురికాగా ఏప్రిల్‌ నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారు, వీరితో కాంట్రాక్టు అయిన వారికి మహమ్మారి సోకింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఢిల్లీ ప్రభావం నగరంపై ఎక్కువగా ఉంది. కోటమిట్ట, మూలాపేట, సంతపేట, చిన్నబజార్‌, దర్గామిట్ట, వేదాయపాళెం తదితర ప్రాంతాలలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.


లాక్‌డౌన్‌ సడలింపుతో...

లాక్‌డౌన్‌ సడలింపులు, కంటైన్మెంట్‌ జోన్లలోనూ ప్రజల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో కరోనా తీవ్రరూపం దాల్చింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఇలా నగరమంతా వైరస్‌ విస్తరించేంది. 


సూళ్లూరుపేటలో భయం.. భయం

సూళ్లూరుపేటకు కరోనా కటకటాలుపడి 101 రోజులైంది. అయినా ఇక్కడ వైర్‌సకు కళ్లెమూ పడలేదు... పట్టణానికి గొళ్లెమూ తొలగలేదు. ఫలితంగా ఇక్కడి ప్రజల బతుకు స్తంభించిపోయింది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి చితికిపోతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి సూళ్లూరుపేట నిరవధికంగా  లాక్‌డౌన్‌లోనే ఉండిపోయింది. లాక్‌డౌన్‌ సడలించినా ఇక్కడ మాత్రం మోక్షం కలగలేదు. మార్చి 25 నుంచి మే 9వ తేదీ వరకు కరోనా కేసు లేకున్నా సూళ్లూరుపేటను రెడ్‌జోన్‌గానే అధికారులు ప్రకటించి కట్టడి చేశారు. ఆ 45 రోజుల్లో మాత్రం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు దుకాణాలు తెరుచుకునేలా అనుమతులు ఇచ్చారు. మే 10వ తేదీ నుండి  పట్టణాన్ని కరోనా ముట్టడించడంతో దుకాణాలు పూర్తిగా మూయించివేశారు. ఎక్కడికక్కడ బారీకేడ్‌లు కట్టి రాకపోకలు జరగకుండా స్తంభింపచేశారు. అయినా కరోనాకు కళ్లెం పడలేదు.  మే 10వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ 55 రోజుల్లోనే 126, రూరల్‌లో 19 కేసులు నమోదై అతలాకుతలం చేసేశాయి. కోయంబేడు ప్రభావం తగ్గిపోతున్న దశలో శ్రీసిటీ, మాంబట్టు సెజ్‌ల నుంచి కరోనా పడగవిప్పి సూళ్లూరుపేటపై బుసకొడుతోంది. 20 రోజులుగా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఇక్కడ నివసించే సుమారు 30 మంది కరోనా బారినపడ్డారు. 


నష్టాల ఊబిలో వ్యాపారులు

పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం 932 దుకాణాలు ఉన్నాయి. యజమానులతోపాటు మరో 3వేల మందికి ఈ దుకాణాలే జీవనాధారం. వీరందరూ 101 రోజులుగా ఉపాది కోల్పోయి అవస్థలు పడుతున్నారు. పలు దుకాణందారులు మూడు మాసాలుగా అద్దెలు కూడా చెల్లించలేని స్థితికి చేరిపోయారు. 


నిర్లక్ష్యం వీడాలి

సూళ్లూరుపేట పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నా ప్రజల్లో మాత్రం  చైతన్యం కలగడం  లేదు.  మొదట్లో కరోనా అంటే భయపడినా రోజులు గడిచేకొద్ది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతికదూరం పాటించాలనే విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. 


జాగ్రత్తలు పాటించాలి

పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. శ్రీసిటీ పరిశ్రమల  సిబ్బంది  చిత్తూరు జిల్లాలో కరోనా పరీక్షలు చేయించుకొని ఫలితం రాకముందే సూళ్లూరుపేటలో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.  అలాకాకుండా ఆ పరిశ్రమల యాజమాన్యాలు ఫలితం వచ్చేవరకు తమ  పరిశ్రమల వద్దే మకాం ఉండేలా చేయాల్సి ఉంది. అందుకు అధికారులు యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలి. అలాగే, మాస్క్‌లు లేకుండా భౌతికదూరం పాటించకుండా తిరిగేవారిని కట్టడి చేయాలి. ఇలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేగాని సూళ్లూరుపేటలో కరోనాకు కళ్లెంపడే పరిస్థితి లేదు. 

Updated Date - 2020-07-04T21:43:43+05:30 IST