అనారోగ్యంతోనే తల్లి అంత్యక్రియలకు.. అతడికి కరోనా అని ఆలస్యంగా తేలడంతో..

ABN , First Publish Date - 2020-07-06T21:01:51+05:30 IST

జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్‌(46)కు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నా

అనారోగ్యంతోనే తల్లి అంత్యక్రియలకు.. అతడికి కరోనా అని ఆలస్యంగా తేలడంతో..

హెడ్‌ కానిస్టేబుల్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌



మెదక్‌ అర్భన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్‌(46)కు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. అక్కడ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా సర్వేలైన్‌ అధికారి డా. నవీన్‌కుమార్‌ తెలిపారు. ఆయన ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 


తూప్రాన్‌లో మరొకరికి పాజిటివ్‌

తూప్రాన్‌ పట్టణంలో యువకుడికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వెల్ధుర్తి మండలం మాసాయిపేటకు చెందిన వ్యక్తి(30) తూప్రాన్‌ పట్టణంలోని రాంరెడ్డినగర్‌లోని పెంపుడుతల్లి వద్ద ఉంటున్నాడు. గత నెల 21 నుంచి ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. 28న ఆయన నిర్ధారణ పరీక్షలకు నమూనాలు ఇచ్చారు. ఈ నెల 1న పెంపుడు తల్లి మరణించడంతో అంత్యక్రియలకు విచ్చేశాడు. తాజాగా వచ్చిన ఫలితాల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. ఆయనతో పాటు దహనసంస్కారాల్లో పాల్గొన్న 100 మంది వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. 


హైదరాబాద్‌లో నివాసముంటున్న తూప్రాన్‌ పట్టణానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి ఓ ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్నాడు. పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అదే ఆస్పత్రిలో వైద్యం అందజేస్తున్నారు. 


కిరాణ షాపు నిర్వాహకుడికి పాజిటివ్‌

చేగుంట మక్కరాజుపేట రోడ్డులో కిరణా షాపు నిర్వహించే వ్యక్తి(50)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఐదు రోజుల క్రితం తీవ్రమైన దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా స్థానికంగా చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాదులోని చెస్ట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. ఆయన కాంటాక్టుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.


ఫచిన్నశంకరంపేట మండలంలోని అంబాజిపేట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీని హోంక్వారంటైన్‌ చేసినట్టు వైద్యాధికారి డాక్టర్‌ శ్రావణి ఆదివారం తెలిపారు. ఇటీవల జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి ఆయన వైద్యం చేయగా.. బాధితుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆర్‌ఎంపీని, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేసినట్లు వైద్యాధికారి తెలిపారు. 

Updated Date - 2020-07-06T21:01:51+05:30 IST