కాటేసిన కరోనా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-06-29T22:11:13+05:30 IST

ఉమ్మడి పాల మూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఆదివారం ఇద్దరు మృతి చెందగా, తొమ్మిది మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండీడ్‌

కాటేసిన కరోనా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరి మృతి

తొమ్మిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ


మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం): ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఆదివారం ఇద్దరు మృతి చెందగా, తొమ్మిది మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండీడ్‌ మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ గుండె సంబంధిత వ్యాధితో 25 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యింది. అప్పటికే ఆమెకు కరోనా పాజిటివ్‌ అని వైద్యులు నిర్ధారించారు. అక్కడే ఆపరేషన్‌ చేయించుకొని చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. 


- మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం గుబ్బడి తండాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. ఇతను గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. 


- కోయిలకొండ మండలం సోమ్లానాయక్‌ తండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పనిచేసే చోట కరోనా పరీక్షలు చేయడంతో అతడికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 


- బాలానగర్‌ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కూడా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ రోజూ వెళ్లి వచ్చేవారు. అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. 


- జిల్లా కేంద్రంలోని కొత్త గంజ్‌కు చెందిన వ్యక్తికి కూడా పాజిటివ్‌ అని తేలింది. 


- కొత్తచెరువు రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


- నవాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఓ మెడికల్‌ దుకాణం యజమానికి ఇటీవల కరోనా వచ్చింది. అయితే అతని ప్రైమరీ కాంటాక్టు కింద ఓ మహిళకు కరోనా వైరస్‌ సోకడంతో పాజిటివ్‌గా నిర్ధారించారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


- నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్‌దిన్నెకు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటి వ్‌గా నిర్ధారణ అయ్యింది. తిమ్మాజిపేట మండలంలోని ఇప్పలపల్లికి చెందిన రిటైర్డు టీచర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధంకాగా, అక్కడే ఉండి చికిత్స చేయించుకోవాలని గ్రామస్థులు, అధికారులు సూచించినట్లు సమాచారం. 


- నారాయణపేట మండలం కొల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. ఆయన ఈ నెల 27న హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం జిల్లా వైద్య అధికారులు, పోలీసులు కొల్లంపల్లి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాబడిన వ్యక్తి ఎంతమందిని కలిశాడో వారందరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి ముందస్తు చర్యలో భాగంగా హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. 


 - వనపర్తి జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇటీవల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రాగా అతడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించిన అధికారులు శాంపిల్స్‌ సేకరించి పరీక్షల కోసం పంపించారు. ప్రైమరీ కాంటాక్టుల్లో ఒకరైన పాన్‌గల్‌ మండలంలోని గోప్లాపూర్‌కు చెందిన వ్యక్తికి వైరస్‌ సోకినట్లు ఆదివారం నిర్దారణ అయింది. 

Updated Date - 2020-06-29T22:11:13+05:30 IST