కర్నూలులో కలకలం.. ఒకే ఇంట్లో కరోనాతో నలుగురి మృతి

ABN , First Publish Date - 2020-08-15T21:16:26+05:30 IST

కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం 12 మంది మృతి..

కర్నూలులో కలకలం.. ఒకే ఇంట్లో కరోనాతో నలుగురి మృతి

కర్నూలు(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం 12 మంది మృతి చెందారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 276కు చేరింది. గడచిన 14 రోజుల్లో 81 మంది కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జీజీహెచ్‌లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మృతి చెందిన వారిలో కర్నూలు నగర వాసులు 110 మంది ఉన్నారు. 


మరో 956 కేసులు

జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. శుక్రవారం మరో 956 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో బాధితుల సంఖ్య 32,012కు చేరింది. ఇందులో 9180 మంది చికిత్స పొందుతున్నారు. 22,556 మంది డిశ్చార్జి అయ్యారు. 


బండి ఆత్మకూరులో ఒకే ఇంట్లో 9 మందికి పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. 

రుద్రవరం మండలం నరసాపురం పీహెచ్‌సీలో 16, రుద్రవరం పీహెచ్‌సీలో 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

శిరివెళ్ల మండలంలో 12 మంది కరోనా బారిన పడినట్లు వైద్యాధికారులు తెలిపారు.

బేతంచెర్లలో ముగ్గురుకి వైరస్‌ సోకింది.

ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కొత్తగా 10 మందికి వైరస్‌ సోకింది. పెద్దకడుబూరు మండలంలో 6 కేసులు నమోదయ్యాయి. కొసిగిలో రెండు, జంపాపురంలో 2 కేసులు వచ్చాయి. 

ఆదోని పట్టణంలో 19, రూరల్‌లో 4 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పట్టణంలో ఏపీహెచ్‌బీ కాలనీలో 3, శ్రీనగర్‌ కాలనీలో 3, ఎస్‌కేడీ కాలనీలో 2 కేసులు వచ్చాయి. రూరల్‌లో ఇస్వి, మండగిరి, పెద్దహరివాణం, తిరుమలనగర్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.


తీరని విషాదం

ఆళ్లగడ్డ పట్టణంలోని ఒకే కుటుంబంలో నలుగురు కొవిడ్‌తో మృతి చెందారు. వియ్యంకుల కుటుంబాలు రెండూ ఉమ్మడిగా ఉంటున్నాయి. సీఎస్‌ఐ వద్ద ఉంటున్న వీరి ఇంట్లో ఓ వక్తికి గత నెల 14న కొవిడ్‌ సోకింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి చికిత్స పొందుతూ ఈ నెల 1న చనిపోయాడు. ఆ తరువాత ఆయన తల్లి, మామ, బావమరిదికి పాజిటివ్‌ వచ్చింది. వారు నంద్యాల కొవిడ్‌ వైద్యశాలలో చేరారు. తల్లి కొలుకోలేక మూడు రోజుల క్రితం మరణించింది. మామ రెండు రోజుల క్రితం, బావమరిది గత రాత్రి మృతి చెందారు. ఆ వ్యక్తి తండ్రికి వైరస్‌ సోకడంతో నంద్యాల శాంతిరామ్‌ కొవిడ్‌ వైద్యశాలలో చేరాడు. కాగా, ఆ వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులకు నెగిటివ్‌ వచ్చింది. కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో అంతులేని విషాదం నెలకొంది. 


Updated Date - 2020-08-15T21:16:26+05:30 IST