కృష్ణా జిల్లాలో.. కేవలం ఈనెల 12 రోజుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-08-13T12:22:03+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని మిగిలిన..

కృష్ణా జిల్లాలో.. కేవలం ఈనెల 12 రోజుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలిస్తే..

కరోనా.. హౖరానా..

ఈనెలలో ఒక్కసారిగా పెరిగిన బాధితులు

జిల్లాలో ప్రమాదకరస్థాయిలో వైరస్ వ్యాప్తి

కాస్త ఊరట కలిగిస్తున్న రికవరీ రేటు


విజయవాడ, ఆంధ్రజ్యోతి: జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో కరోనా ప్రభావం కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నా.. ప్రజల్లో భయం మాత్రం వీడట్లేదు. రోజూ వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు అంటే.. 12 రోజుల్లో మొత్తం 4,272 మందికి కరోనా సోకితే, వీరిలో 56 మంది మృత్యువాత పడ్డారు. మార్చి 21వ తేదీన పాతబస్తీలో మొదటి కేసు నమోదైంది. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన రోజు అంటే మే 21వ తేదీకి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 396. ఆ తరువాత కేసులు అనూహ్యంగా పెరిగాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత నుంచి జూలై 31వ తేదీ వరకు 6,843 కేసులు నమోదయ్యాయి. ఇదే భారీ పెరుగుదల అనుకుంటే.. కేవలం ఆగస్టు నెల 12 రోజుల్లో 4,272 కేసులు నమోదు కావడం ఆందోళన చెందాల్సిన విషయం. కాస్త ఊరటపడాల్సిన విషయం ఏంటంటే.. ఈ 12 రోజుల్లో రికవరీ రేటు కూడా బాగానే పెరిగింది. ఈ 12 రోజుల్లో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,250గా ఉంది. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల రేటు ఒక శాతాని కంటే తక్కువగా ఉంటే, జిల్లాలో రెండు శాతం కంటే ఎక్కువగా ఉంది.


335 మందికి వైరస్‌.. ఇద్దరు మృతి 

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 335 మందికి వైరస్‌ సోకింది. కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితులు మరణించారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,115కు చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 217కు చేరింది. కాగా, 24 గంటల్లో 244 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 3,907 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం ఒక్కరోజే జగ్గయ్యపేటలో 12 మంది వైరస్‌ బారినపడ్డారు. శివారులోని గొల్లపూడిలో ఒకే అపార్ట్‌మెంటులో ఐదుగురు వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో ఆరేళ్ల బాలిక కూడా ఉంది. గూడవల్లిలో నాలుగేళ్ల బాలుడికి కరోనా సోకింది. 


లాక్‌డౌన్‌ సడలించాకే..

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న మొదటి రెండు నెలలు జిల్లాలో కరోనా కాస్త అదుపులోనే ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక జనం బయటకు వచ్చి గుంపులుగా తిరగడంతో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో 11వేలకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో దాదాపు 90 శాతం పైగా కేసులు ఒక్క విజయవాడ పరిధిలోవే. మొదట్లో విజయవాడ నగరంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా కట్టడి చేశారు. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసులు 1,000 బెంచ్‌ మార్కుకు చేరుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. ఆ తర్వాత కట్టడి చేయడం మానేశారు. దీంతో వైరస్‌ వ్యాప్తి కట్టలు తెంచుకుని నగరం నుంచి శివారు ప్రాంతాలు, అక్కడి నుంచి పట్టణాలు, పల్లెలు.. ఇలా వాడవాడలా వ్యాపించి ఇప్పుడు ఏకంగా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక.. అంటే మే 21వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉలిక్కిపడిన జిల్లా యంత్రాంగం ఇటీవల మళ్లీ జిల్లావ్యాప్తంగా కంటైన్మెంట్‌ జోన్లు ప్రకటించినప్పటికీ తూతూమంత్రంగానే కట్టడి చేశారు. 


Updated Date - 2020-08-13T12:22:03+05:30 IST