భద్రాద్రి జిల్లాలో ముగ్గురికి... ఖమ్మం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-13T18:41:54+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

భద్రాద్రి జిల్లాలో ముగ్గురికి... ఖమ్మం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్

కొత్తగూడెం/పినపాక/ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పాల్వంచ, కొత్తగూడెంలోని బాబుక్యాంపు ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు నిర్ధారనైంది. ఈ నెల 9వ తేదీన కరోనా  లక్షణాలున్న పది మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆదివారం వచ్చిన నివేదికలో ముగురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. వీటితో జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసులు 55 కాగా వారిలో 25 యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. 


29మంది డిశ్చార్జ్‌ కాగా ఒకరు మృతి చెందినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీరితో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు నలుగురు, 32 మంది మైగ్రేటెడ్‌ వారికి కరొనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. మన జిల్లాకు చెంది ఇతర జిల్లాలు, రాష్ట్రాలలో పరీక్షలు చేయించగా 12మంది కరొనా పాజిటివ్‌ వచ్చిన వారున్నారన్నారు. ఈ నేపధ్యంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. ఆయా ప్రాంతాలను శానిటైస్‌ చేశారు. కరోనాపై అనుమానాలను నివృత్తి చేసేందుకు జిల్లాలో టెలి కౌన్సెలింగ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజలకు వైరస్‌పై అనుమానాలుంటే టెలి కౌన్సెలింగ్‌ సెంటర్‌లోని 7674809022, 08744-246655 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. 


హోం ఐసోలేషన్‌కు ఇద్దరు  

పినపాక మండలంలో ఏడూళ్లబయ్యారానికి చెందిన ఇద్దరు కరొనా బాధితులను ఆదివారం హోం ఐసోలేషన్‌కు పంపారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు 15 రోజులు క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో ఒకరిని హైదరాబాద్‌, మరోకరిని మణుగూరులో ఐసోలేషన్‌కు పంపారు. అయితే ప్రస్తుతం వారిలో కరోనా లక్షణాలు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు డిశ్చార్జ్‌ చేసి 14రోజులు హోం ఐసోలేషన్‌కు పంపినట్లు పినపాక ప్రభుత్వాసుపత్రి వైద్యులు డా. శివకుమార్‌ తెలిపారు.  


ఖమ్మం జిల్లాలో పాజిటీవ్‌ కేసు

ఖమ్మం జూబ్లీపురాకు చెందిన  ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Updated Date - 2020-07-13T18:41:54+05:30 IST