తలసేమియా ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు ఓ బాలిక.. కరోనా వచ్చిందని వెంటనే వెనక్కు..!

ABN , First Publish Date - 2020-07-07T18:15:13+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం మరో ఆరుగురు ఈ మహమ్మారి బారిన పడ్డారు.

తలసేమియా ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు ఓ బాలిక.. కరోనా వచ్చిందని వెంటనే వెనక్కు..!

ఖమ్మం జిల్లాలో ఐదుగురు, భద్రాద్రిలో ఒకరికి నిర్ధారణ

బాధితుల్లో ఓ తలసీమియా బాధిత యువతి 

భద్రాద్రి కలెక్టరేట్‌లో ఒకరికి లక్షణాలు

ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఆదేశాలు


ఖమ్మం సంక్షేమ విభాగం/కొత్తగూడెం (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం మరో ఆరుగురు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో ఖమ్మం జిల్లాలో ఐదుగురు, భద్రాద్రి జిల్లాలో ఒకరున్నారు. ఈ క్రమంలో ‘కొవిడ్‌-19’ బారిన పడిన ఓ బాలింత ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కన్నుమూసింది. ఇక నిత్యం ప్రాణాపాయంతో ఉండే తలసీమియా బాధితులను కరోనా మహమ్మారి వదలటం లేదు. అరోగ్యం సరిగా లేకపోవటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లిన ఓ తలసీమియా యువతికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్‌ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల యువతి తలసీమియాతో బాధపడుతూ ఆపరేషన్‌ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయటంతో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో అపరేషన్‌ కాకుండానే బాలికను వెంటబెట్టుకొని తల్లిదండ్రులు వెనుదిరిగారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యసేవలకు వచ్చిన చింతకాని మండలం కొమట్లగూడేనికి చెందిన ఓ బాలింతకు కరోనా పాజిటివ్‌ రాగా.. చికిత్స పొందుతూ జిల్లా ఆసుపత్రిలోనే మృతిచెందింది. వీరితో పాటు జిల్లా ఆసుపత్రిలో మరో ముగ్గురికి కూడా నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ వర్గాలు ప్రకటించాయి. వీరిలో ఒక పేషంట్‌ కేర్‌ ఉద్యోగి, ల్యాబ్‌ శిక్షణకు వచ్చిన ఓ విద్యార్థితో పాటుగా మరో కిందిస్థాయి మహిళా ఉద్యోగి ఉన్నారు.  


భద్రాద్రి కలెక్టరేట్‌లో కలకలం

కరోనా మహమ్మారి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో కలకలం రేపింది. కలెక్టరేట్‌లో పనిచేసే ఓ జూనియర్‌ అసిస్టెంట్‌కు సోమవారం పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో కలెక్టరేట్‌లో పనిచేసే సిబ్బందిలో కలవరం మొదలైంది. సదరు ఉద్యోగి ఖమ్మం నుంచి విధులకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మూడు రోజులుగా కరోనా లక్షణాలు కన్పించడంతో  రెండు రోజుల క్రితం వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం ఆయనకు  పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారందరిని క్వారైంటన్‌లో ఉండాలని ఆదేశించారు. 


భయపాడాల్సిన అవసరం లేదు : కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కలెక్టరేట్‌లోని ఓ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయినంత మాత్రాన ఇతర సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సిబ్బంది, వైద్యాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదరు ఉద్యోగి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, కానీ కరోనా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ క్రమంలో సిబ్బంది అందరికి వారంపాటు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కరోనాపాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఆరోగ్యపరిస్థితి గురించి కలెక్టర్‌ ఫోన్‌లో తెలుసుకున్నారు. కరోనాపై అపోహాలు, సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో 24గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, 08744 246655, 7674809022నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత, వైద్యాదికారులు భాస్కర్‌, రమేష్‌ కలెక్టరేట్‌ పరిపాలనాధికారి గన్యానాయక్‌, రంగాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-07T18:15:13+05:30 IST