వైరస్‌.. విలయం.. గుంటూరు జిల్లాలో 68 మందికి పాజిటివ్‌.. ఓ ఎమ్మెల్యేకు కూడా..

ABN , First Publish Date - 2020-07-04T17:55:13+05:30 IST

కరోనా.. కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. జిల్లాలో శుక్రవారం 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 26 కేసులు వెలుగు చూశాయి.

వైరస్‌.. విలయం.. గుంటూరు జిల్లాలో 68 మందికి పాజిటివ్‌.. ఓ ఎమ్మెల్యేకు కూడా..

గుంటూరు నగరంలో 26 కేసులు

ఓ ఎమ్మెల్యేకు కరోనాతో కలకలం

గుంటూరులో ట్రాన్స్‌కో అధికారికి పాజిటివ్‌

యడ్లపాడులో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా 

ఏఎన్‌యూ అవుట్‌ సోర్సింగ్‌ విభాగంలో ఓ ఉద్యోగినికీ..

వినుకొండలో మృతి చెందిన ఓ వృద్ధురాలికి పాజిటివ్‌గా నిర్ధారణ


ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌: కరోనా.. కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. జిల్లాలో శుక్రవారం 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 26 కేసులు వెలుగు చూశాయి. డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. గుంటూరు నగర పరిఽధిలో లక్ష్మీపురంలో ఐదు,  శ్రీనగర్‌, సంజీవయ్య నగర్‌, కన్నావారితోటలో రెండేసి కేసులు గుర్తించారు. కృష్ణనగర్‌, సంపత్‌నగర్‌, చౌత్రా, ఎస్‌వీఎన్‌కాలనీ, శ్రీనివాసరావుతోట, తారకరామానగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, రైలుపేట, వర్కర్స్‌కాలనీ, సంగడిగుంటలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గుంటూరులోని ట్రాన్స్‌కో విభాగంలో ఓ జూనియర్‌ ఇంజనీర్‌కు కరోనా సోకింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో ఆ శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జూనియర్‌ ఇంజనీర్‌తో సన్నిహితంగా ఉన్న వారు హోం క్వారైంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించినట్లు సమాచారం.


జూనియర్‌ ఇంజనీర్‌ కార్యాలయంతో పాటు పొన్నూరు రోడ్డులోని విద్యుత్‌ భవన్‌లో శని, ఆదివారాలు పూర్తిగా శానిటైజేషన్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ ఎం విజయకుమార్‌ తెలిపారు. ఈ రెండు రోజులు ఉద్యోగులతో పాటు వినియోగదారులెవరికీ విద్యుత్‌ కార్యాలయంలోకి అనుమతి లేదన్నారు. ఇక జిల్లాలో రెంటచింతలలో ఏడు, తెనాలిలో ఐదు, తాడేపల్లి, నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్లలో మూడేసి కేసులు నమోదయ్యాయి. మాచర్ల, గురజాల, యడ్లపాడులో రెండేసి, మంగళగిరి, అమరావతి, తాడికొండ, వినుకొండ, పొన్నూరు, కొల్లిపర, బాపట్ల, దుగ్గిరాల, చేబ్రోలు, దుర్గి, రొంపిచెర్ల, బొల్లాపల్లి మండలాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. క్వారంటైన్‌ సెంటర్‌లో ఓ వ్యక్తికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది


- తెనాలిలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఆలపాటినగర్‌, చినరావూరు ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ వద్ద, చెంచుపేట జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో, నాజరుపేట, ఐతానగర్‌ ప్రాంతాలకు చెందిన వారికి వైరస్‌ సోకింది. కొల్లిపరలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఇతడు ఇటీవల హైదరాబాద్‌ నుంచి కొల్లిపర వచ్చినట్లు అధికారులు గుర్తించారు.  కొల్లిపర మండలం దావులూరిపాలెంలో పాజిటివ్‌ వచ్చింది.  


- యడ్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్‌ లక్ష్మానాయక్‌ తెలిపారు. ఇటీవల చిలకలూరిపేట రూరల్‌లో ఓ అధికారికి పాజిటివ్‌ సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా గుర్తించారు.  కానిస్టేబుళ్లు రమణయ్యపేటలో నివాసం ఉంటుండటంతో దానిని రెడ్‌జోన్‌గా చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట రూరల్‌ సర్కిల్‌లోని అధికారులు, సిబ్బందికి నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం స్వాబ్‌ నమూనా పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులలో ఆయా ఫలితాలు రానున్నాయి.  


- సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్నఓ ఉద్యోగికి కరోనా వచ్చింది. తెనాలి నుంచి నిత్యం విధులకు హాజరయ్యే అతడు జ్వరంతో బాధపడుతుండటంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆ ఉద్యోగి తెనాలిలో హోంక్వారంటైన్‌లో ఉంటున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగాన్ని  సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించారు. 


అమరావతి మండలం ధరణికోటలో ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. సెల్‌పాయింట్‌లో పనిచేసే యువకుడికి తొలి పాజిటివ్‌ కేసు నమోదు కాగా అతడి ద్వారా ఇతడికి వ్యాపించి ఉండవచ్చని డాక్టర్‌ శ్రీజ్యోతి తెలిపారు.


దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. పెయింటర్‌గా పనిచేసే ఇతడ్ని మంగళగిరి ఎన్నారై వైద్యశాలకు తరలించారు.  


ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పాజిటివ్‌ అని తేలింది. పరీక్షా భవన్‌లో విధులు నిర్వహించే అవుట్‌ సోర్సింగ్‌ మహిళా ఉద్యోగినికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెతో దగ్గర సంబంధాలున్న మరో ఇద్దరిని వైద్యులు పరీక్షల నిమిత్తం తీసుకెళ్ళారు.  


 మాచర్ల రామాటాకీస్‌ లైన్‌లోని ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్‌లో ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. అవివాహితుడైన ఇతడు స్థానిక శ్రీశైలంరోడ్డులో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నారు. ఇటీవల సదరు ఉద్యోగి వివిధ పనుల నిమిత్తం విజయవాడ వెళ్లి రాగా అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. ఈ క్రమంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం నుంచి బ్యాంకులో లావాదేవీలను నిలిపివేశారు. దుర్గిలో ఇటీవల జరిగిన హత్యకేసులో ప్రధాన నిందితుడికి పాజిటివ్‌గా తేలింది. నిందితుడ్ని శుక్రవారం న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉన్న అతడికి పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలడంతో గుంటూరు తరలించారు.


పొన్నూరులోని 12వ వార్డుకు చెందిన ఓ యువకుడికి పాజిటివ్‌తో అధికారులు  ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా చేశారు. ఈ యువకుడు రెండు నెలలుగా కామెర్లతో చికిత్స పొందుతున్న క్రమంలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. కంటైన్మెంట్‌ జోన్‌ను  తహసీల్దార్‌ డి.పద్మనాభుడు, మున్సిపల్‌ కమిషనర్‌ పి.వెంకటేశ్వరరావు, మెడికల్‌ ఆఫీసరు డాక్టర్‌ పి.రత్నబాబు, అర్బన్‌ సీఐ పేర్లి ప్రేమయ్య తదితరులు సందర్శించి స్థానికులను అప్రమత్తంచేశారు.  


చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఓ మహిళకు పాజిటివ్‌గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో పనిచేస్తుంది.


కారంపూడి మండల పరిధిలోని ఓ పీహెచ్‌సీ వైద్యాధికారికి పాజిటివ్‌గా తేలింది. వారం రోజులుగా జ్వరం వస్తూ తగ్గకపోవడంతో ఆయనే స్వయంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో పాజిటివ్‌గా తేలడంతో గుంటూరు క్వారంటైన్‌కు వెళ్లారు. 


తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో మరో కేసు నమోదైంది. ఈ వ్యక్తి భార్యతో కలిసి ఇటీవల బంధువు చనిపోవటంతో దుగ్గిరాల మండలం చిలువూరి గ్రామానికి వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యంగా ఉండటంతో దంపతులు వైద్య పరీక్షలు చేయించుకోగా అతడికి పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మహిళకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. 


నరసరావుపేటలో ముగ్గురికి పాజిటివ్‌ నమోదైంది. పట్టణంలోని ఆవుల సత్రం ప్రాంతంలో ఓ యువతికి కరోనా సోకింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ యవకుడికి, మండలంలోని కొండ కావూరులో ఒకరికి కరోనాగా నిర్ధారించారు.


వినుకొండ హనుమాన్‌నగర్‌లో కరోనాతో వృద్ధురాలు మృతిచెందడంతో అధికారులు సంఘటనా ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించి  ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈమె అనారోగ్యంతో జూన్‌ 27న గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే నెల 29న మృతి చెందింది. చికిత్సలో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా గుర్తించారు.   


రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో రెండు కేసులతో  గ్రామంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఇటీవల పెద్దసంఖ్యలో గ్రామానికి ప్రజలు వస్తుండటంతో వలంటీర్లు మండల స్థాయి అధికారులకు వారి వివరాలు తెలియ జేస్తున్నారు.  


రెంటచింతలలో ఓ రాజకీయనేత కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్‌ అని ఆసుపత్రికి తరలించడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే ఆ నేతకు సంబంధించి నెగెటివ్‌ రిపోర్టును శుక్రవారం రాత్రి వైద్యులు ధృవీకరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. 


ఆందోళనలో అధికారులు

ఆయనో ఎమ్మెల్యే. ఇటీవల కరోనా టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ విషయం తెలియక ఆయన రెండు మూడు రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ ఎమ్మెల్యేకు పాజిటివ్‌ వచ్చిందన్న విషయం శుక్రవారం బయటకు పొక్కింది. దీంతో ఇటీవల ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆందోళన పడుతున్నారు.  ఈ నెల 1న జీజీహెచ్‌లో క్యాన్సర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో ఆ ఎమ్మెల్యేతో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎంపీలు, 10 మందికి పైగా ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  దాదాపు నాలుగు గంటలకు పైగానే ఎక్కువ మంది కరోనాకు గురైన  ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఆయన కలెక్టరేట్‌కు రాగా పాజిటివ్‌ విషయం తెలియడం.. అంతకముందు ఆయనతో కరచాలనం చేసిన వారు కూడా ఆందోళళ చెందుతున్నారు.  

Updated Date - 2020-07-04T17:55:13+05:30 IST