గుంటూరు జిల్లాలో.. కేవలం నెల రోజుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-08-10T12:54:17+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో కేవలం నెల రోజుల్లోనే జిల్లా పరిస్థితి..

గుంటూరు జిల్లాలో.. కేవలం నెల రోజుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలిస్తే..

నెలలో విలయం!

3 వేల నుంచి 23 వేలకు పెరిగిన కరోన పాజిటివ్‌ కేసులు

తొమ్మిది రెట్లు పెరిగిన మరణాలు

41 నుంచి 21 శాతానికి పడిపోయిన రికవరీ రేటు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో కేవలం నెల రోజుల్లోనే జిల్లా పరిస్థితి తారుమారు అయింది. గత నెల 9వ తేదీ వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు, ఈ నెల అదే తారీఖు వరకు వచ్చినవి పోల్చితే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. రోజుకు సగటున 700 పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు అయితే ఈ 30 రోజుల్లో భారీగా పెరిగిపోయాయి. కేసులు పెరగడం వలన డిశ్చార్జ్‌ రేటు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా అప్పటివరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి లోపే ఉన్న పాజిటివ్‌ కేసులు నేడు 11 రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  


లాక్‌డౌన్‌ ఎత్తివేశాక వైరస్‌ విస్తరిస్తుందని అంచనా వేశారే తప్ప ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఏ ఒక్కరి ఆలోచనలకు అందలేదు. కేంద్రం నుంచి వచ్చిన బృందాలు కూడా ఇదే విషయాన్ని వెళుతూ నొక్కి వక్కాణించాయి. జిల్లా ప్రజల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా కరోనా విషయంలో నిర్లక్ష్య ధోరణి పెరిగిపోవడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణంగా మారింది. ముఖ్యంగా మిర్చియార్డు వద్ద అయితే కార్మికులు అసలు మాస్కులు ధరించడం లేదు. సామాజికదూరం పాటించడం లేదు. కాకా హోటళ్లలో అయితే వంట చేసేవారు, వడ్డించేవారు మాస్కులను గడ్డానికి తగిలించుకొంటున్నారు.  ఇవన్నీ జిల్లాని కరోన ఉద్ధృతి కేంద్రంగా మార్చేశాయి. 


Updated Date - 2020-08-10T12:54:17+05:30 IST