గుంటూరులో.. తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-08-02T12:35:01+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు..

గుంటూరులో.. తగ్గని కరోనా ఉధృతి

మరో వెయ్యి!

గుంటూరులో అత్యధికంగా 333

పిడుగురాళ్లలో 94 కేసులు

కొవిడ్‌ వారియర్‌గా కలెక్టర్‌ 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా నమోదు అవుతున్నట్లుగానే శనివారం ఒక్క రోజే పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,001గా నమోదైంది. గుంటూరు నగరంలో అత్యధికంగా 333 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. అనూహ్యంగా పిడుగురాళ్లలో ఒక్క రోజులోనే 94 మందికి వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తెనాలి పట్టణంలో శనివారం 13, రూరల్‌ మండలంలోని సోమసుందరపాలెం, సంగం జాగర్లమూడి, అగ్రహారంలలో ఒక్కొ కేసు నమోదయ్యాయి. కాగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్‌ లేకపోవడంతో కొవిడ్‌ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మహిళా వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా కొన్ని గంటలు అక్కడే ఉంచడంతో వార్డులో మిగిలిన బాధితులంతా తీవ్ర ఆందోళన చెందారు.


రాజుపాలెం మండలంలో 25 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిణి భువనేశ్వరి తెలిపారు. పొన్నూరు 149 మందికి  పరీక్షలు చేయగా, వారిలో 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని మెడికల్‌ ఆఫీసరు డాక్టర్‌ పి.రత్నబాబు తెలిపారు. నరసరావుపేట పట్టణంలో 49 మందికి కరోనా పాజిటివ్‌ శనివారం నిర్ధారించారు. మండలంలోని గ్రామాలలో 14 కేసులు నమోదయ్యాయి.  మంగళగిరి పట్టణంలో  17 మందికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


కరోనాను జయించిన కలెక్టర్‌ 
గుంటూరు(ఆంధ్రజ్యోతి): రెండు వారాల క్రితం కరోనా బారిన పడిన  కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ కొవిడ్‌-19 వారియర్‌గా మారారు. కలెక్టర్‌తో పాటు ఆయన సతీమణి, కుమారుడు కూడా కరోనాని జయించారు. శుక్రవారం నిర్వహించిన టెస్టుల్లో కలెక్టర్‌కు నెగెటివ్‌ రావడంతో ఆయన శనివారం ఉదయమే విధులకు హాజరయ్యారు. ఆయనకు  జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పీ ప్రశాంతి, స్పెషల్‌ కలెక్టర్‌ బాబూరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌వీవీ సత్యన్నారాయణ, ఏవో మల్లికార్జునరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తన హోం ఐసోలేషన్‌ అనుభవాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజలతో పంచుకొన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, వైద్యులు కల్యాణ్‌ చక్రవరి, డాక్టర్‌ మాధవి సలహాలు తీసుకొంటూ కొవిడ్‌పై పోరాడం జరిగింది. నాకు ఏ రోజు శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీలు దాటలేదు.

ఆక్సిజన్‌ లెవల్‌ 97కి తగ్గలేదు. నిత్యం  ప్రాణాయామం చేశాను. సీ విటమిన్‌, పారసిటమాల్‌, జింక్‌, డీ విటమిన్‌ ట్యాబ్లెట్లు వైద్యుల సలహా మేరకు తీసుకొన్నా. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ అని తెలియగానే తాను కుంగిపోలేదు. పుుస్తక పఠనం చేశానని పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారు ప్రశాంతంగా ఉండటంతో పాటు వైద్యుల సలహా తీసుకొంటే కొవిడ్‌ని జయించ వచ్చు అని అన్నారు. కాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ యాస్మిన్‌ కూడా కరోనాపై విజయం సాధించారు. ఆమె కూడా హోం ఐసోలేషన్‌లోనే ఉండి వైద్యం తీసుకొన్నారు. శనివారం విధులకు హాజరయ్యారు. 

Updated Date - 2020-08-02T12:35:01+05:30 IST