ఊపిరి ఉక్కిరిబిక్కిరి.. తూ.గో.లో అంతకంతకు పెరుగుతున్న కొవిడ్‌ మరణాలు

ABN , First Publish Date - 2020-08-14T14:41:27+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మరణాలు అంతకంతకు పెరుగుతుండడం వెన్నులో..

ఊపిరి ఉక్కిరిబిక్కిరి.. తూ.గో.లో అంతకంతకు పెరుగుతున్న కొవిడ్‌ మరణాలు

ఇప్పటివరకు అధికారికంగా 325 మంది కన్నుమూత

ఇందులో 282 మంది బాధితులు కొవిడ్‌ ఆస్పత్రుల్లోనే మృతి

చికిత్స కోసం వస్తూ దారి మధ్యలో 23 మంది మరణం

వైరస్‌తో ఇంట్లో పది మంది కన్నుమూత.. వారంలో మరణాలు 43 

అటు రాష్ట్ర బులిటెన్‌లో మాత్రం 248గా చూపుతున్న ప్రభుత్వం

77 మరణాలకు సంబంధించి లెక్కల్లో మిస్టరీ


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ మరణాలు అంతకంతకు పెరుగుతుండడం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైరస్‌ బారినపడి ఏకంగా తనువు చాలిస్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండడం అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటివరకు తూర్పులో 325 మంది వైరస్‌తో చనిపోయినట్టు జిల్లా అధికారులు తాజా నివేదికల్లో నిర్ధారించారు. ఇందులో 282 మంది ఏకంగా కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటూ మరణించినట్టు తేల్చారు. 23  మంది ఆస్పత్రికి వస్తూ, మరో పది మంది ఇంట్లోనే చనిపోయారు. ఈ మరణాల వెనుక కొంతవరకు అధికారుల వైఫల్యాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ బులిటెన్‌లో మాత్రం కొవిడ్‌ మృతులు 248గానే చూపుతోంది. అంటే 77 మంది మృతులు ఏమయ్యారనే లెక్కలు మాత్రం మిస్టరీగా మారాయి.


మన జిల్లా 36 వేలకుపైగా పాజిటివ్‌ కేసులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. నిత్యం వెయ్యికిపైగా బాధితులు వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇలా కొవిడ్‌ సోకి మరణిస్తున్నవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. జిల్లాలో వైద్యసేవల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైరస్‌ ముదిరే వరకు కేసులు నిర్ధారించే పరిస్థితి లేకపోవడం, హోంఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఏ ఆపద వచ్చినా సకాలంలో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడం, ఒకవేళ ప్రైవేటు అంబులెన్స్‌లో వెళ్లినా అక్కడ ఆదరించి చికిత్స వేగంగా అందించే పరిస్థితులు లేకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తున్నాయి. దీంతో గంటల వ్యవధిలోనే అనేకమంది చికిత్సల్లో లోపం కారణంగా కన్నుమూస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 325 మంది కొవిడ్‌ సోకి చనిపోయారు. ఈ లెక్కలు జిల్లా అధికారులు తమ అంతర్గత నివేదికల్లో నిర్ధారించినవే. బయటకు మాత్రం రోజువారీ జిల్లా బులిటెన్‌లో ఇవేవీ ప్రస్తావిం చడం లేదు.


కొవిడ్‌తో కన్నుమూసిన 325 మందిలో 43 మంది ఈవారం వ్యవధి లోనే మృతి చెందారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అనధికారిక మృతుల సంఖ్య 600కిపైగానే ఉంటుందని మృతుల తాలుకా బంధువుల ఆరోపణలు బట్టి అర్థం అవుతోంది. అధికారిక లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా కొవిడ్‌ ఆసుపత్రుల్లోనే 282 మంది చనిపోయినట్టు లెక్కలు తేలడం వణుకు పుట్టిస్తోంది. వాస్తవానికి పాజిటివ్‌ వచ్చిన ఆసుపత్రుల్లో చేరితే బతికి ఆరోగ్యంగా బయటకు వస్తామనే ధీమా బాధితుల్లో ఉంటుంది. కానీ చికిత్స తీసుకుంటూ మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం కలవరపరుస్తోంది. వాస్తవానికి పాజిటివ్‌ సోకిన వారికి లక్షణాలు ఎక్కువైతే అత్యవసర చికిత్స అందించడం కొంతవరకు ఆలస్యం అవుతోందనే ఆరోపణలున్నాయి.


ఈక్రమంలో చికిత్స ప్రారం భించిన 48 గంటల్లోనే చనిపోతున్న వారు అధికంగా ఉంటున్నట్టు వైద్యులు వివరి స్తున్నారు. అంటే అప్పటికే పరిస్థితి విషమించడం, హోం ఐసో లేషన్‌లో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం ప్రారంభిం చేలోపు చేయిదాటిపోవడం వంటి కారణాలు మృతుల సంఖ్య పెరగడానికి దారితీస్తోంది. పైగా కొవిడ్‌ ఆసుపత్రుల్లో అధిక మరణాలు కాకినాడ జీజీహెచ్‌, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికంగా చోటుచేసుకుంటున్నాయి. కొవిడ్‌తోపాటు ఇతర అనా రోగ్య లక్షణాలు కూడా పాజిటివ్‌ వచ్చిన తక్కువ వ్యవధిలోనే చనిపోవడానికి దారితీస్తోందని కొవిడ్‌ వైద్యులు విశ్లేషిస్తున్నారు. 


సకాలంలో అంబులెన్సు రాక..

వేలల్లో కేసులతో పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసోలేష న్‌కు అనుమతించడం జిల్లాలో బాగా పెరిగింది. అయితే ఇలా హోంఐసోలేషన్‌లో ఉంటున్నవారిలో కొందరు అకస్మాత్తుగా శ్వాస ఆడక కన్నుమూస్తున్నారు. కొందరు అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్‌లు ఫోన్‌ చేస్తే సకాలంలో రాక, తీరా చివరి నిమిషంలో ఆసుపత్రులకు చేరి వైద్యం తీసుకుంటూ చనిపో యిన వారు అధికంగా ఉన్నారు. ఇలా జిల్లాలో వైద్యం కోసం వస్తూ దారి మధ్యలో 23 మంది చనిపోయారు. మరికొందరు ఆస్పత్రుల్లో చనిపోయిన తర్వాత పాజిటివ్‌గా ధ్రువీకరణ అవు తోంది. దీంతో బాధితుల గుర్తింపులో జాప్యమే ఇందుకు కారణ మనే విమర్శలున్నాయి.


ఆ 77 మంది మిస్టరీ ఏంటో...

జిల్లాలో 325 మంది కొవిడ్‌తో చనిపోయిన్లు అధికారులు నిర్ధారించగా, రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తోన్న బులిటెన్‌లో మాత్రం మరణాలను తక్కువ చేసి చూపుతోంది. గురువారం విడుదల చేసిన వివరాల్లో జిల్లాలో మృతులు 248గానే చూపించింది. అంటే చనిపోయిన 77 మంది వివరాలు ఏవి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈవివరాలు జిల్లా అధికారులు నమోదు చేయలేదా? లేదంటే రాష్ట్రప్రభుత్వం పక్కనపడేసిందా అనేది తేలక మిస్టరీగా మారింది. మరోపక్క తేలని 77 మరణాల్లో మృతిచెందిన వారి పేర్లు ఏవనేది తేల్చడం అసాధ్య మని అధికారులు వివరిస్తున్నారు.


Updated Date - 2020-08-14T14:41:27+05:30 IST