కాస్త ఊరట

ABN , First Publish Date - 2020-05-27T08:40:38+05:30 IST

జిల్లాలో రెండు నెలలుగా కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతూనే ఉంది. సోమవారానికి జిల్లాలో అధికారికంగా 440 ..

కాస్త ఊరట

జిల్లాలో కరోనా కేసులు నిల్‌ 

పరీక్షలు నిలిపివేయడంపై విమర్శలు 



జిల్లాలో కరోనా మహమ్మారి నుంచి కాస్త ఊరట లభించింది. మంగళవారం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 440 దగ్గర నిలకడగానే ఉంది. 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో  రెండు నెలలుగా కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతూనే ఉంది. సోమవారానికి జిల్లాలో అధికారికంగా 440 మంది కరోనా బారిన పడగా, 17 మంది మరణించారు. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించి, నాలుగో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకునుగుణంగానే పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జిల్లాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ కేసులు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతుండటంపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రధానంగా విజయవాడ నగరంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ జిల్లా అధికారులు ప్రజలకు వైద్య పరీక్షలు చేయడం నిలిపివేశారు. పరీక్షలు ఎంత ఎక్కువగా నిర్వహిస్తే అంత త్వరగా కరోనా తీవ్రతను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లా వైద్యాధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించినప్పుడు జిల్లాలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం టెస్టులు నిర్వహించడం లేదు. వైరస్‌ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు బయటపడి తీవ్రమైన దగ్గు, ఆయాసం, జ్వరంతో బాధపడుతూ కొవిడ్‌ ఆసుపత్రికి వెళ్లి ఇన్‌పేషెంట్‌గా చేరితేనే పరీక్షలు చేస్తామంటున్నారు.


  ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు కరోనా పరీక్షలు నిర్వహించాలని అడుగుతున్నా వైద్యాధికారులు స్పందించకపోవడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే జిల్లాలో పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయనేది మరికొందరి వాదన. దీనిపై వివరణ కోరేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రమేష్‌కు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. ఆయన తన కార్యాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.  

Updated Date - 2020-05-27T08:40:38+05:30 IST