లక్షన్నర దాటేసి...

ABN , First Publish Date - 2020-08-02T08:46:59+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి

లక్షన్నర దాటేసి...

  • రాష్ట్రంలో కరోనా కల్లోలం
  • 9276 కేసులు.. 58 మరణాలు
  • 4 జిల్లాల్లో వెయ్యికి పైగా...  మొత్తం పాజిటివ్‌లు 1,50,209
  • రికార్డు స్థాయిలో రికవరీలు.. ఒకేరోజు 12,750 మంది డిశ్చార్జి 

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం 60,797మందికి పరీక్షలు నిర్వహించగా 9,276కి వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 1,50,209కి చేరాయి. తాజాగా అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే కేసుల సంఖ్యలో జాతీయ స్థాయిలో మూడోస్థానానికి వచ్చిన ఏపీ ఇప్పుడు తమిళనాడుతో పోటీకి సిద్ధమవుతోంది. మరోవైపు శుక్రవారం 58మంది కరోనాతో మరణించారు. తూర్పుగోదావరి, విశాఖపట్నంలలో 8మంది చొప్పున, గుంటూరులో ఏడుగురు, అనంతపురం, చిత్తూరు, కర్నూలుల్లో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడపలో ఒక్కరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 1,407కు చేరాయి.


తాజాగా 24గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 12,750మంది కోలుకున్నారు. ప్రతి జిల్లాలో 500మందికి పైగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ 76,614మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 0.94శాతం మంది మరణించారు. 72,188మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూలులో 1,234, అనంతలో 1,128, విశాఖలో 1,155, తూర్పుగోదావరి జిల్లాలో 876, చిత్తూరులో 832, నెల్లూరులో 559, శ్రీకాకుళంలో 455, కృష్ణాజిల్లాలో 357 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-02T08:46:59+05:30 IST