అనంతలో అలర్ట్‌

ABN , First Publish Date - 2020-08-10T19:33:52+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లపై అధికార యంత్రాంగం..

అనంతలో అలర్ట్‌

- విజయవాడ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తం 

- కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లపై దృష్టి


అనంతపురం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ దుర్ఘటనతో అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం వైద్య, విద్యుత్‌, అగ్ని మాపకశాఖల అధికారులతో పాటు జేసీలతో సమీక్షించారు. కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లను పరిశీలించాలని, ఏదైన సమస్యలు ఉంటే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు సెంటర్లలో పరిశీలనకు పరుగులు తీశారు. 


కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లు ఇవే..

జిల్లాలో కరోనా బాధితులకు చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆస్పత్రులు సరిపోవటం లేదు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, జూనియర్‌ కళాశాలలను కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా తీసుకున్నారు. ఇందులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి, గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రులు కిమ్స్‌ సవీరా, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, చంద్ర సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కేర్‌ అండ్‌ క్యూర్‌ ఆస్పత్రి, వైఎస్‌ఆర్‌ ఆస్పత్రి, దివ్యశ్రీ ఆస్పత్రి, అమరావతి ఆస్పత్రి, కేఎస్‌ఆర్‌ గఫూర్‌ ఆస్పత్రి, ఎస్‌ఆర్‌ ఆస్పత్రి, ఎస్వీ ఆస్పత్రి, హర్షిత ఆస్పత్రి, క్రాంతి ఆస్పత్రి, మైత్రి ఆస్పత్రి, కేకే నర్సింగ్‌ హో మ్‌, ఆశా ఆస్పత్రి, పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, గుంతకల్లు శ్రీ పద్మావతి శ్రీనివాస ఆస్పత్రి, ధర్మవరం దేవి నర్సింగ్‌ హోమ్‌ను కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించి బాధితులకు వై ద్య చికిత్సలు అందిస్తున్నారు. అలాగే జిల్లాలో మ రో 15 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీ సాయి నర్సింగ్‌ కళాశాల, శ్రీ చైతన్య స్కూల్‌ (ఎన్‌హెచ్‌44 హైవే), నారాయణ జూనియర్‌ కళాశాల (గుత్తిరోడ్‌), నారాయణ కళాశాల(ఏటీపీ రూరల్‌), స్వామి వివేకానందా జూనియర్‌ కళాశాల, జేఎన్‌టీయూ, ఎస్కే యూ, ఎస్‌ఆర్‌ఐటీ, పీవీకేకే, ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, హిందూపురం సప్తగిరి కాలేజ్‌, కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, తాడిపత్రి సీవీఆర్‌టీ కళాశాల, కళ్యాణదుర్గం ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ఏర్పాటు చేశారు.


 ప్రైవేట్‌ ఆస్పత్రులు, కళాశాలల్లో అరకొర సౌకర్యాలు

 ప్రైవేట్‌ ఆస్పత్రులు, కళాశాలల్లో నిబంధనల మేరకు వసతులు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ముందు చూపుతో ఆలోచించకుండా బాధితులను ఎక్కడో ఒక చోట ఉంచాలని నిర్ణయాలు తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులలో కరోనా బాధితులను ఎక్కడో మూలన ఉన్న గదులలో ఉంచుతున్నారు. కొన్ని కళాశాలల్లో కనీస వసతులు లేవు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. పస్తుతం కురుస్తున్న వర్షాలకు గోడల వెంబడి నీరుకారి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు విద్యుత్‌ సరఫరా, వైరింగ్‌ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్య లు తీసుకోవాల్సి ఉంది. 


అప్రమత్తంగా ఉన్నాం : డాక్టర్‌ కామేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం విజయవాడ ఘటనతో మరింత అప్రమత్తంగా ఉన్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సెంటర్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. జిల్లాలో ఎక్కడా హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు, కళాశాలల్లో మాత్రమే ఏర్పాటు చేశాం. అక్కడ అన్ని వసతులు ఉన్నా యి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


కరోనాకు 8 మంది బలి

- 170కు చేరిన మరణాలు

- కొత్తగా 858 పాజిటివ్‌ కేసులు 

- మొత్తం బాధితుల సంఖ్య 24107 


అనంతపురం: జిల్లాలో కరోనాకు మరో 8 మంది బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 170కి చేరింది. అలాగే కొత్తగా 858 మంది కరోనా బారినపడినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు.  ఈ లెక్కన జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 24107కి పెరిగింది. కాగా 16927 మంది కరోనా నుంచి కోలుకోగా మిగతావారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


670 మంది డిశ్చార్జ్‌

జిల్లాలో కరోనా నుంచి 670 మంది కోలుకోవడంతో  ఆదివారం వారందరిని కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేసి ఇళ్లకు పంపించారు. తదుపరి వైద్యం కోసం ఒక్కొక్కరికి రూ2 వేలు అందచేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.


Updated Date - 2020-08-10T19:33:52+05:30 IST