అనంతపురం జిల్లాలో కొత్తగా 762 మందికి కరోనా.. మరో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2020-08-15T16:11:30+05:30 IST

జిల్లాలో కొత్తగా 762 మంది కరోనా బారిన పడినట్టు శుక్రవారం విడుదల చేసిన..

అనంతపురం జిల్లాలో కొత్తగా 762 మందికి కరోనా..  మరో ఆరుగురి మృతి

28 వేలు దాటిన వైరస్‌ బాధితుల సంఖ్య

209కి చేరిన మరణాలు


అనంతపురం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 762 మంది కరోనా బారిన పడినట్టు శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు. ఈ లెక్కన జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 28096కి చేరింది. కాగా కరోనా వైరస్‌తో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 209కి పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 21517 మంది కరోనా నుంచి కోలుకోగా మిగతా వారు చికిత్స పొందుతున్నారు.


భయమా... వైద్యం అందకా.. 

జిల్లాలో ప్రతి రోజూ సంభవిస్తున్న కరోనా మరణాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. కరోనా మామూలు వ్యాధేనని ఎవరు భయపడాల్సిన పనిలేదని, జాగ్రత్తలతో పాటు చికిత్స తీసుకుంటే సరిపోతుందని ఇటు అధికారులు, అటు పాలకులు చెబుతున్నారు. అయితే కరోనా బారిన పడిన బాధితులు అధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు అంటే 45 రోజులలో జిల్లాలో 201 మంది కరోనాతో మృతి చెందారు. వృద్ధులతో సమానంగా 50 ఏళ్లలోపు ఉన్నవారు కూడా చనిపోయారు.


దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ వస్తే చాలు వణికిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లినా చనిపోతున్నారు. ఇందులో సగం మంది భయంతోనే చనిపోతున్నారని కొందరు చెబుతుండగా... మరి కొందరు సరైన వైద్య సేవలు సకాలంలో అందక చనిపోతున్నారని చెబుతున్నారు. అధికార వర్గాలు మాత్రం కేసులలో అతి తక్కువ మందే చనిపోతున్నారని, అది కూడా వయసు మీరిన వారు, ఇతర అనారోగ్యాలతో బాఽదపడుతున్నవారు చనిపోతున్నారని చెబుతున్నారు. 


920 మంది డిశ్చార్జ్‌ 

జిల్లాలో మరో 920 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో శుక్రవారం వారిని వివిధ ఆస్పత్రుల నుం చి డిశ్చార్జ్‌ చేశారు. తదుపరి వైద్య చికిత్సల నిమిత్తం ఒక్కొక్కరికి రూ2 వేలు అందచేసినట్టు కలెక్టర్‌ తెలిపారు.


నేడు కరోనా నమూనాల సేకరణ

జిల్లాలో శనివారం కరోనా నమూనాలు సేకరణ చేపడుతున్నారు. కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందిర్పి, బ్రహ్మసముద్రం, కంబదూరు, ముద్దినాయనపల్లి, బెళుగుప్ప, కనగానిపల్లి, ఎన్‌ఎస్‌గేట్‌, ఓడీసీ, అమడగూరు, బేవణహళ్లి, చౌలూరు, రాప్తాడు, ఆత్మకూరు మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో ఎస్‌ఎస్‌బీఎన్‌, పాతూరు ఆస్పత్రి, ఆర్ట్స్‌ కళాశాల, రుద్రంపేట ప్రాంతాలలో నమూనాలు సేకరిస్తునట్లు కలెక్టర్‌ తెలిపారు.


Updated Date - 2020-08-15T16:11:30+05:30 IST