కరోనా స్పీడ్‌.. పొంచి ఉన్న హైదరాబాద్ ముప్పు..

ABN , First Publish Date - 2020-07-13T20:57:46+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి దూసుకుపోతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులసంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా డేంజర్‌ జోన్‌లో పడింది. ముందుగానే అంచనా వేసిన విధంగా జూలైలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా స్పీడ్‌.. పొంచి ఉన్న హైదరాబాద్ ముప్పు..

రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య

జిల్లాలో కొత్త కేసులన్నీ ప్రైమరీ కాంటాక్టులే

హైదరాబాద్‌ రాకపోకలతో పెరుగుతున్న తీవ్రత

పరిస్థితి చేయిదాటితే ప్రమాదమేనంటున్న పలువురు


ఆదిలాబాద్‌ (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మహమ్మారి దూసుకుపోతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులసంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా డేంజర్‌ జోన్‌లో పడింది. ముందుగానే అంచనా వేసిన విధంగా జూలైలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోతున్నాయి. జనం కూడా ఏ మాత్రం భయం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజల తీరులో మార్పు కనిపించడం లేదు. ఢిల్లీ మర్కజ్‌తో మొదలైన కరోనా వ్యాప్తి హైదరాబాద్‌తో మరింత విజృంభిస్తోంది. రాజధాని వెళ్లివచ్చిన వారందరికీ కరోనా పాజిటివ్‌గానే నిర్ధారణ అవుతోంది. జిల్లాలో మొత్తం 63 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 45 మంది రోగులు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. మిగతా వారిలో 17 మంది చికిత్స పొందుతుండగా ఒకరు మృతి చెందారు. ఓ ప్రభుత్వ అధికారి కుటుంబంతో పాటు ఎమ్మెల్యే జోగు రామన్న కారు డ్రైవర్‌కు కరోనా వైరస్‌ సోకడం జిల్లాలో కలకలం రేపుతోంది. మరికొన్నాళ్లపాటు ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రమాదమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.


జిల్లాలో ప్రమాదకర పరిస్థితి..

రోజురోజుకూ జిల్లాలో పెరిగిపోతున్న కరోనా కేసులతో మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే అనుమానిత వ్యక్తులు విచ్చలవిడిగా తిరగడంతో మరెన్నో కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 1,058 శ్యాంపిల్స్‌ సేకరించగా 967 మందికి నెగెటివ్‌గా వచ్చింది. మరో 29 శ్యాంపిల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. గతవారం రోజుల క్రితం బస్సు ప్రయాణం చేసిన ముగ్గురు కరోనా పాజిటివ్‌ రోగులను ఇంకా గుర్తించక పోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత శనివారం 8 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇంత ప్రమాదకరంగా మారినా ఎక్కడా భౌతిక దూరాన్ని పాటించడం లేదు. కొందరైతే కనీసం మాస్కులు ధరించకుండానే బయట తిరగడం కనిపిస్తోంది. హరితహారం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో జిల్లా అధికారులతో కలిసి నేతలు హడావిడి చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది.


జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు

జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 63

ఇప్పటి వరకు డిశ్చార్జి కేసులు 45 

మొత్తం యాక్టివ్‌ కేసులు 17 

మొత్తం మరణాల సంఖ్య 01


బయట పడుతున్న కాంటాక్ట్‌ కేసులు..

జిల్లా కేంద్రంలో నమోదవుతున్న కొత్త కేసులన్నీ ప్రైమరీ కాంటాక్ట్‌ కేసులు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సంజయ్‌నగర్‌, మావల, బొక్కలగూడ కాలనీలలో తరచుగా కాంటాక్ట్‌ కేసులు నమోదవుతు న్నాయి. ఇన్నాళ్లు ఢిల్లీ, మహారాష్ట్ర, హైదరాబాద్‌ వెళ్లి వచ్చిన వారికి వైరస్‌ సోకగా ప్రస్తుతం వారికి కాంటాక్ట్‌ అయిన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. దీంతో పాటు మరికొంత మందికి కాంటాక్ట్‌ అయి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. కాంటాక్ట్‌ కేసులను గుర్తించడంలో అధికారులు జాప్యం చేయడంతోనే కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. అలాగే కరోనా లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు చేయడంతో మిగతా వారిని గుర్తించలేకపోతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి వైరస్‌ సోకడంతో కలకలం రేపుతోంది. ప్రస్తుతం జిల్లాలో సామాజిక వ్యాప్తి అంతగా లేకున్నా నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


పొంచి ఉన్న రాజధాని ముప్పు..

హైదరాబాద్‌లో విజృంభిస్తున్న కరోనాతో జిల్లాకు మరింత ముప్పు పొంచి ఉందంటున్నారు. నిత్యం రాజధానికి రాకపోకలు కొనసాగడం తోనే వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నట్లు ఇప్పటికే నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వివిధ రకాల పనుల నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లి వచ్చిన వారితో వైరస్‌ వ్యాప్తి జరుగు తోంది. జిల్లా నుంచి నిత్యం వందలాది మంది ప్రయాణికులు హైదరా బాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప సాధారణ పనుల నిమిత్తం ప్రయాణాలు చేయరాదంటూ చెబుతున్నా పట్టింపే లేకుండా పోతోంది. సాధ్యమైనంత వరకు జిల్లాకు వచ్చిపోయే రాకపోకలను నియంత్రించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలి..: నరేందర్‌ రాథోడ్‌ (డీఎంఅండ్‌హెచ్‌వో, ఆదిలాబాద్‌)

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించాలి. బయటకు వెళ్లే సమ యంలో మాస్కులను ధరించాలి. అవసరమైతే తప్ప సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. కరోనాకు పూర్తిస్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే మంచిది. కరోనా వైరస్‌ కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరం.

Updated Date - 2020-07-13T20:57:46+05:30 IST