నిబంధనల ఉల్లంఘన

ABN , First Publish Date - 2020-05-24T07:56:27+05:30 IST

కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భవానీపురంలోని రెడ్‌జోన్‌ ప్రాంతమైన ఐరన్‌ యార్డులో వ్యాపారస్థులు ..

నిబంధనల ఉల్లంఘన

విద్యాధరపురం, మే 23 : కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భవానీపురంలోని రెడ్‌జోన్‌ ప్రాంతమైన ఐరన్‌ యార్డులో వ్యాపారస్థులు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి జోరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అడ్డుకుంటున్న పోలీసు అధికారులపై ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారు. భవానీపురం ఐరన్‌ యార్డులో సుమారు 200 ఐరన్‌ దుకాణాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపారస్థులందరూ మొదట తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. నెల నుంచి కొందరు వ్యాపారస్థులు నిబంధనలు ఉల్లంఘిస్తూ అర్థరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు వ్యాపారాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న భవానీపురం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ముగ్గురుపై కేసులు నమోదు చేశారు.


దీంతో ఆ వ్యాపారస్థులు ఆ ముఖ్య ప్రజాప్రతినిధితో పోలీసులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ నిబంధనల మేరకు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెల్చి చెప్పారు.వారం నుంచి ఐరన్‌ యార్డ్‌లో 75 శాతం వ్యాపారస్థులు తమ వ్యాపారాలను జోరుగా నిర్వహిస్తున్నారు. కనీసం నిబంధనల ప్రకారం వ్యాపారస్థులు, ముఠా కార్మికులు మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించకుండా, భౌతిక దూరం పాటించకుండా పనులు చేస్తున్నారు. వందలాది మంది కార్మికులు ఉండే ఐరన్‌ యార్డులో కరోనా వైరస్‌ వచ్చే ప్రమాదం ఉందని పలువురు వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-05-24T07:56:27+05:30 IST