ఆగని కరోనా

ABN , First Publish Date - 2020-06-03T10:08:01+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క మంగళవారమే ఐదు కేసులు వచ్చాయి. వీటితో జిల్లాలో కరోనా బారినపడిన ..

ఆగని కరోనా

కొత్తగా 5 కరోనా కేసులు...మొత్తం 118

వడ్లపూడిలో 2, చినవాల్తేరు 1, 

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉంటున్న ఇద్దరికి పాజిటివ్‌ 

మరో నలుగురికి లక్షణాలు

అనకాపల్లిలో ఇద్దరికి పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్టు ప్రచారం

ధ్రువీకరించని అధికారులు


విశాఖపట్నం/కూర్మన్నపాలెం/అనకాపల్లి టౌన్‌/కె.కోటపాడు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క మంగళవారమే ఐదు కేసులు వచ్చాయి. వీటితో జిల్లాలో కరోనా బారినపడిన వారి సంఖ్య 118కి చేరింది. వడ్లపూడి నిర్వాసిత కాలనీ ఉప్పరవానిపాలెంలో నివాసం వుంటున్న ఇద్దరు యువకులు (23),(25)లకు మంగళవారం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న దుగ్గపువానిపాలేనికి చెందిన యువకుడికి ఆదివారం పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. అతని సహచర ఉద్యోగులు, స్నేహితులు ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరికి పాజిటివ్‌ రాగా, నలుగురికి నెగెటివ్‌ వచ్చింది. ఇదిలావుండగా నిర్వాసిత కాలనీల్లో మరో 42 మంది స్వాబ్‌ను సేకరించి పరీక్షలు నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పారిశుధ్య సిబ్బంది ఉప్పరవానిపాలెంలో రసాయనాలు పిచికారీ చేశారు. దువ్వాడ సీఐ లక్ష్మి ఆధ్వర్యంలో కాలనీలో బారికేడ్లు ఏర్పాటుచేసి ఇతరులు ఎవరూ లోపలకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయించారు.



- విదేశాల నుంచి విశాఖపట్నం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని జిల్లా వైద్యవర్గాలు తెలిపాయి. వారిలో ఒకరు కీస్‌ హోటల్‌లో వుండగా, మరొకరు మారికవలస చైతన్య హాస్టల్‌లో ఉన్నారు. వీరిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.


- చినవాల్తేరులో కూడా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు.


మహిళకు కరోనా పాజిటివ్‌?

సాగర్‌నగర్‌ సమీపంలో నివసిస్తున్న ఒక మహిళ (24)కు మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు తెలిసింది.  రెండు నెలల కిందట భర్తతో కలిసి జడ్పీ దగ్గర ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న మామయ్య వద్దకు వెళ్లింది. ఆ అపార్టుమెంట్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ కాంటాక్ట్‌ వల్ల ఈమెకు కరోనా వచ్చి వుంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఆమె భర్త కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 


అనకాపల్లిలో ఇద్దరికి కరోనా?

తండ్రి, కొడుక్కి పాజిటివ్‌ వచ్చినట్టు ప్రచారం ధ్రువీకరించని అధికారులు

అనకాపల్లి టౌన్‌: పట్టణంలో ఇద్దరు కరోనా వైరస్‌బారిన పడినట్టు తెలిసింది. తండ్రీకొడుకులైన వీరు చింతావారివీధిలో నివాసం ఉంటున్నారు. ఇంటిలోనే ఒక భాగంగా ఎలక్ర్టికల్‌ సామగ్రి దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వైరస్‌ అనుమానిత లక్షణాలు వుండడంతో సోమవారం రాత్రి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పరీక్షలు నిర్వహించారు. ప్రాథమికంగా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో మరిన్ని పరీక్షల కోసం విశాఖకు తరలించారు. వీరికి పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్టు మంగళవారం ఇక్కడ ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీరి షాపులో పనిచేస్తున్న ఒక యువకుడు దిబ్బవీధిలో నివాసం వుంటున్నాడు. ఆయనకు కూడా వైరస్‌ సోకి ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ధ్రువీకరించలేదు. కాగా వీరి ఇంట్లో పనిచేసే ఒక మహిళకు కూడా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు తెలిసింది. 


కోటపాడులో కరోనా కలకలం

కె.కోటపాడు: అనకాపల్లి మండలం తుమ్మపాలకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఇక్కడ ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు వచ్చి వెళ్లడం, అతనికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని ప్రచారం జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సదరు వ్యక్తి అత్తవారి ఊరు కె.కోటపాడు. తన భార్యతోపాటు సోమవారం ఇక్కడ వైద్యం నిమిత్తం ఓ ప్రైవేటు డాక్టర్‌ వద్దకు వచ్చారు.


కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్‌ సూచించారు. తరువాత స్థానిక సీహెచ్‌సీకి వెళ్లి కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నాడు. తరువాత భార్యతో కలిసి తుమ్మపాల వెళ్లిపోయాడు. తుమ్మపాల నుంచి విశాఖపట్నం తరలించారు. అతనికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. కానీ వైద్య వర్గాలుగానీ, అధికారులగానీ ధ్రువకరించలేదు. అయితే సదరు వ్యక్తికి తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి ప్రైవేటు డాక్టర్‌ను హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

Updated Date - 2020-06-03T10:08:01+05:30 IST