స్వీయ నిర్బంధం..

ABN , First Publish Date - 2020-03-25T13:17:07+05:30 IST

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

స్వీయ నిర్బంధం..

  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి అవగాహన
  • 14 రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాలని సూచన
  • అనుమానితులను గాంధీకి తరలింపు
  • గజ్వేల్‌లో ఓ వ్యక్తిపై కేసు నమోదు


(మిరుదొడ్డి/చిన్నశంకరంపేట/రామచంద్రాపురం/జగదేవ్‌పూర్‌/ తూప్రాన్‌/హవేణీఘనపూర్‌/ మనోహరాబాద్‌/ రేగోడు/ గజ్వేల్‌/ దుబ్బాక /పుల్‌కల్‌/ మద్దూరు/ చేర్యాల) : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలువురికి వైద్య పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అనుమానితులను 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అనిపించినా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎప్పటి కప్పుడు అధికారులు, వైద్య బృందాలు అవగాహన కల్పిస్తున్నారు.


సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట గ్రామంలో కరోనా వైరస్‌ భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈనెల 16న సౌదీ నుంచి గ్రామానికి ఓ వ్యక్తి వచ్చాడు. వైద్యాధికారులు, పోలీసులు ఇంట్లో ఎవరినీ తాకకుండా స్వీయనిర్బంధలో ఉండాలని సూచించారు. అయితే అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు సదరు వ్యక్తి బయటకు రావడం లేదని, వాళ్లు వెళ్లిన తర్వాత బయటతిరగడం, అరుగుల మీద కూర్చోవడం చేస్తుండని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని సౌదీ నుంచి వచ్చిన వ్యక్తి బయట తిరగకుండా చూడాలని కోరుతున్నారు. చిన్నకోడూరు మండలం వెంకట్రావుపల్లి, శాలిపేట గ్రామాలకు చెందిన ఇద్దరు దుబాయ్‌, మస్కట్‌ నుంచి రావడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.  వైద్యులు, అధికారులు ఇరువురిని విచారించి వెంకట్రావుపల్లికి చెందిన వ్యక్తికి స్టాంపు వేశారు. ఆ ఇద్దరిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ప్రతిరోజు ఏఎన్‌ఎంలు, ఆశాలు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. జగదేవ్‌పూర్‌ మండలంలో ఇద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మండలంలోని అలిరాజపేటకు చెందిన లారెన్స్‌రెడ్డి అమెరికా వెళ్లి వారంరోజుల క్రితం తిరిగి వచ్చాడు. అలాగే తిగుల్‌నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ప్రశాంత్‌ ఇటీవల దుబాయ్‌కి వెళ్లి తిరిగి వచ్చాడు. 


అతనిని, మహారాష్ట్రకు వెళ్లి 2రోజుల క్రితం వచ్చిన కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. చెన్నై, యూపీ, ఒరిస్సా నుంచి కొందరు తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ శివారులోని టోల్‌ప్లాజాలో విధుల్లో చేరేందుకు వచ్చారు. చెన్నై నుంచి గిరీశ్‌గౌర్‌, జనతా కర్ఫ్యూ నాడు ఉత్తరప్రదేశ్‌ నుంచి అమిత్‌కుమార్‌, ఒరిస్సాకు చెందిన సుమిత్‌కుమాయ్‌, సంజీవ్‌కుమార్‌ వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించారు. వారిలో ఒకరికి దగ్గు ఉండడంతో వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పుల్కల్‌ మండలం చక్రియాల గ్రామానికి చెందిన గౌస్‌ రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌కు వెళ్లి రాగా, అదే గ్రామానికి చెందిన కాశపాగ సంజీవులు ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు వీరిని పరీక్షించి ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ఇటీవల విదేశాల నుంచి మద్దూరు మండలం జాలపల్లికి వచ్చిన వ్యక్తికి ప్రోగ్రాం ఆఫీసర్‌ ఏసుమేరి క్వారంటైన్‌ ముద్ర వేశారు. ఇప్పటికే 12 రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని రెండోవార్డు (చెల్లాపూర్‌)లో సోమవారం రాత్రి దుబాయ్‌ నుంచి బొట్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి వచ్చినట్లు సమాచారమందుకున్న ఐసోలేషన్‌ బృందం మంగళవారం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్‌గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 14రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా ఆదేశించారు. శ్రీనివా్‌సను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా గ్రామసేవకుడిని నియమించారు.


విదేశాల నుంచి వచ్చినోళ్లకు నోటీసులు

1897 అంటువ్యాధుల నిరోధక, 2005 విపత్తుల చట్టం నిబంధనలు పాటించాలంటూ సుమారు 57 మందికి మంగళవారం రామచంద్రాపురం తహసీల్దార్‌ కె.పార్థసారధి నోటీసులు అందజేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికి నోటీసులు జారీ చేసి, చేతిపై స్టాంపు వేశారు. 14 రోజుల తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే గాంధీ ఆసుపత్రికి తరలిస్తామన్నారు.


ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినోళ్లకు అవగాహన

మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌, జీడిపల్లి, రామాయిపల్లి, కొండాపూర్‌ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు మహారాష్ట్రలోని పర్బనీలో 5రోజులుగా పలు ఉత్పత్తుల విక్రయాలపై శిక్షణ పొంది సోమవారం రాత్రి గ్రామాలకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది, నాయకులు వారివారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించారు. చెట్ల మందులు అమ్ముకుంటూ మహారాష్ట్రకు చెందిన దాదాపు 50 మంది ఓ బస్సు, వ్యాన్‌, 2 జీపులు, కారు, టీవీఎస్‌ ఎక్సెల్‌పై రేగోడు మండలంలోని ఆర్‌.ఇటిక్యాల శివారుకు చేరుకోవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. ఎంతో కాలంగా ఇక్కడే ఉంటున్నామని, వ్యాపారం కూడా ఇక్కడే చేస్తున్నామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విచారించిన అధికారులు పరిస్థితులు బాగా లేవని తిరిగి స్వగ్రామానికి వెళ్లాల్సిందిగా సూచించడంతో వారు తిరుగుపయనమయ్యారు. ఇక చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓవ్యక్తితో పాటు కొమురవెల్లి మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తికి మంగళవారం క్వారంటైన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పోలీసు అధికారులు వారి ఇంటికి వెళ్లి వైద్యపరీక్షలు జరిపారు.


ఇంటినుంచి బయటకు రాకూడదని సూచించారు. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌, చిన్నకోడూరు గ్రామాల్లో మంగళవారం జడ్పీ సీఈవో శ్రవణ్‌ కుమార్‌ పర్యటించారు. ఇటీవల విదేశాల నుంచి గ్రామానికి వచ్చిన వారి ఇళ్ల వద్దకు  వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చేగుంట మండలం రాంపూర్‌ గ్రామాన్ని పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ వినయ్‌కుమార్‌, ఓయస్‌ గోపాల్‌, పద్మ, ప్రమీల సందర్శించారు. ఇటీవల బాంబే నుంచి వచ్చిన వ్యక్తిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుచ్చి గ్రామం నుంచి బాలాజీ అనే వ్యక్తి మంగళవారం పెద్దశంకరంపేటకు రావడంతో మండల అధికారులు, వైద్య సిబ్బంది అతనికి కరోనాకు సంబంధించిన స్టాంప్‌వేసి 14రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. చిన్నకోడూరు మండలం కామారం శివారు గర్గు స్టీల్‌ పరిశ్రమలో పనిచేస్తున్న30 మంది కార్మికులను గుర్తించి అధికారులు, వైద్యులు కరోనా వైర్‌సపై అవగాహన ఉండాలని వారికి సూచించారు. 15రోజుల క్రితం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు గర్గు స్టీల్‌ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు మంగళవారం కామారం గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. వారిని పరీక్షించిన అధికారులు, వైద్యులు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే స్టాంపులు వేసి 14 రోజులుగా స్వీయ నిర్బంధంలోనే ఉండాలన్నారు.


క్వారంటైన్‌ ఏర్పాటుకు వసతుల పరిశీలన

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అనుమానితులను ఐసోలేట్‌ చేయడానికి క్వారంటైన్‌ వార్డు ఏర్పాటు కోసం మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి మంగళవారం హవేళీఘణపూర్‌ మండలంలో పర్యటించారు. హవేళీఘణపూర్‌లో నూతనంగా నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ఉంచాలని ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూంలో క్వారంటైన్‌ వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.


వ్యక్తిపై కేసు నమోదు

దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని ఇంట్లోనే ఉండాలని  ఆదేశించినా.. పట్టించుకోకుండా గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌ను సందర్శనకు వెళ్లిన అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గజ్వేల్‌కు చెందిన ఓ వ్యక్తి ఈనెల 9న దుబాయి నుంచి వచ్చిన విషయం తెలుసుకుని వైద్యాధికారులతో కలిసి సిబ్బంది, ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ మంగళవారం గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌కు రావడంతో పలువురు ఫోన్‌ చేసి గజ్వేల్‌ సీఐ ఆంజనేయులుకు సమాచారం అందించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని సిద్దిపేటలోని బాబు జగ్జీవన్‌రామ్‌ భవనంలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు.


గాంధీలో మృతి చెందాడని

గాంధీ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడని శవాన్ని గ్రామంలోకి తీసుకురాకూడదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామ గ్రామస్థులు వాహనాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య (52)కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు రెండు దశాబ్ధాల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో నాలుగు రోజుల క్రితం గాంధీ వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందడంతో అంత్యక్రియలకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్థులు అడ్డుకుని శవాన్ని గ్రామంలోకి తీసుకురాకూడదని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడి కుటుంబీకులకు నచ్చజెప్పారు. శవాన్ని నేరుగా వారి వ్యవసాయ భూమి వద్ద అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకెళ్లారు.

Updated Date - 2020-03-25T13:17:07+05:30 IST