Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా గురించి వెలుగులోకి కొత్త నిజం.. 92 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ..

92 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ సజీవం

60 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ వైరస్‌ వ్యాప్తి

15 నిమిషాల పాటు బతికే కరోనా

ఫ్రాన్స్‌ శాస్త్రవేత్త రెమీ చారెల్‌ పరిశోధన

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ


ఆంధ్రజ్యోతి(17-04-2020): కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ ఏ స్థాయి ఉష్ణోగ్రత వరకు సజీవంగా ఉంటుంది? దీని వ్యాప్తిపై అనేక సందేహాలు! ఫ్రాన్స్‌లోని ఎయిక్స్‌ మార్సెల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ రెమీ చారెల్‌ మాత్రం కరోనా వైరస్‌ 92 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలోనూ బతికి ఉంటుందని, 60 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద కూడా వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృషిస్తున్న ఈ పరిశోధన గురించి ప్రొఫెసర్‌ రెమీ.. ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..


కరోనా ఎంత ఉష్ణోగ్రత వరకు బతుకుతుంది?

కరోనా వైరస్‌ 92 డిగ్రీల సెల్సియ్‌సలోనూ 15 నిమిషాల పాటు బతుకుతుందని మా పరిశోధనల్లో  తేలింది. 56 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో దాదాపు గంట ఉంచాం. అయినా దాని వైరల్‌ కౌంట్‌ మాత్రమే తగ్గింది. వ్యాప్తి చెందే శక్తిని కోల్పోలేదు.  


ఈ ప్రయోగాల కచ్చితత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు?

ప్రయోగశాలల్లో రకరకాల పరిస్థితులను సృష్టించి పరీక్షలు చేస్తాం. ఉదాహరణకు కరోనా వైరస్‌ సాధారణంగా కణాలలోనే బతుకుతుంది. అందుకని ఒక కణంలో దానిని ప్రవేశపెట్టి అది ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుందనే విషయాన్ని తెలుసుకున్నాం. ఉష్ణోగ్రత 56 నుంచి 60 డిగ్రీ సెల్సియస్‌ మధ్య ఉన్నప్పుడు దాని శక్తి కొద్దిగానే తగ్గింది. సెల్‌కల్చర్‌ మీడియంలో (సీసీఎం)- అంటే వైరస్‌ వృద్ధికి అనువైన వాతావరణంలో ఈ పరీక్షలు చేశాం. వైర్‌సకు అవసరమైన ప్రొటీన్‌ను ఇచ్చి ఒకసారి, ఇవ్వకుండా ఒకసారి పరీక్షించాం. 92 డిగ్రీల సెల్సియస్‌ వరకు బతుకుతుందని తేలింది. 


అధిక ఉష్ణోగ్రతల వద్ద వైర్‌సలు బతకవు కదా? కరోనాకు ఈ శక్తి ఎక్కడినుంచి వచ్చింది?

వైర్‌సలు మనం అనుకునేంత బలహీనమైనవి కావు. పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి. కరోనా కూడా ఇలాంటిదే. 


ఎక్కువ ఉష్ణోగ్రతలుండే భారత్‌లాంటి దేశాల్లో వ్యాప్తి తగ్గుతుందా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అసాధ్యం. వైరస్‌ వ్యాప్తిలో ఉష్ణోగ్రతతో పాటు గాలిలోని తేమ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికా, యూర్‌పలోని దేశాల్లో కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. 


మీ పరిశోధన ప్రభావం వైరస్‌ నియంత్రణ, రక్షణ చర్యలపై ఎలా ఉంటుంది?

వైద్య సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మరోసారి రుజువైంది. వారి చికిత్స తర్వాత మిగిలే బయో వ్యర్థాలను ఎలానిర్మూలించాలనే విషయంలో స్పష్టత వచ్చేందుకు మా పరిశోధన ఉపయోగపడుతుంది.


                                                             - స్పెషల్‌ డెస్క్‌

Advertisement
Advertisement