అప్రమత్తతే..అందరికీ రక్ష

ABN , First Publish Date - 2020-07-04T10:52:06+05:30 IST

కరోనా వైరస్‌తో కలిసి బతకాల్సిందేనా? మందు వచ్చే వరకు ఈ బాధలు తప్పవా...? వైరస్‌ సామాజిక వ్యాప్తి

అప్రమత్తతే..అందరికీ రక్ష

ఉమ్మడి జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియని పరిస్థితి

స్వీయ నియంత్రణ పాటించాలంటున్న వైద్యులు


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) జూలై 3 : కరోనా వైరస్‌తో కలిసి బతకాల్సిందేనా? మందు వచ్చే వరకు ఈ బాధలు తప్పవా...? వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలయ్యిందా? అనే ప్రశ్నలు నేడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆ అనుమానాలు నిజమేనని అనిపిస్తోంది. ఎందుకంటే ఎవరి నుంచి ఎవరికి ఎలా వైరస్‌ సోకుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. విదేశాలకు వెళ్లకపోయినా, ఇంట్లో పాజిటివ్‌ వ్యక్తులు లేకపోయినా, అసలు బయటకు వెళ్లకపోయినా వైరస్‌ సోకుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. అత్యవసరమైతేనే ఆసుపత్రులకు రావాలని, అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని వైద్యులు పదేపదే సూచిస్తున్నారు. మీ జాగ్రత్తలే మీకు శ్రీరామరక్ష అని చెప్తున్నారు. వైరస్‌ను దరిచేరనివ్వకుండా తీసుకునే జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ అందిస్తున్న సూచనలతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


సామాజిక వ్యాప్తి అనుమానాలు

ప్రస్తుతం కరోనా వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి సోకుతోందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు నెలల క్రితం ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్లు తెలిసేది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లకపోయినా, ఏం చేయకపోయినా వైరస్‌ సోకుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆంధ్రా బ్యాంకులో పనిచేసే ఇద్దరికి, చౌదర్‌పల్లికి చెందిన ఓ యువకుడికి, బొక్కలోనిపల్లి గ్రామానికి చెందిన మరో యువకుడికికి ఇటీవల పాజిటివ్‌ వచ్చింది. కానీ వీరు ఇల్లు, పనిచేసే చోటుకు తప్ప ఎక్కడికి వెళ్లలేదు. వారి ఇంట్లో ఎవరికీ పాజిటివ్‌ లేదు. అయినా వైరస్‌ మాత్రం అంటుకుంది. పస్తుతం పాజిటివ్‌ వస్తున్న కేసులన్నీ ఆసుపత్రులతో లింక్‌ అయినవే కావడం గమనార్హం. ఆసుపత్రులకు వెళ్లివచ్చిన వారు, అందులో పనిచేసే వారు వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యవసరం అనుకుంటే తప్ప ఆసుపత్రులకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. 


ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి

కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు చెప్పే సూచనలు కచ్చితంగా పాటించాలి. ఈ వైరస్‌ మాకెందుకు సోకుతుంది అనే భావనను తీసివేయాలి. ఎవరికైనా ఈ వైరస్‌ సోకే అవకాశముంది. ముఖ్యంగా షుగర్‌, అస్తమా, రోగులు, 60 ఏళ్లు పైబడిన వారు, తొమ్మిదేళ్ల చిన్నారులకు చాలా ప్రమాదం. 

  • ముఖ్యంగా మాస్కు లేకుండా ఎక్కడికి వెళ్లకూడదు. తుమ్మినపుడు, దగ్గినపుడు కూడా తీయొద్దు దాని ద్వారానే వైరస్‌ గాలిలో కలిసిపోయి అందరికీ వైరస్‌ సోకుతుంది. 
  • తరచూ చేతులను సబ్బుతోగానీ, హ్యాండ్‌ వాష్‌తోగానీ కడుక్కోవాలి. ఎక్కడికి వెళ్లినా సానిటైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదు. వెళ్లిన చోట ఏ వస్తువులను ముట్టుకోవొద్దు. వాటిని సానిటైజ్‌ చేశాకే తాకాలి.
  • జ్వరం, దగ్గు, జలుబు ఈ మూడు లక్షణాలు కొద్దిగా ఉన్న వారు ఇంట్లోనే ఆవిరి పట్టుకోవడం, నీటిని వేడి చేసుకొని తాగడం, చేయాలి. వారం రోజులైనా ఆ లక్షణాలు తగ్గకపోతేనే ఆసుపత్రికి వెళ్లాలి. 
  • పౌష్టికాహారం తీసుకోవాలి. పండ్లు, డ్రైప్రూట్స్‌ తీసుకోవాలి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే వైరస్‌ సోకినా అది తగ్గిపోయేందుకు అవకాశం ఉంది.
  • బయటి నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే బయట కాళ్లు, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. వేడిచేసిన నీళ్లలో పసుపు వేసుకొని కడుక్కుంటే క్రిములు చనిపోతాయి. 
  • బయటి వ్యక్తులతో, ప్రెండ్స్‌తో పరిచయం చేసుకునే ముందు కరచాలనం, ఆలింగనం చేయొద్దు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-07-04T10:52:06+05:30 IST