సొమ్ము సర్కారుది... సోకు నేతలది!

ABN , First Publish Date - 2020-04-03T11:00:25+05:30 IST

కరోనా విజృంభణ... లాక్‌డౌన్‌ సందర్భంలోనూ కొందరు నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సొమ్ము సర్కారుది... సోకు నేతలది!

‘స్థానిక’ అభ్యర్థులతో పింఛను, బియ్యం పంపిణీ

నిబంధనలకు విరుద్ధమంటూ విపక్షాల మండిపాటు


 ప్రభుత్వ సాయంపై ‘స్థానిక’ రంగు పడుతోంది. విపత్తు వేళ సర్కారు అందిస్తున్న సాయానికి తమ పేర్లు అద్దుతున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో వివిధ చోట్ల పోటీకి నామినేషన్లు వేసిన వ్యక్తులు ఈ విషయంలో ముందు వరుసలో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ వర్గాల వారికి ప్రకటించిన బియ్యం...నిత్యవసరాలు... పింఛన్లను వలంటీర్ల ద్వారా అందించాలని ప్రభుత్వం సూచించింది. కానీ వివిధ పదవుల కోసం పోటీ పడుతున్న నాయకులు స్వయంగా వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నారు. తద్వారా అవి తామే పంపిణీ చేస్తున్నామనే భ్రమ కల్పించే యత్నం చేస్తున్నారు. 


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ... లాక్‌డౌన్‌ సందర్భంలోనూ కొందరు నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా ‘స్థానిక’  ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగకుండా ఎన్నికల సంఘం ‘కోడ్‌’ను సైతం ఎత్తేసింది. అయితే ఈ విపత్తు సమయంలో కూడా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రాజకీయ లబ్ధి చూసుకుంటున్నారు. ‘స్థానిక’ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇప్పటికే నామినేషన్లు వేసిన కొందరు అభ్యర్థులు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేస్తున్నారు.


ప్రజల మెప్పుకోసం పాకులాడుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే నాణ్యమైన బియ్యం, పింఛన్లను వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందజేయాలి. కానీ, వీటిని ‘స్థానిక’ నేతలు లబ్ధిదారులకు అందజేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు పలాస నియోజకవర్గంలో  కొందరు వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ వార్డుల్లో కౌన్సిలర్స్‌గా నామినేషన్‌లు దాఖలు చేసిన అభ్యర్థులు.. ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం, పింఛన్లను పంపిణీ చేశారు. 



నందిగాంలో ఒకటో ప్రాదేశిక ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసిన అధికార పార్టీ నేత నడుపూరి శ్రీరామ్మూర్తి కూడా వీటిని పంపిణీ చేశారు.  


టెక్కలి నియోజకవర్గంలో మరో వైసీపీ మహిళా నేత భర్త కూడా ఇదే విధానాన్ని అమలు చేశారు. 


వజ్రపుకొత్తూరు మండలం పూండిలో జడ్పీటీసీ అభ్యర్థి భర్త కూడా వీటి పంపిణీలో పాల్గొంటున్నారు. 


పలాస-కాశీబుగ్గ పదో వార్డు నుంచి వైసీపీ కౌన్సిలర్‌గా నామినేషన్‌ వేసిన సర్వాన గీత, 13వ వార్డు  కౌన్సెలర్‌ బోర కృష్ణారావులు, 21వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి పప్పల ప్రసాదరావు, పలాస రెండో వార్డులో బలగల పల్లయ్యలు.. బియ్యం, పింఛన్లను పంపిణీ చేశారు. 


విపక్షాల మండిపాటు

వాస్తవానికి ప్రతినెలా వార్డు/గ్రామ వలంటీర్ల ద్వారా బియ్యం, పింఛన్లు పంపిణీ చేయాలి. లాక్‌డౌన్‌ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు ఎవరైనా ఇతోధికంగా సేవలు అందించాల్సి వస్తే.. సొంత నిధులు ఖర్చు చేయాలి. కానీ, జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ పథకాలను.. వారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. దీనిపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. పలాస, టెక్కలి నియోజక వర్గాల్లోనే కాకుండా జిల్లాలో మరికొన్ని మండలాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ అభ్యర్థులు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొంటున్నట్లు తెలిసింది. బూర్జ, పొందూరు మండలాల్లో పలువురు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైనట్లు సమాచారం. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను తామే ఇస్తున్నట్లు పంపిణీ చేయడంపై విపక్షాల నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

Updated Date - 2020-04-03T11:00:25+05:30 IST