Abn logo
Apr 12 2021 @ 23:11PM

కరోనా విజృంభణ!

కరోనా విజృంభణ! 

సెకెండ్‌ వేవ్‌లో పెరుగుతున్న కేసులు

ఈ నెలలోనే క్రమేపీ పెరుగుదల

ప్రజల్లో కానరాని నిబంధనలు

నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం 

హెచ్చరిస్తున్న అధికారులు

కట్టడికి చర్యలు

(రింగురోడ్డు) 

జిల్లాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 193 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావాసులు, అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలో గత ఏడాది కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 42,148 మంది వైరస్‌బారిన పడ్డారు. 41,294 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రెండోదశ కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం 647 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగానే, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి.. ఆసుపత్రికి... లేదా క్వారంటైన్‌ కేంద్రానికి అధికారులు తక్షణమే తరలించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రోజువారీ వందల్లో కేసులు పెరుగుతున్నా... హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి స్థితిగతులను కూడా పరిశీలిస్తున్న దాఖలాలు లేవు. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. కానీ జిల్లాలో మాత్రం అంతగా కేసులు నమోదు కాకపోవడంతో ప్రశాంతంగా ఉండేది. కానీ ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అన్నిచోట్లా కేసులు నమోదవుతున్నాయి. 

 గ్రీన్‌జోన్‌ నుంచి..

గత ఏడాది మొదటి దశలో కేసులు పెరిగాయి. లాక్‌డౌన్‌ తరువాత క్రమేపీ తగ్గాయి. గ్రీన్‌జోన్‌ దిశగా జిల్లా చేరుకుంది. దీని వెనుక యంత్రాంగం కృషి ఉంది. అదే సమయంలో ప్రజలు కూడా సహకరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించారు. అంతా గాడిలో పడుతున్న తరుణంలో సెకెండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. ప్రజలు కూడా నిబంధనలను పక్కన పెట్టేశారు. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వంటి వాటితో కేసులు పెరుగుతున్నాయి. కేసులు తక్కువగా ఉన్న సమయంలో నిబంధనలు పాటించిన వారు..ఎక్కువవుతున్న తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు జిల్లా అధికార యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ స్వీయరక్షణ పాటించడం శ్రేయస్కరం.

నత్తనడకన వ్యాక్సినేషన్‌

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ముందుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్లు వేశారు. తరువాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పంచాయతీరాజ్‌ శాఖ , రెవెన్యూ సిబ్బందికి వేస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్‌గా చేపడుతున్నా చాలా మంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. తాజాగా టీకా ఉత్సవ్‌ ప్రారంభించినా..వ్యాక్సిన్ల కొరత కారణంగా సజావుగా సాగడం లేదు. 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని, సచివాలయాల్లో టీకా వేస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. కానీ వ్యాక్సిన్‌ డోసులు ఎక్కడికక్కడే నిండుకున్నాయి. నిల్వలు వస్తే కానీ ప్రక్రియ సజావుగా ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. 

నిబంధనలు పాటించాలి

గతంతో పోల్చితే కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తృతంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ని వినియోగించడం మరువకూడదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపడుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. రెండు డోస్‌లు తీసుకోవాలి.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదు..

-ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌వో, విజయనగరం


కఠిన చర్యలకు ఉపక్రమిస్తాం

మాస్కులు ధరించకపోతే అపరాధ రుసుం వసూలు చేస్తాం. ప్రజల్లో జాగ్రత్తలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం తప్పదు. పోలీసు శాఖ తరుపున ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. మాస్కు ధరించని వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఇకపై మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తాం. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా కఠిన చర్యలకు ఉపక్రమిస్తాం. 

-రాజకుమారి, ఎస్పీ, విజయనగరం

Advertisement
Advertisement
Advertisement