ఏపీలో మరో అమానుష ఘటన.. పెన్నానది ఒడ్డున కరోనా మృతదేహాల ఖననం

ABN , First Publish Date - 2020-07-10T18:34:46+05:30 IST

ఏపీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కరోనా మృతదేహాలను జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడంపై ప్రభుత్వం సీరియస్

ఏపీలో మరో అమానుష ఘటన.. పెన్నానది ఒడ్డున కరోనా మృతదేహాల ఖననం

నెల్లూరు: ఏపీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కరోనా మృతదేహాలను జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటన మరువక ముందే మరో దారుణమైన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ‘మనం పోరాడాల్సింది రోగితో కాదు.. కరోనా’పై అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటే అందుకు భిన్నంగా ప్రభుత్వ సిబ్బంది వ్యవహరిస్తోంది. నెల్లూరు జిల్లాలో వైరస్‌తో ప్రాణాలు విడిచిన వారి అంత్యక్రియాల్లో ప్రభుత్వ సిబ్బంది కనీస మానవత్వం చూపించకపోవడంపై తీవ్ర చర్చకు దారితీసింది. అర్ధరాత్రి అంబులెన్స్‌ల ద్వారా మృతదేహాలను తరలించి పెన్నానది ఒడ్డున ఖననం చేస్తున్నారు. మూడు మృతదేహాలను అంబులెన్స్ నుంచి తీసి.. జేసీబీలో విసిరివేశారు. ఆ తర్వాత ఓ గుంటలో వేసి పూడ్చిపెట్టారు. ఈ సంఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కరోనా మృతదేహాలను తరలించడంపై స్థానికులు మండిపడుతున్నారు. తమకు వైరస్ సంక్రమిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అధికారుల సీరియస్

అర్ధరాత్రి కరోనా మృతదేహాలను అంబులెన్స్‌లో తరలించడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.


చంద్రబాబు విచారం

నెల్లూరులో కరోనా రోగుల మృతదేహాలను ప్రొక్లెయిన్ ద్వారా ఒక గుంటలో వేయడం చూస్తే బాధ కలిగించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి.కుటుంబ సభ్యులకు అంతిమ సంస్కారాలు ఘనంగా జరగాలని కోరుకునే ఆత్మీయులకు ఇది బాధ కలిగించే అంశం’’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2020-07-10T18:34:46+05:30 IST