పరిశ్రమలకు కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-04-09T10:13:47+05:30 IST

ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా వైరస్‌తో పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడింది. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి

పరిశ్రమలకు కరోనా దెబ్బ

లాక్‌డౌన్‌తో ప్రతికూల ప్రభావం 

జిల్లాలో 5,184 పరిశ్రమలు మూత 

సుమారు రూ.1.15 కోట్ల నష్టం 

ప్రజావసరాల కోసం 40 యూనిట్లు కొనసాగింపు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా వైరస్‌తో పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడింది. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ విధించడంతో పారిశ్రామిక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య, భారి, మెగా - తయారు, మెగా - మౌలిక యూనిట్లు 5,224 ఉన్నాయి. రూ.3,450 కోట్ల పెట్టుబడితో కొనసాగుతున్నాయి. 4,52,660 మంది ఉపాధి పొందుతున్నారు.


ఒక్కో యూనిట్‌లో 200మంది వరకు కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనాకుదెబ్బకు 40 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు మినహా మిగతా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటివరకు సుమారు రూ. 1.15 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు బ్యాంకు లోన్లు కట్టలేక ఇబ్బందులు పడుతుండగా, మరికొన్ని మొత్తానికే మూతపడేలా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ సమయాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత బిజినెస్‌ ఆర్డర్లు ఎలా ఉంటాయన్నది తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. పరిశ్రమలను నష్టాల భారి నుంచి గట్టెక్కేందుకు ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తోన్నాయి.


కొనసాగుతున్న 40 యూనిట్లు

ప్రజావసరాలకు అనుగుణంగా జిల్లాలో కొన్ని కండిషన్లతో 40 యూనిట్లు కొనసాగుతున్నాయి. కాటేదాన్‌, షాద్‌నగర్‌, యాచారం, ఇబ్రహీంపట్నంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లున్నాయి. మంకాల్‌, మహేశ్వరం, ఫరూక్‌నగర్‌లో ఆయిల్‌ మిల్స్‌ కొనసాగుతున్నాయి. కొత్తూరులో రెండు ఫార్మా కంపెనీలు, ఫరూక్‌నగర్‌, మంకాల్‌లో పాల ప్యాకెట్లు తయారు చేసేందుకు కావాల్సిన రోల్‌కు అనుమతినిచ్చారు. వందమంది పనిచేసే దగ్గర 20మందితోనే ఇండస్ర్టీని నడిపించుకోవాలని పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.


పనిచేసే చోట కార్మికులు భౌతిక దూరం పాటించి మాస్క్‌లు ధరించాలని ఆదేశించారు. కంపెనీ ఉద్యోగులు బస్సుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే దూరం పాటించాలని తెలిపింది. ఈ కండిషన్లతో కొన్ని పరిశ్రమలు కొనసాగుతుండగా.. మినరల్‌ వాటర్‌ ప్లాంట్స్‌ వంటి సూక్ష్మ తరహా పరిశ్రమలు మరో 300 యూనిట్ల వరకు నడుస్తున్నాయి. అనుమతున్న 40 యూనిట్లలో సుమారు 800 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 


రంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలు

తరహా పరిశ్రమలు యూనిట్లు పెట్టుబడి (కోట్లలో) ఉపాధి

సూక్ష్మ 2,115 226.03 21,481

చిన్న 1,112 1232.09 31,884

మధ్య 62 9265.00 7,749

భారీ 103 10299.00 11,117

మెగా-తయారు 08 2652.00 5,007

మెగా-మౌలిక 50 19242.16 3,75,422

మొత్తం 5,224 3,450 4,52,660

Updated Date - 2020-04-09T10:13:47+05:30 IST