కోతుల నియంత్రణకు కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2021-05-09T06:13:13+05:30 IST

గత కొన్నేళ్ల నుంచి పంటలను నాశనం చేస్తూ జనావాసాలను బెంబేలేత్తిస్తున్న కోతులను కట్టడి చేసేందుకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంరక్షణ పునరావాస కేంద్రం కార్యకలాపాలపై కరోనా ప్రభావం చూపుతోంది.

కోతుల నియంత్రణకు కరోనా దెబ్బ
సారంగాపూర్‌ మండలంలో చించోలి(బి) గ్రామం వద్ద గల మంకీస్‌ రెస్క్యూ సెంటర్‌ ఇదే

ఆసక్తి చూపని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 

ఐదు నెలల్లో 222 కోతులకు కు.ని శస్త్రచికిత్సలు 

ముందుకు వచ్చిన మూడు గ్రామాలు 

గర్భధారణ గల కోతులకు కు.ని నుంచి మినహాయింపు 

నిర్మల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : గత కొన్నేళ్ల నుంచి పంటలను నాశనం చేస్తూ జనావాసాలను బెంబేలేత్తిస్తున్న కోతులను కట్టడి చేసేందుకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంరక్షణ పునరావాస కేంద్రం కార్యకలాపాలపై కరోనా ప్రభావం చూపుతోంది. గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో నిర్మల్‌లోని గండిరామన్న వద్ద గల అర్బన్‌ పార్కులో కోతుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే ఈ కేంద్రం రెండోవది కావడం విశేషం. జిల్లాకు చెందిన అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషి మేరకు దాదాపు రూ.4కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాష్ట్రంలోనే ఇది మొదటికి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కోతుల ఆగడాలను కట్టడి చేసేందుకు ప్రత్యామ్నాయంగా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లను నిర్ధారించారు. వన్యప్రాణి జంతు సంరక్షణచట్టం ప్రకారం కోతులను హింసించడం నేరమవుతుందని కనుక వాటి జనాభాను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనే కాకుండా ఖానాపూర్‌, నిర్మల్‌, భైంసా పట్టణాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మనుషులతో సమానంగా వీటిసంచారం పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతా ల్లో పంట పొలాలన్నింటినీ ఇవినాశనం చేస్తున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్ప టికే చాలా మంది కోతులదాడిలో తీవ్రగాయాల పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కోతుల జనాభాను నిరోధించడమే ఏకైకమార్గంగా నిర్ధా రించారు. దీంతో జిల్లా కేంద్రాన్ని కోతుల సంరక్షణ కోసం ఎంపిక చేశారు. కోతులసంరక్షణ, పునరావాస కేంద్రానికి ఓ పశువైద్యాధికారితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమించారు. వీరందరికి హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు తమతమ పరిధిలో సంచరిస్తున్న కోతులను పట్టుకోవాలన్న నిబంధనను విధించారు. ఇలా పట్టుకున్న కోతులను తమ సంరక్షణ కేంద్రానికి తరలించినట్లయితే తాము వాటికి అక్కడ తాత్కాలిక ఆవాసం కల్పించి దశల వారీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లను చే సేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటి వరకు వివిధ గ్రామాల నుంచి 430 కోతులను ఇక్కడికి తరలించారు. ఆపరేషన్‌లకు అనుకూలంగా ఉన్న 222 కోతులకు ఇక్కడి అధికారులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయగా మిగతా కో తులు గర్భధారణతో ఉన్నందున వాటిని ఆపరేషన్‌లను నుంచి మినహాయించారు. కాగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకొని సంరక్షణ కేంద్రానికి తరలించే విషయంపై పెద్దగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం మూడు గ్రామాలు మాత్రమే కోతులను పట్టుకొని కేంద్రానికి తరలించాయి. ఈ నేపథ్యంలో గత నెలరోజుల నుంచి కరోనా తీవ్రరూపం దాల్చిన కారణంగా కోతులను పట్టుకునే చర్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. కరోనా కారణంగా కోతులను పట్టేవారు కూడా అందుబాటులో ఉండడం లేదంటున్నారు. దీంతో కోతుల పునరావాస సంరక్షణ కేంద్రం కోతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్తితులు తలెత్తుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డిఎఫ్‌ఓ సిద్దార్థ విక్రమ్‌సింగ్‌ ఈ దిశగా దృష్టి సారిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కోతుల సంరక్షణ పునరావాస కేంద్రంపై సమీక్ష జరిపి శస్త్ర చికిత్సల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకోసం ఆయన సంబంధిత భాధ్యులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

ముందుకు వచ్చిన మూడు గ్రామాలు

ఇదిలా ఉండగా కోతులను పట్టుకొని పునరావాస కేంద్రానికి తరలించేందు కోసం గత ఐదునెలల నుంచి కేవ లం మూడు గ్రామాలే ముందుకు రావడం చర్చకు తావిస్తోంది. ఖానాపూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌, నేరడిగొండ మండలంలోని వడూర్‌, దిలావర్‌పూర్‌ మండలంలోని కదిలి గ్రామపంచాయతీలు ముందుకు వచ్చి తమ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కోతులను పట్టు కు వచ్చి సంరక్షణ కేంద్రానికి అప్పగించాయి. అలాగే హైదరాబాద్‌ నుంచి కూడా కోతులను ఇక్కడికి తరలించారు. మిగతా గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ ప్రాం తాలు కోతులను పట్టుకునే విషయమై ఆసక్తిని ప్రదర్శించకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. అయితే ఇక్కడి పునరావాస కేంద్రంలో కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిర్వహించిన తరువాత వాటిని తిరిగి అడవుల్లో వదిలిపెట్టనున్నారు. ఇక్క డి సౌకర్యాలకు అనుగుణంగా గ్రామపంచాయతీలకు కోతులను తరలించే విషయమై ప్రత్యేకషెడ్యూల్‌ను రూ పొందించే దిశగా అటవీశాఖ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామ పంచాయతీల వారీగా కోతులను తరలిస్తే ఇక్కడి కేంద్రంలో వాటిని సంరక్షించడం సులభమవుతోందంటున్నారు. లేనట్లయితే ఒకేసారి పెద్దసంఖ్యలో కేంద్రా నికి తరలిస్తే ఇక్కడ వాటికి ఆవాసం కల్పించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కోతుల బీభత్సంతో జనాలకు తిప్పలు 

కాగా  జిల్లాలో కోతుల భీభత్సం జనాన్ని తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తోంది. గత మూడు నాలుగుయేళ్ల నుంచి కోతుల సంఖ్య విఫరీతంగా పెరిగిపోయింది. వీటి జనాభాను అరికట్టలేకపోతుండడంతో కుప్పలు తెప్పలుగా ఈ కోతులు అటు పంట పొలాలను నాశనం చేస్తుండగా ఇటు జనవాసాలను తిప్పలు పెడుతున్నాయి. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను ఈ కోతులు నాశనం చేస్తున్నాయి. రైతులు కోతుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు తంటాలు పడుతున్నారు. అలాగే అడవులకు ఆనుకొని ఉన్న ప్రధాన రహదారులపై కోతులు భీభత్సం సృష్టిస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కోతుల కారణంగా ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. దీంతో పాటు కోతులకు గుంపులు జనవాసాల్లో చొరబడి గందరగోళం సృష్టిస్తున్నాయి. కొన్ని చోట్ల కోతుల దాటిని తట్టుకోలేక ఇండ్ల నుంచి బయటకు వెళ్ళేందుకు జనం జంకుతున్నారు. కోతుల జనాభా రోజుకు రోజుకు విఫరీతంగా పెరిగిపోతున్న కారణంగానే వాటి ఆగడాలను కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంటోంది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస సంరక్షణ కేంద్రం కోతుల జనాభాను అరికట్టేందుకు తోడ్పడవచ్చంటున్నారు. 

పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు

స్థానిక గండిరామన్న ఆలయం నిర్మల్‌ అర్బన్‌ పార్కులో నిర్మించిన కోతుల సంరక్షణ పునరావాస కేంద్రం కోతుల కట్టడికి వారధిగా మారుతోందంటున్నారు. ఇక్కడి కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చారు. ఇక్కడి డాక్టర్‌లకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. డాక్టర్‌తో పాటు సిబ్బందికి సైతం కోతుల సంరక్షణ విషయంలో శిక్షణ ఇచ్చారు. 

అలాగే ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్‌ను, కొంతకాలం పాటు కోతులను సంరక్షించేందుకు ప్రత్యేక పంజరాలను సైతం ఏర్పాటు చేశారు. కోతులకు అవసరమైన ఆహారాన్ని కూడా సమకూరుస్తున్నారు. ఆపరేషన్‌లకు అనుకూలమైన కోతులను అనుకూలం కాని కోతులను వేరు వేరుగా ఉంచుతున్నారు. ఆపరేషన్‌లు జరిపిన తరువాత కొన్ని రోజుల పాటు తమ ఆధీనంలోనే ఉంచుకొని ఆ తరువాత అటవీ ప్రాంతంలో వాటిని వదిలి పెడుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు ఇక్కడి కేంద్రానికి 430 కోతులను ఆపరేషన్‌ కోసం తరలించగా ఇందులో నుంచి 222 కోతులకు విజయవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లను చేశారు. మిగ తా కోతులు గర్భధారణతో ఉండడమే కాకుండా మరికొన్ని కారణాల వల్ల వాటికి ఆపరేషన్‌లను చేయడం లేదు. కొద్ది రోజుల్లోనే వీటికి కూడా ఆపరేషన్‌లను చేసేందుకు డాక్టర్‌లు సిద్దమవుతున్నారు. 


Updated Date - 2021-05-09T06:13:13+05:30 IST