కరోనా దెబ్బకు కొత్త వృత్తిలోకి..

ABN , First Publish Date - 2021-02-20T06:58:31+05:30 IST

భారత ఉద్యోగ మార్కెట్‌పై కరోనా శాశ్వత ప్రభావం చూపనుందని మెకిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ తాజా నివేదిక పేర్కొంది. ఈ సంక్షోభం దెబ్బకు 2030 నాటికి 1.8 కోట్ల మంది భారతీయులు కొత్త వృత్తిని ఎంచుకోవాల్సి రావచ్చని అంచనా వేసింది

కరోనా దెబ్బకు కొత్త వృత్తిలోకి..

2030 నాటికి 1.8 కోట్ల మంది కొలువు మారాల్సి రావచ్చు..

భారత జాబ్‌ మార్కెట్‌పై మెకిన్సే నివేదిక


ముంబై: భారత ఉద్యోగ మార్కెట్‌పై కరోనా శాశ్వత ప్రభావం చూపనుందని మెకిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ తాజా నివేదిక పేర్కొంది. ఈ సంక్షోభం దెబ్బకు 2030 నాటికి 1.8 కోట్ల మంది భారతీయులు కొత్త వృత్తిని ఎంచుకోవాల్సి రావచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా.. రిటైల్‌, ఫుడ్‌ సర్వీసెస్‌, ఆతిథ్యం, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందిపై ప్రభావం అధికంగా ఉండనుందని నివేదిక పేర్కొంది. మెకిన్సే నివేదికలోని మరిన్ని విషయాలు.. 

  • కరోనా వ్యాప్తి జాబ్‌ మార్కెట్లను కుదిపేసింది. కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేందుకు కొత్త విధానాలు అవలంబించాల్సి వచ్చింది. భారత్‌ సహా ప్రపంచంలోని 8 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఉద్యోగుల డిమాండ్‌, వృత్తుల్లో మార్పులు, ఉద్యోగుల వృత్తి నైపుణ్యంపై కొవిడ్‌-19 ప్రభావాలను మెకిన్సే రిపోర్టు ప్రస్తావించింది.  

  • కరోనా వ్యాప్తి తర్వాత వినియోగదారుల వైఖరి, వ్యాపారా విధానాల్లో ప్రధానంగా మూడు మార్పులు వచ్చాయి. 1.ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేయాల్సి రావడం, 2.ఈ-కామర్స్‌ సేవలు, వర్చువల్‌ సంప్రదింపులకు డిమాండ్‌ ఊపందుకోవడం 3.యాంత్రీకరణ, కృత్రిమ మేధ వినియోగం శరవేగంగా పెరుగుతుండటం. ఈ మార్పులు భవిష్యత్‌లోనూ కొనసాగనున్నాయి. ఈ పరిణామాలు వచ్చే దశాబ్దకాలంలో ఆర్థిక వ్యవస్థల్లో ఉద్యోగాల పునర్‌వ్యవస్థీకరణకు దారితీయనున్నాయి. తత్ఫలితంగా టాప్‌- 8 ఆర్థిక వ్యవస్థల్లో 10 కోట్ల మంది కొత్త కొలువు వెతుక్కోవాల్సి రావచ్చు. భారత్‌లో 1.8 కోట్ల మంది కొత్త వృత్తిని ఎంచుకోవాల్సి రావచ్చు. 
  • మిగతా దేశాలతో పోలిస్తే, భారత్‌పై కరోనా ప్రభావం తక్కువే. ఎందుకంటే, 35-55 శాతం మంది కార్మికులు భవన నిర్మాణాలు, వ్యవసాయ క్షేత్రాలు వంటి అవుట్‌డోర్‌ ప్రొడక్షన్‌, మెయింటెనెన్స్‌ విభాగాల్లో పనిచేస్తున్నవారే. 
  • భారత్‌లో మొత్తం కార్మిక పని గంటల్లో ఫిజికల్‌, మాన్యువల్‌ స్కిల్స్‌ కోసం వెచ్చించే వాటా 2.2 శాతం తగ్గనుండగా.. సాంకేతిక నైపుణ్యంతో కూడిన పనిగంటల వాటా 3.3 శాతం పెరగనుంది. 
  • వైరస్‌ దీర్ఘకాలిక ప్రభావంతో తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు సన్నగిల్లనున్నాయి. వీరంతా హెల్త్‌కేర్‌, టెక్నాలజీ, భోధన, శిక్షణ, సోషల్‌ వర్క్‌, హెచ్‌ఆర్‌ వంటి అధిక నైపుణ్యం అవసరమైన వృత్తులను చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి. 
  • కొత్త నైపుణ్యాల శిక్షణ మరింత సవాలుగా మారనుంది. ముఖ్యంగా కింది స్థాయి సిబ్బందిపై కరోనా అధిక ప్రభావం చూపనుంది. కాబట్టి, వీలైనంత త్వరగా వీరు భవిష్యత్‌ నైపుణ్యాల్లో శిక్షణ పొందేందుకు కంపెనీలు, ప్రభుత్వాలు సాయపడాలి. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ భవిష్యత్‌లోనూ కొనసాగనుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు గణనీయంగా తగ్గనున్నాయి. తాత్కాలిక లేదా కాంట్రాక్టు ఉపాధి అవకాశాలు పుంజుకోనున్నాయి. యాంత్రీకరణ సైతం జోరందుకోనుంది. 

Read more