కరోనా బ్లాక్‌ మార్కెట్‌

ABN , First Publish Date - 2021-05-07T05:39:27+05:30 IST

కేపీహెచ్‌బీ ప్రాంతంలో

కరోనా బ్లాక్‌ మార్కెట్‌

కట్టడికి పోలీసుల చర్యలు 

రెమ్ డెసివిర్ , ఆక్సిజన్‌ బ్లాక్‌లో అమ్ముతూ..

లక్షలు సంపాదిస్తున్న ముఠాలు

వారి కోసం రంగంలోకి స్పెషల్‌ పోలీసులు 

హైదరాబాద్‌ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి) 

- మే 6 : కేపీహెచ్‌బీ ప్రాంతంలో కరోనా రోగులకు అత్యవసరంగా ఇచ్చే రెమ్ డెసివిర్ ను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 4 రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

-  మే 5: బ్లాక్‌ మార్కెట్లో రెమ్ డెసివిర్ ఒక్కొక్కటి రూ. 35వేలకు అమ్ముతున్న నిందితున్ని రాచకొండ మాల్కాజిగిరి ఎస్‌వోటి, జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 4 ఇంజక్షన్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

-  మే-3:  బ్లాక్‌ మార్కెట్లో రెమ్ డెసివిర్ ఇంజక్షన్‌ అధిక ధరకు అమ్ముతున్న ఇద్దరు నిందితులను మియాపూర్‌లో అరెస్ట్‌ చేశారు.

-  ఏప్రిల్‌-30: మేడిపల్లి, మల్కాజిగిరి పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా రెమ్ డెసివిర్ లు బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

-  ఏప్రిల్‌-30: ప్రాణవాయువును బ్లాక్‌లో అమ్ముతున్న మల్లేపల్లిలోని ఓ గ్యాస్‌ ఎజెన్సీపై సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. 41 పెద్ద సిలిండర్స్‌, 16 చిన్న సిలిండర్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. 

-  ఏప్రిల్‌-29 : ఆక్సిజన్‌ బ్లాక్‌లో అమ్ముతున్న మరో గ్యాస్‌ ఏజెన్సీపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 19 ఆక్సిజన్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఏప్రిల్‌-29:  కాచిగూడలో రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లు బ్లాక్‌ అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 4 ఇంజక్షన్‌లు స్వాధీనం చేసుకున్నారు.  

-   నాగోల్‌ మెట్లోస్టేషన్‌ వద్ద రెమ్ డెసివిర్ , కొవిఫర్‌ ఇంజక్షన్‌లు ఒక్కోకటి రూ. 30వేలకు విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌వోటి పోలీసులు అరెస్టు చేశారు. 3 రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిజానికి ఒక్క రెమ్ డెసివిర్ ఇంజక్షన్‌ ఽఅసలు ధర రూ. 3490లు కానీ పదిరెట్టు ఎక్కువగా అంటే 34-35వేలకు అమ్ముతున్నారు. 

-  ఎన్జీవో ముసుగులో అర్ధరాత్రి అక్రమంగా ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2  సిలిండర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

-  దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో వద్ద రెమ్ డెసివిర్ ఇంజక్షన్‌లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటి పోలీసులు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి జాయింట్‌ ఆపరేషన్‌ చేసి పట్టుకున్నారు. 

ఇవి పోలీసులకు చిక్కిన ముఠాలు మచ్చుకు కొన్ని మాత్రమే. పోలీసుల కళ్లుగప్పి నగరంలో ఆక్సిజన్‌, అత్యవసర మందులు, ఇంజక్షన్‌లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాలు పదుల సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో ట్రై కమిషనరేట్‌ సీపీల ఆదేశాలతో హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌, రాచకొండ, సైబరాబాద్‌లో ఎస్‌వోటి పోలీసులను రంగంలోకి దింపారు. 

ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభించి ప్రజల ప్రాణాలను బలిదీసుకుంటుంటే.. మరో వైపు కొందరు కేటుగాళ్లు కరోనా రోగులే లక్ష్యంగా మందులను బ్లాక్‌లో అమ్ముతూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. అత్యవసర మందులను బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతూ 10-15 రెట్లు ఎక్కువ డబ్బును దండుకుంటున్నారు. బ్లాక్‌ మార్కెట్లో మందులు కొనలేక, కరోనాను జయించలేక, బాధితుల్లో కొందరు ప్రాణాలు వదిలేస్తున్నారు. నగరంలో ఇలాంటి దారుణ పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆక్సిజన్‌ సహా.. అత్యవసర మందులు ఏవైనా బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కేటుగాళ్లను కటకటాల్లోకి నెడుతున్నారు.


నిందితులపై కఠిన చర్యలు

వి.సి. సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ.

కొవిడ్‌ ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహాయం చేయాలి. అంతేకాని.. మానవత్వాన్ని మరిచిపోయి ఇలా బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మందులను, ఆక్సిజన్‌ను బ్లాక్‌లో అమ్మొద్దు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము. క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెడుతున్నాం


 ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దింపాం..

అంజనీకుమార్‌, హైదరాబాద్‌ సీపీ..

అత్యవసర మందులు, ఆక్సిజన్‌ను విచ్చలవిడిగా బ్లాక్‌ మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దింపాము. ఇప్పటికే పలు ముఠాలను పట్టుకొని అరెస్టు చేశాం. కరోనా బాధితల కుటుంబాలను అడ్డంగా దోచేస్తున్న కేటుగాళ్ల ఆటకట్టిపస్తున్నాం.


క్రిమినల్‌ కేసులు పెడుతున్నాం..

మహేష్‌ ఎం. భగవత్‌, రాచకొండ సీపీ..

బ్లాక్‌ మార్కెట్లో రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లు, ఆక్సీజన్‌ అధిక ధరలకు అమ్ముతున్న ముఠాలపై రాచకొండ ఎస్‌వోటి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిందితులపై క్రిమినల్‌ కేసులు  నమోదు చేస్తున్నాం. అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఎస్‌వోటి పోలీసులు ప్రత్యే నిఘా పెట్టారు. ఇప్పటికే పలు ముఠాలను పట్టుకున్నారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే డయల్‌-100కు, 9490617111కు ఫోన్‌ చేసి చెప్పొచ్చు. 

Updated Date - 2021-05-07T05:39:27+05:30 IST