కరోనా కాటుకు తల్లీకొడుకు బలి!

ABN , First Publish Date - 2021-05-07T05:08:54+05:30 IST

కరోనా మహమ్మారి పలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా వైరస్‌ సోకిన వారిలో పలువురు మృత్యువాత పడుతుండడం అందరినీ కలచి వేస్తోంది.

కరోనా కాటుకు తల్లీకొడుకు బలి!
కరోనాతో మృతి చెందిన తల్లీకొడుకు (ఫైల్‌ )

 వారం వ్యవధిలోనే ఓ ఇంట విషాదం

 వైద్యాలయంలో చేర్పించుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని బంధువులు కన్నీరుమున్నీరు

 ప్రస్తుతం ఇదే కుటుంబంలో తండ్రీ కొడుక్కి వైరస్‌

 కొడుకును వైద్యాలయానికి తీసుకు వెళ్లినా బెడ్లు లేవనే సమాధానం

  ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించామన్న మేనమామ నాగేంద్రరావు


కొత్తూరు, మే 6 : కరోనా మహమ్మారి పలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా వైరస్‌ సోకిన వారిలో పలువురు మృత్యువాత పడుతుండడం అందరినీ కలచి వేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఓ ఇంట్లో తల్లీ కొడుకును కాటేయడం కంటతడి పెట్టిస్తోంది. గ్రామీణ జిల్లాలో పెద్దాసుపత్రిగా పేరుగాంచిన అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో చికిత్సలు చేసి ఉంటే.. ఈ రెండు నిండుప్రాణాలు నిలిచి ఉండేవని వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి మండలం కొత్తూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తూరు ఎన్‌జీవో కాలనీకి చెందిన పి.రాజు అగరబత్తీల వ్యాపారం చేస్తుంటారు. బీటెక్‌ చదువుతున్న అతని కుమారుడు పి.వరుణ్‌కుమార్‌ (26)కు పది రోజుల క్రితం కరోనా సోకింది. పరిస్థితి విషమంగా మారడంతో వారం రోజుల క్రితం అతనిని కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఆక్సిజన్‌ బెడ్లు లేవని అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేది లేక  హోం ఐసోలేషన్‌లో ఉంచి మందులు వాడామని, అయిప్పటికీ ఫలితం లేకపోవడంతో గత నెల 29న వరుణ్‌కుమార్‌ మృతిచెందాడని అతని మామయ్య బుద్ద నాగేంద్రరావు  విలపించారు. అలాగే, వారం తరువాత వరుణ్‌తల్లి అయిన పద్మ (50)కు కరోనా సోకిందన్నారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం సాయంత్రం ఎన్టీఆర్‌ వైద్యాలయానికి  తీసుకు వెళ్లామని, ఆ సమయంలో వైద్యులు లేరని, బెడ్లు కూడా ఖాళీ లేవని చెప్పడంతో ఆమెను కూడా ఇంటికి తీసుకు రావాల్సి వచ్చిందని నాగేంద్రరావు తెలిపారు. చివరకు పద్మ సైతం గురువారం తెల్లవారుజామున మృతిచెందారన్నారు. ఇదిలావుంటే, వరుణ్‌కుమార్‌ తండ్రి రాజు, అతని సోదరుడు అరుణ్‌కుమార్‌కు ప్రస్తుతం కరోనా నిర్ధారణ కావడంతో గురువారం సాయంత్రం ఎన్టీఆర్‌ ఆస్పత్రికి అరుణ్‌కుమార్‌కు తీసుకు వెళ్లినట్టు నాగేంద్రరావు తెలిపారు. అతనికి కూడా ఆస్పత్రిలో బెడ్లు లేవని చెప్పడంతో గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించామన్నారు.  ఈ సందర్భంగా బుద్ద నాగేంద్రరావు మాట్లాడుతూ అనకాపల్లిలో పేరుకే ప్రభుత్వ పెద్దస్పత్రి ఉందనిగానీ, ప్రజలకు సేవలు అందించడంతో పూర్తిగా విఫలమైందని  ఆరోపించారు.  ప్రజల ప్రాణాలు పోతున్నా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ సత్యవతి స్పందించకపోవడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుటుంబాన్ని, అనకాపల్లి ప్రజలను ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు. 

Updated Date - 2021-05-07T05:08:54+05:30 IST