కరోనా కాటు

ABN , First Publish Date - 2020-04-04T09:35:51+05:30 IST

జిల్లాలో కరోనా మరణ మృదంగం మొదలు పెట్టింది. జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. రెండు రోజుల కిందట మృతిచెందిన నందిగామ మండలం

కరోనా కాటు

జిల్లాలో తొలి మరణం నమోదు

చేగూర్‌లో  మహిళ మృతితో కలకలం

మొత్తం 17 పాజిటివ్‌ కేసులు

ఢిల్లీ వెళ్లివచ్చిన వారిలో ఆరుగురికి పాజిటివ్‌


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి జిల్లాలో ఒకరు బలయ్యారు. వైరస్‌ సోకి మహిళ మృతిచెందిందన్న వార్త వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. జిల్లాలో ఇప్పటివరకు 17 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. శుక్రవారం నందిగామ మండలం చేగూర్‌లో తొలి మరణం సంభవించింది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేకెత్తింది. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : జిల్లాలో కరోనా మరణ మృదంగం మొదలు పెట్టింది. జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. రెండు రోజుల కిందట మృతిచెందిన నందిగామ మండలం చేగూర్‌ మహిళకు రక్తనమూనాల్లో కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేకెత్తిం చింది. స్థానికంగా గ్రామంలో ఉంటూ కిరాణషాపు నడుపుకునే 55 ఏళ్ల మహిళకు వైరస్‌ ఎలా సోకిందనేది ఇంకా అంతుపట్టడం లేదు. ఆమె ఇంట్లో కిరాయికిఉండే యూపీ, బిహార్‌కు చెందిన నలుగురు యువకుల ద్వారా ఈమెకు ఈ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. మృతిరాలి ఇంట్లో నలుగురు యూపీ, బిహార్‌కు చెందిన నలుగురు యువకులు అద్దెకు ఉంటారు. వీరంతా సమీపంలోని కన్హాశాంతి వనంలో పని చేస్తారు. గతనెల 18న  వారంతా స్వస్థలాలకు  వెళ్లి తిరిగి ఢిల్లీ నుంచి వచ్చే రైలులో వచ్చారు. ఆ రైలులో ఢిల్లీ మర్కాజ్‌ నుంచి వచ్చే ప్రయాణి కులు కూడా ఉన్నారు. వీరిద్వారా వైరస్‌ సోకిందా? అనేదానిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నలుగురు యువకులు ఇంకా ఎలాంటి అనారోగ్యానికి గురికాకపోవడంతో ఎవరికీ వీరిపై అనుమానాలు రాలేదు.


మృతురాలు అనారోగ్యానికి గురైన మూడు రోజుల్లోనే మృతి చెందడం గమనార్హం. ఈమె మరణం అధికార వర్గాల్లో కూడా కలకలం రేకెత్తి స్తోంది. చేగూర్‌లో కిరాణషాపు నడుపుకునే ఈ మహిళ నాలుగు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా మహబూబ్‌నగర్‌లో ఉన్న కూతురు ఇంటికి వెళ్లింది. కూతురు ఆమెను ఎస్‌వీఎస్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు ఆమెను గత నెల 31రాత్రి ఉస్మానియా ఆసుపత్రికి  తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే డాక్టర్లు పరీక్షల నిమిత్తం రక్త నమూనాలను సేకరించారు. అయితే చికిత్స పొంతున్న మహిళ ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వగ్రామమైన చేగూర్‌కు గురువారం తీసుకువచ్చి మాములుగా  అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్రక్రియలకు కుటుంబసభ్యులతో పాటు సమీప బంధు వులు, గ్రామానికి చెందిన సుమారు 25 మందికిపైగా  హాజరయ్యారు.


చూడడానికి స్థానికలు చాలామంది వెళ్లారు. అయితే ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సమయంలోనే వైద్య పరీక్షల కోసం శాంపిళ్ళు తీసు కున్న సిబ్బంది మృతిచెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ ఉందని శుక్ర వారం మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించారు. ఈ విషయం తెలియ గానే అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులు భయాందోళనలో పడ్డారు. మృతిచెందిన మహిళనుంచి కరోనా వైరస్‌ ఎంతమందికి విస్తరించిందోనన్న భయాందోళనకు గుర య్యారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, వైద్య సిబ్బంది, పోలీసులు చేగూర్‌ చేరుకు న్నారు.  మృతురాలి కుటుంబ సభ్యులను వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న బీహార్‌కు చెందిన నలుగురు యువకులను అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులను పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


చేగూర్‌లో కరోనా కలకలం

షాద్‌నగర్‌/నందిగామ: నందిగామ మండలం చేగూర్‌ గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకడంతో మరణించిందన్న వార్త వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆమె నడుపుతున్న కిరాణ దుకాణానికి గ్రామంలోని చాలా మంది వెళ్లారు. అక్కడకు వెళ్లిన వారంతా ఇప్పుడు ఈ వైరస్‌ తమకు, తమ కుటుంబ సభ్యులకు కూడా సోకిందేమోనని భయపడుతున్నారు. చేగూరులో కరోనా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, వైద్య సిబ్బంది, పోలీసులు చేగూర్‌ చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న బిహార్‌కు చెందిన నలుగురు యువకులను అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులను పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తోపాటు సీపీ సజ్జనార్‌లు కన్హాశాంతివనాన్ని సందర్శించారు. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు..? వారిలో ఎవరైనా విదేశీయులు ఉన్నారా..? అన్న వివరాలు సేకరించినట్లు సమాచారం.   


బిహారీ, యూపీ వాసులతో కలిసి పనిచేస్తున్న కుమారుడు

మృతురాలి కుమారుడు బిహారీ, యూపీవాసులతో కలసి కన్హశాంతి వనంలో పనిచేస్తున్నాడు. అయితే, ఈ శాంతివనాన్ని గతనెల 15 నుంచే నిరవధికంగా మూసివేశారు. దీంతో బిహార్‌ నుంచి వచ్చిన వీరంతా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఇంతవరకు వారు ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. మృతురాలి భర్త మిరప బజ్జీలను విక్రయించేవాడు. అయితే వ్యాధి కుమారుని నుంచి సోకిందా... లేదా వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న బీహార్‌, యూపీ యువకుల నుంచి సోకిందా..? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కన్హాశాంతివనంలో ఎలాంటి ధ్యాన మహాసభలు నడవకపోవడం గ్రామ పరిసరాల్లో కూడా వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులు వెలుగులోకి రాకపోవడం అధికారులను సైతం అయోమయానికి గురి చేస్తుంది. కాగా కరోనా వైరస్‌ ఎటు నుంచి వచ్చిందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని  సమగ్రంగా పరిశీలించిన తరువాతనే చెప్పడానికి వీలుంటుందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ తెలిపారు.  


అంత్యక్రియలకు 25 మందిపైనే..

అంత్యక్రియలకు కుటుంబసభ్యులతోపాటు సమీప బంధువులు, గ్రామానికి చెందినవారు సుమారు 25 మందికిపైగా హాజరయ్యారు. అయితే ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సమయంలోనే వైద్య పరీక్షల కోసం శాంపిళ్లు తీసుకున్న సిబ్బంది మృతి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ ఉందని శుక్రవారం మధ్యాహ్నం వెల్లడించారు. ఈ విషయం తెలియగానే జిల్లా వైద్యాధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, సీపీ సజ్జనార్‌ తదితర అధికారులు సైతం గ్రామానికి చేరుకోవ డంతో కరోనా విషయం గ్రామంలో దావానంలా వ్యాపించింది. కరోనా వ్యాధితోనే మహిళ మృతి చెందిందని తెలియగానే అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మృతి చెందిన మహిళనుంచి కరోనా వైరస్‌ ఎంత మందికి విస్తరించిందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాధిని గ్రామం నుంచి తరలించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని అధికారులను కోరుతున్నారు. 


గాంధీ ఆసుపత్రికి 14మంది తరలింపు  

కరోనా వ్యాధితో మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు, అంత్యక్రియల్లో పాల్గొన్న సమీప బంధువుల్లో 14 మందిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియలకు పాల్గొన్నవారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. 


అయితే గ్రామంలో పోలీస్‌, మెడికల్‌, రెవెన్యూ కలిసి మొత్తం 30 టీంలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే సమాచారం కోసం 9490617440, 9490617431 నెంబర్లకు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సీపీ సజ్జనార్‌ తెలిపారు.


Updated Date - 2020-04-04T09:35:51+05:30 IST