కరోనాకు ‘భారత్‌ బయో’ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-04-04T05:48:33+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్‌ కంపెనీ భారత్‌ బయోటెక్‌.. కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఇందుకు విస్కాన్‌సిన్‌- మాడిసన్‌ విశ్వవిద్యాలయం, వ్యాక్సిన్‌ కంపెనీ ఫ్లూజెన్‌తో చేతులు కలిపింది.

కరోనాకు ‘భారత్‌ బయో’ వ్యాక్సిన్‌

  • ఫ్లూజెన్‌తో భాగస్వామ్యం
  • ఏడాది చివరకు హ్యూమన్‌ క్లినికల్‌ పరీక్షలు
  • 30 కోట్ల డోసుల తయారీ యోచన


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్‌ కంపెనీ భారత్‌ బయోటెక్‌.. కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఇందుకు విస్కాన్‌సిన్‌- మాడిసన్‌ విశ్వవిద్యాలయం, వ్యాక్సిన్‌ కంపెనీ ఫ్లూజెన్‌తో చేతులు కలిపింది. భాగస్వాములకు చెందిన వైరాలజిస్టులతో కలిసి ఇంట్రానాజల్‌ వ్యాక్సిన్‌ ‘కోరోఫ్లూ’ను అభివృద్ధి చేసి పరీక్షలు చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ అధిపతి రాచెస్‌ ఎల్లా తెలిపారు. ఫ్లూజెన్‌ కంపెనీకి చెందిన ఫ్లూ వ్యాక్సిన్‌ ఆధారంగా కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్నామని.. ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 క్లినికల్‌ పరీక్షల దశలో ఉందని వివరించారు. ఈ ఔషధాన్ని ముక్కు ద్వారా తీసుకుంటారు. ‘వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తుంది. క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడానికి 30 కోట్ల డోస్‌లను తయారు చేస్తుంది. ఒప్పందం ప్రకారం ఫ్లూజెన్‌ ప్రస్తుతం తన వద్ద ఉన్న తయారీ ప్రాసెస్‌సలను భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేస్తుంద’ని రాచెస్‌ ఎల్లా తెలిపారు. భారత్‌ బయోటెక్‌ ఇప్పటి వర కూ 16 వ్యాక్సిన్లను వాణిజ్య పరంగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకువచ్చిందని, 2009లో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన హెచ్‌1ఎన్‌1 ఫ్లూ వైర్‌సకు కూడా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిందని వివరించారు. ‘కోరోఫ్లూ’ వ్యాక్సిన్‌పై యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌-మాడిసన్‌ వైరాలజిస్టులు జంతువులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టొచ్చు. అనంతరం మనుషులపై సేఫ్టీ, ఎఫికసీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు హైదరాబాద్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తారు.


కోరోఫ్లూపై 2020 చివరి నాటికి హ్యమన్‌ క్లినికల్‌ పరీక్షలు జరిగే వీలుంది. శ్వాసకోశ ఇబ్బందులకు ముకోసాల్‌ ఇమ్యూనిటీ చాలా కీలకం. కోరోఫ్లూ ఇన్‌ఫ్లుయంజా ఆధారిత వ్యాక్సిన్‌. అందువల్ల హెచ్‌2ఎన్‌2 స్ట్రెయిన్‌కు రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అందువల్ల కోవిడ్‌-19 వైర్‌సను రూపుమాపడంలో కోరోఫ్లూ బాగా పనిచేయగలదని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. ఇతరుల నుంచి సోకే వ్యాధుల వల్ల ప్రజలు చనిపోవడమే కాక.. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని రాచెస్‌ ఎల్లా అన్నారు.

Updated Date - 2020-04-04T05:48:33+05:30 IST