Abn logo
May 24 2020 @ 04:01AM

మామిడాడలో కరోనా పడక

జిల్లాలో ఒకేరోజు ఏకంగా

20 పాజిటివ్‌ కేసులు 

కొవిడ్‌తో గురువారం మృతి చెందిన  వ్యక్తి ద్వారా వీరందరికి వైరస్‌ వ్యాప్తి

వీరిలో 16మంది జీ మామిడాడ,  ముగ్గురిది బిక్కవోలు, ఒకరిది రామచంద్రపురం

8మంది మహిళలు, 12మంది పురుషులు

మృతి చెందిన వ్యక్తి ద్వారా రెండు  రోజుల్లో మొత్తం 28 మందికి కొవిడ్‌

జిల్లాలో 95కి చేరిన పాజిటివ్‌ కేసులు,  వారం వ్యవధిలో 43 నమోదు

మామిడాడ హోటల్‌లో అల్పాహారం, టీ తీసుకున్న వారందరికి శ్వాబ్‌ టెస్ట్‌లు

ఇరుకైన వీధులు, ఇళ్లు కావడంతోనే కేసుల సంఖ్య భారీగా ఉన్నట్టు అంచనా

 మూడు ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి); పెదపూడి మండలం మామిడాడలో కొవిడ్‌ విశ్వ రూపం ప్రదర్శిస్తోంది. జిల్లాలో మొట్టమొదటిసారిగా భారీఎత్తున జన సమూహానికి వైరస్‌ విస్తరించి బాధి తుల సంఖ్యను అమాంతం పెంచేస్తోంది. ఇంతవరకు రాజమహేంద్రవరంలో గొలుసుకట్టు విధానంలో వైరస్‌ ఆరుగురిని బాధితులుగా మార్చిన ఘటనే పెద్దది. దీన్ని తలదన్ని జీ మామిడాడలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అంతుచిక్కని రీతిలో వైరస్‌ పదుల సంఖ్యలో జనాన్ని చుట్టుముట్టేస్తోంది. శనివారం ఒక్కరోజే ఏకంగా 20 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. కొవిడ్‌తో గురువారం కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందిన 53 ఏళ్ల వ్యక్తిద్వారా వీరందరికి వైరస్‌ వ్యాపిం చింది.


శుక్రవారం ఎనిమిది మందికి  కూడా ఈ వ్యక్తి ద్వారానే వైరస్‌ సోకింది. ఇతడి ద్వారా రెండు రోజుల వ్యవధిలో 28 మందికి వైరస్‌ పాకింది. దీంతో జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 95కి చేరింది. ఇందులో 43 కేసులు గడిచిన వారం వ్యవధిలో నమోదయ్యాయి. నాలుగో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత నుంచి కేసుల సంఖ్య పెరుగుతుండడం వైద్యవర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.


1:6 నుంచి 1:28కి...

విదేశాల నుంచి వచ్చినవారు, ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లి తిరిగి వచ్చినవారు.. చెన్నై కోయంబేడు మార్కెట్‌, కోల్‌కతా గుడ్ల మార్కెట్‌, క్వారంటైన్‌ కేసులు.. గడిచిన రెండు నెలల వ్యవధిలో జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరగడానికి నేపథ్యాలు.. కారణాలు. కానీ ఇప్పుడు వీటన్నింటికిమించి గొల్లల మామిడాడలో కొవిడ్‌ తాండవం చేస్తోంది. గురువారం మృతి చెందిన వ్యక్తి 53 ఏళ్ల వ్యక్తి నుంచి ఏకంగా 28 మందికి వైరస్‌ వ్యాపించి కలకలం రేపుతోంది. గడిచిన మూడు లాక్‌డౌన్‌ల వ్యవధిలో జిల్లాలో కొవిడ్‌ కేసులు చాలా నమోదయ్యాయి. ఇందులో వాటి నిష్పత్తి అత్యధికంగా గత నెల్లో రాజమహేంద్రవరంలో ఒక వ్యక్తి నుంచి ఆరుగురికి వైరస్‌ విస్తరించింది. అంటే 1:6 ఇంతవరకు ఉన్న అత్యధిక కేసుల నిష్పత్తి. కానీ ఇప్పుడు దానిస్థానంలో మామిడాడ కేసులు గుబులు పుట్టిస్తున్నాయి.


శనివారం ఏకంగా 20 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 16 మామిడాడకు చెందిన వ్యక్తులుకాగా, ముగ్గురు బిక్కవోలు, ఒకరు రామచంద్రపురానికి చెందిన వారిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అటు రెవెన్యూ శాఖ 20 పాజిటివ్‌ కేసుల్లో ఆధార్‌ కార్డు చిరునామా ప్రకారం బిక్కవోలుకు చెందిన వారు ఏడుగురు ఉన్నట్టు చెబుతోంది. కానీ వీరిలో కొందరు మామిడాలలోనే నివాసం ఉంటున్నారు. దాంతో ఇక్కడ పాజిటివ్‌ వచ్చిన 16 మందిలో మృతుడి తాలుకా దగ్గరి బంధువులు, చుట్టుపక్క నివసిస్తోన్నవారు, ఆయన పనిచేసిన హోటల్‌కు తరచుగా అల్పాహారం కోసం వచ్చిన వారున్నట్టు అంచనా వేశారు. బిక్కవోలులో వచ్చిన కేసులు మృతుడి మేన కోడలి ద్వారా వ్యాపించినట్టు భావిస్తున్నారు. రామచంద్ర పురంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మామిడాడ హోటల్‌లో పని చేస్తూ రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో సదరు మృతుడి ద్వారా ఈయనకు కూడా వైరస్‌ వ్యాపించింది.


వాస్తవానికి గురువారం కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారా శుక్రవారం ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో మామిడాడలో ఆరుగురు, బిక్కవోలులో ఇద్దరు ఉన్నారు. దీంతో ఒక్క మామిడాడలో 180, బిక్కవోలు, రామచంద్రపురం కలిపి 40 మందికి శ్వాబ్‌ టెస్ట్‌లు చేశారు. ఇందులో 20 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో మహిళలు ఎనిమిది మంది, పురుషులు 12మంది ఉన్నారు. దీంతో చనిపోయిన వ్యక్తి ద్వారా రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 28 మంది వైరస్‌ బారిన పడ్డట్టు తేలింది. తాజా కేసులతో జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య మొత్తం 95కు చేరుకుంది. ఇందులో గడిచిన వారం వ్యవధిలోనే 43 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో గొల్లలమామిడాడలో పరిస్థితి అదుపు తప్పినట్టు గుర్తిం చిన అధికారులు రెడ్‌జోన్‌ ప్రకటించడం తోపాటు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఎవరూ ఇంటి నుంచి రావద్దని ఆదేశాలిచ్చారు. 


మామిడాడలోనే ఎందుకిలా? 

ఏదైనా ఒక ప్రాంతంలో ఒక పాజిటివ్‌ కేసు వస్తే సదరు వ్యక్తి నివసించే ప్రాంతంలో ముగ్గురు లేదా నలుగురు వరకు వైరస్‌ బారిన పడతారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన కొవిడ్‌ కేసుల నేపథ్యం పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవు తోంది. కత్తిపూడిలో ఓ ఉపాధ్యాయుడికి పాజిటివ్‌గా తేలిన సందర్భంలో ఆయన కొన్ని రోజులపాటు మామకు చెందిన కిరాణా దుకాణంలో సామాన్లు విక్రయించేవారు. కానీ ఆయ నకు పాజిటివ్‌ వచ్చిన తర్వాత కత్తిపూడిలో రెడ్‌అలర్ట్‌ ప్రక టించి వందల్లో శాంపిళ్లు తీశారు. అయితే వచ్చిన కేసులు అయిదుగా తేలాయి. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో కర్నూలు నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఆరుగురికి పాజిటివ్‌ తేలింది. కానీ మామిడాడలో కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తి నేరుగా ఎక్కడికి వెళ్లలేదు. అధికారులు, వైద్యశాఖ చెబుతున్న దాని ప్రకారం హోటల్‌లో పనిచేస్తూనే ఫోటోగ్రాఫర్‌గా శుభ కార్యాల కాంట్రాక్టు కోసం రామచంద్రపురం వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరో వ్యక్తి నుంచి ఈయనకు వైరస్‌ వ్యాపించింది. ఆ తర్వాత తిరిగి మామిడాడలో హోటల్‌ పనికి యథావిథిగా వచ్చేశాడు.


అటు 16వేల జనాభా ఉన్న ఈ ప్రాం తంతో వీధులన్నీ చాలా కిక్కిరిసి ఉంటాయి. చిన్న రహదారు లతోపాటు ఇళ్లన్నీ ఒకదానికి ఒకటి ఆనుకుని అత్యంత సమీపంగా ఉంటాయి. ఈ కారణంగానే  సదరు మృతుడు  నివసించిన ప్రాంతం నుంచి వైరస్‌ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువమందికి ప్రబలడానికి  కారణమై ఉంటుందని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శుక్రవారం కలెక్టర్‌, వైద్యశాఖ అధికా రులతో విజయవాడ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిన వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి కూడా మామిడాడ విషయం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మున్సిపాల్టీ స్థాయి జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అత్యధిక జనసాంద్రత ఉందని, కానీ వీధులు, ఇళ్లు అత్యంత కిక్కిరిసి ఉంటాయని గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన తన అను భవాన్ని వివరించారు. అందుకే మామిడాడపై పెద్దఎత్తున దృష్టిసారించి టెస్ట్‌లు చేయకపోతే కొవిడ్‌ తీవ్రంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

Advertisement
Advertisement