విధ్వంస కరోనా

ABN , First Publish Date - 2020-02-25T10:49:13+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ మరోసారి కుదిపేసింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌ సహా మరికొన్ని దేశాల్లోనూ కోవిడ్‌-19 కేసులు, మృతుల సంఖ్య అనూహ్యంగా పెరగడం ఇన్వెస్టర్లను భయాందోళనలకు గురిచేసింది. తత్ఫలితంగా భారత్‌తో సహా అంతర్జాతీయ స్టాక్‌ సూచీలన్నీ నష్టాల్లో

విధ్వంస కరోనా

  • సెన్సెక్స్‌ 807 పాయింట్లు పతనం
  • ఈ ఏడాదిలో రెండో అతిపెద్ద నష్టం 
  • 251 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
  • రూ.3.18 లక్షల కోట్ల సంపద ఆవిరి 


ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ మరోసారి కుదిపేసింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌ సహా మరికొన్ని దేశాల్లోనూ కోవిడ్‌-19 కేసులు, మృతుల సంఖ్య అనూహ్యంగా పెరగడం ఇన్వెస్టర్లను భయాందోళనలకు గురిచేసింది. తత్ఫలితంగా భారత్‌తో సహా అంతర్జాతీయ స్టాక్‌ సూచీలన్నీ నష్టాల్లో పయనించాయి. బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ ఏకంగా 806.89 పాయింట్లు కోల్పోయి 40,363.23 వద్దకు జారుకుంది. ఈ ఏడాదిలో సూచీకిది రెండో అతిపెద్ద నష్టం. మదుపర్లకు బడ్జెట్‌ రుచించకపోవడంతో ఈనెల 1న సెన్సెక్స్‌ 987 పాయింట్లు నష్టపోయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ విషయానికొస్తే.. సోమవారం సెషన్‌లో 251.45 పాయింట్ల క్షీణతతో 11,829.40 వద్ద స్థిరపడింది. ప్రధాన షేర్లతోపాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ అమ్మకాలు పోటెత్తాయి. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.60 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.58 శాతం క్షీణించాయి. అన్ని  విభాగాల కంపెనీల షేర్లు కుదుపునకు లోనుకావడంతో మదుపరుల సంపద విలువ రూ.3.18 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.158.51 లక్షల కోట్ల నుంచి రూ.155.33 లక్షల కోట్లకు తగ్గింది. 


సెన్సెక్స్‌ షేర్లన్నీ నష్టాల్లోనే.. 

బీఎ్‌సఈ సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలన్నీ నష్టాల బాటలోనే పయనించాయి. టాటా స్టీల్‌ అత్యధికంగా 6.39 శాతం విలువను కోల్పోయింది. మారుతి సుజుకీ, ఓఎన్‌జీసీ 4 శాతం పైగా నష్టపోయాయి. హెచ్‌డీఎ్‌ఫసీ, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం పైగా పతనమయ్యాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈలోని మెటల్‌ సూచీ 6 శాతం తగ్గగా.. ఆటో 3.39 శాతం, టెలికాం 3.33 శాతం జారుకున్నాయి. అన్ని రంగాల సూచీలు నేలచూపులే చూశాయి.


జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా జూమ్‌ 

ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపారంలో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేరు ఉవ్వెత్తున ఎగిసింది. బీఎ్‌సఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర ఏకంగా 12.5 శాతం పెరిగి రూ.26.55కు చేరుకుంది. చివర్లో 7.84 శాతం లాభంతో రూ.25.45 వద్ద ముగిసింది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌లో 49 శాతం వాటాను ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్‌ ఏడీపీకి విక్రయిస్తున్నట్లు గతవారం జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ డీల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమో దం కూడా లభించింది. 


అరబిందో షేరు ఢమాల్‌ 

తాజా సెషన్‌లో అరబిందో ఫార్మా షేరు భారీగా పతనమైంది. బీఎస్‌ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 18 శాతం క్షీణించి రూ.491.90 వద్దకు జారుకుంది. చివర్లో కంపెనీ షేరు 15.96 శాతం నష్టంతో రూ.503.85 వద్ద స్థిరపడింది. గత ఏడాది నవంబరు 4 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని యూనిట్‌-4పై  ‘యూఎస్‌ ఎ్‌ఫడీఏ’ నిర్వహించి తనిఖీలపై సమీక్ష ఇంకా పూర్తి కాలేదని అరబిందో వెల్లడించడం షేరు పతనానికి కారణంగా ఉంది.  


రూపాయి.. 3నెలల కనిష్ఠం

దేశీయ కరెన్సీ విలువ మూడు నెలలకు పైగా కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 34 పైసలు బలహీనపడి 71.98కి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లోనైతే ఎక్స్ఛేంజ్‌ రేటు 72 స్థాయిని అధిగమించేసింది. అంటే, ఒక డాలర్‌ కొనుగోలుకు మనం రూ.72 చెల్లించాల్సి వచ్చేది. కరోనా కల్లోలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు పెరగడం, అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటం ఇందుకు కారణమైంది.

Updated Date - 2020-02-25T10:49:13+05:30 IST