కరోనా కబళిస్తున్న ‘కణాల’ గుట్టురట్టు!!

ABN , First Publish Date - 2020-04-09T07:51:49+05:30 IST

కరోనా వైరస్‌ శ్వాసకోశ వ్యవస్థలోని ఏ కణాలను లక్ష్యంగా చేసుకుంటోంది? అనే ప్రశ్నకు జర్మనీలోని బెర్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(బీఐహెచ్‌) శాస్త్రవేత్తలు సమాధానాన్ని...

కరోనా కబళిస్తున్న ‘కణాల’ గుట్టురట్టు!!

  • శ్వాసనాళంలోని ‘సిలియా’ నడుమ ఉండే ‘ప్రో జెనిటర్‌’ కణాలే వైరస్‌ టార్గెట్‌
  • వాటిపై ఏసీఈ2 ఎంజైమ్‌ ఎక్కువ మోతాదులో ఉంటే.. భారీ ఇన్ఫెక్షన్‌  
  • వృద్ధులు సులువుగా కొవిడ్‌-19 బారినపడటానికి ప్రధాన కారణమదే 
  • జర్మన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి


బెర్లిన్‌, ఏప్రిల్‌ 8: కరోనా వైరస్‌ శ్వాసకోశ వ్యవస్థలోని ఏ కణాలను లక్ష్యంగా చేసుకుంటోంది? అనే ప్రశ్నకు జర్మనీలోని బెర్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(బీఐహెచ్‌) శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారు. హీడెల్‌బర్గ్‌ లంగ్‌ బయోబ్యాంక్‌ నుంచి సేకరించిన 12 మంది ఊపిరితిత్తుల కేన్సర్‌ రోగుల శాంపిళ్ల విశ్లేషణతో ఈవిషయం వెల్లడైంది. ‘ది ఎంబో’ జర్నల్‌లో అధ్యయన నివేదిక ప్రచురితమైంది. దీని ప్రకారం.. నోరు, ముక్కు, గొంతు, స్వరపేటికలను అనుసంధానిస్తూ ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాసనాళంపై సన్నపాటి వెంట్రుకలు ఉంటాయి. వాటిని సిలియా అంటారు. ఇవి చీమిడి, బ్యాక్టీరియాలను ఊపిరితిత్తుల నుంచి బయటికి నెట్టి వేయడానికి చీపుళ్ల మాదిరి మాధ్యమాలుగా పనిచేస్తాయి. శ్వాసనాళంలోని ఈ వెంట్రుకల సమూహాల్లో ఉండే ప్రో జెనిటర్‌’ కణాలను గ్రాహకాలుగా వాడుకొని కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌కు పాల్పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.


ఊపిరితిత్తుల్లోని ప్రతీ కణం ఉపరితలాన్ని అతుక్కొని యాంజియోటెన్జిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2(ఏసీఈ2) అనే ఎంజైమ్‌ ఉంటుంది. కరోనా వైర్‌సకు గ్రాహకంగా ఉపయోగపడుతున్న ‘ప్రో జెనిటర్‌’ కణాలపైనా ఏసీఈ2 ఉందని.. వృద్ధుల్లో దీని మోతాదు ఎక్కువగా ఉండటంతో వారిలో ఇన్ఫెక్షన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. మహిళలతో పోల్చితే పురుషుల్లోని ప్రో జెనిటర్‌ కణాలపై ఏసీఈ2 మోతాదు ఎక్కువగా ఉందని, అందువల్లే  కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ కేసుల్లో పురుషులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారని గుర్తుచేశారు. ఈ అధ్యయన నివేదిక కరోనా వైర్‌సను కట్టడిచేసే ఔషధాలు, చికిత్సా విధానాల అభివృద్ధికి ఊతమిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు.


Updated Date - 2020-04-09T07:51:49+05:30 IST