కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-19T05:19:12+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో మంగళవారం ఒక్కరోజే కొవిడ్‌ కేసులు సెంచరీ దాటాయి. 137 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కరోనా కలకలం
పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

- జిల్లాలో విస్తరిస్తున్న వైరస్‌.. పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

- ఒకేరోజు సెంచరీ దాటిన కొవిడ్‌ కేసులు

- మంగళవారం 137 కేసులు నమోదు

- గత 10 రోజుల్లో 451 కొవిడ్‌ కేసులు

- 5.3 శాతానికి చేరిన పాజిటివ్‌ రేటు

- గత వారంతో పోలిస్తే 4 రేట్లు పెరుగుదల

- జాగ్రత్తలు పాటించకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయంటున్న వైద్యులు


కామారెడ్డి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో మంగళవారం ఒక్కరోజే కొవిడ్‌ కేసులు సెంచరీ దాటాయి. 137 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల ప్రారంభం నుంచి చూస్తే మొదట్లో ఒకటి, రెండు చొప్పున వచ్చిన పాజిటివ్‌ కేసుల సంఖ్య వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే సోమవారం వరకు 100 దాటని కేసుల సంఖ్య మంగళవారం ఒకేరోజు భారీగా పెరిగాయి. గత వారం రోజులతో పోలిస్తే నాలిగింతలు పెరిగి 137కు చేరడంతో ఆందోళన కల్గిస్తోంది. మంగళవారం నాటికి కేసుల సంఖ్యను తీసుకుంటే 5.3 శాతానికి చేరినట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. జాగ్రత్తలు పాటించకపోవడంతోనే వైరస్‌ విస్తరిస్తుందని అందుకే కేసులు నమోదవుతున్నాయంటూ వాదన వినిపిస్తోంది. అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ వైరస్‌ తీవ్రత అంతగా ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఉన్నప్పటికీ అంత ఇబ్బందులు లేకపోవడంతో రోగులు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారే తప్ప ఆసుపత్రులకు రావడం లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

పది రోజుల్లో 451 కేసులు

జిల్లాలో గడిచిన 10 రోజుల్లో 451 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ కేసులు నమోదు కాగా మంగళవారం ఒకేరోజు 137 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మహానగరాల్లో ఉండేవారు సొంత ఊర్లకు చేరుకున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగిరావడం, వేడుకల్లో ఒకేచోట చేరడం వంటి వాటితో వైరస్‌ వ్యాప్తి ఎక్కువైనట్లు తెలుస్తోంది. మూడు రోజులు పండుగ వేడుకల్లో మునిగితేలిన జనానికి దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటున్నారు. థర్డ్‌వేవ్‌ ఒమైక్రాన్‌ రూపంలో వ్యాప్తి చెందడంతో ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా జిల్లా వైద్యఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుంది.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 32 వేలకు పైగానే..

జిల్లాలో కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌తో పాటు ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ కొనసాగుతుందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ మూడు వేవ్‌లలో జిల్లాలో ఇప్పటి వరకు 32వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు 137 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 32వేల 188 పాజిటివ్‌ కేసులకు చేరింది. 31వేల 940 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 192 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ థర్డ్‌వేవ్‌లో కేసులు నమోదవుతున్నప్పటికీ వైరస్‌ తీవ్రత అంతగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎవరు కూడా ఆసుపత్రులలో చేరడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ తీవ్రత తక్కువగా ఉందని ప్రమాదాలు జరగడం లేదని వారం రోజుల్లో కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి సైతం వైరస్‌ సోకుతున్నప్పటికీ వారిలో వైరస్‌ అంతగా ప్రభావం చూపడంలేదని త్వరగానే కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

జాగ్రత్తలు పాటించకపోవడంతోనే వ్యాప్తి

సంక్రాంతి పండుగ సమయం కావడం ఆదివారం కలిసి రావడంతో పట్టణాల నుంచి ప్రజలు పల్లెబాట పట్టారు. అంతా ఊర్లోకి వచ్చి కుటుంబ సభ్యులతో మూడు, నాలుగు రోజుల పాటు గ్రామాల్లోనే గడిపారు. అంతా ఇంట్లో వాళ్లమే కదా అనే అలసత్వంతో వ్యవహరించడం వైరస్‌ వ్యాప్తికి కారణమైందని వైద్యఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. మార్కెట్‌, బహిరంగా ప్రదేశాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.


పది రోజుల్లో కేసులు ఇలా..

తేది     పాజిటివ్‌ కేసులు

8        16

9         5

10       15

11       39

12       50

13       29

14       35

16       23

17       80

18       137

Updated Date - 2022-01-19T05:19:12+05:30 IST