కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-05-09T06:00:27+05:30 IST

ఉమ్మడి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు, వైరస్‌ బారినపడి మృతిచెందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో శనివారం ఒక్క రోజే 1,697 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, 12మంది మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో ఏడుగురు, సూర్యాపేట జిల్లాలో ముగ్గురు, యాదాద్రి జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా విజృంభిస్తోంది.

కరోనా కలకలం
రామగిరి గ్రామంలో సైదులు మృతదేహానికి దహన సంస్కరణ నిర్వహిస్తున్న బంధువులు.

ఉమ్మడి జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు

రోజురోజుకూ పెరుగుతున్న మృతులు

మునుగోడు తహసీల్దార్‌, ఆత్మకూరు(ఎం) పీఆర్‌ ఏఈ మృత్యువాత

చింతపల్లి ఎస్‌ఐకి పాజిటివ్‌

పలు శాఖలో సిబ్బంది, ఉద్యోగులకు వైరస్‌


నల్లగొండ మే, 8: ఉమ్మడి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు, వైరస్‌ బారినపడి మృతిచెందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో శనివారం ఒక్క రోజే 1,697 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, 12మంది మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో ఏడుగురు, సూర్యాపేట జిల్లాలో ముగ్గురు, యాదాద్రి జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు శాఖలకు చెందిన కార్యాలయాల్లో సిబ్బంది, ఉద్యోగులు పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. లక్షణాలున్న పలువురు సెలవుల్లో ఉండి హోంక్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయి కన్పిస్తున్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం తహసీల్దార్‌ సునంద, యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) పీఆర్‌ఏఈ మారగోని రవీందర్‌ పాజిటివ్‌తో శనివారం మృతిచెందడం రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లో కలకలం సృష్టిస్తోంది. అదేవిధంగా చింతపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది.



మునుగోడు తహసీల్దార్‌ చల్లా సునంద(58) కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. జిల్లాలోని పలు మండలాల్లో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆమె మూడు నెలల క్రితం ఆర్డీవో కార్యాలయం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఏప్రిల్‌ 1న తొలి మొదటి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కూడా ఆమె తీసుకున్నారు. అనంతరం వారంలోపే ఓ శుభకార్యంలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చాక తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు పరీక్షలు చేయగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా, పరిస్థితి విషమించి మృతిచెందారు. ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రం కాగా, భర్త లక్ష్మారెడ్డి గిరిజన వసతి గృహ సంక్షేమాధికారిగా తిరులమగిరిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇద్దరికీ వివాహమై అమెరికాలో స్థిరపడ్డారు. ఈ నెల 31న ఆమె ఉద్యోగ విరమణకు చెందాల్సి ఉండగా, ప్రభుత్వం వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడంతో విధుల్లో కొనసాగుతున్నారు.

ఆత్మకూరు(ఎం) మండలంలోని పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్న మారగోని రవీందర్‌ కరోనాతో బాధపడుతూ, గుండెపోటుతో శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

చందంపేట మండలం మురుపునూతల పంచాయతీ, హంక్యాతండా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జీటీ ఉపాధ్యాయురాలు(32) కరోనాతో హైదరాబాద్‌లో శనివారం మృతి చెందారు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక విధుల్లో పాల్గొన్న ఆమెకు కరోనా సోకింది. ఆమెకు భర్త, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు.

దేవరకొండలో 42 ఏళ్ల వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందాడు.

నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురంలో వృద్ధుడు(68) కరోనాతో మృతి చెందారు. ఏప్రిల్‌ 29న అతడికి జ్వరం రాగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న అతను శనివారం మృతి చెందాడు.

శాలిగౌరారం మండలంలోని రామగిరికి చెందిన ఓ వ్యక్తి(36)కి వారం రోజుల క్రితం పాజిటివ్‌ రాగా, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మాడ్గులపల్లి మండలంలోని ఆగామోత్కూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(69)కి వారం రోజుల క్రితం పాజిటివ్‌ రాగా, మిర్యాలగూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన కిరాణ వ్యాపారి(65) పాజిటివ్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన భార్యకు సైతం పాజిటివ్‌ నిర్ధారణ కాగా, హోంఐసోలేషన్‌లో ఉన్నారు.

గరిడేపల్లి మండలంలోని కల్మల్‌చెర్వు పంచాయతీ చెవ్వారిగూడెం గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న (75) వృద్ధుడు కరోనాతో శనివారం మృతిచెందాడు.

పెన్‌పహాడ్‌ మండలం గాజులమల్కాపురం గ్రామానికి చెందిన వ్యక్తి(50) కరోనాతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

చిలుకూరు మండలంలోని బేతవోలు పంచాయతీ సబ్బువారిగూడెంలో ఓ వ్యక్తి(45) కరోనాతో హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడి తండ్రికి సైతం పాజిటివ్‌తో గురువారం మృతిచెందాడు. ఒక్కరోజు వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

యాదగిరిగుట్ట మునిసిపాలిటీ యాదగిరిపల్లికి చెందిన ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు.

Updated Date - 2021-05-09T06:00:27+05:30 IST