ఎట్టకేలకు..!

ABN , First Publish Date - 2020-08-06T09:35:17+05:30 IST

ఎట్టకేలకు..!

ఎట్టకేలకు..!

కరోనాపై కదలిక

యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ ఆస్పత్రుల్లో వేగంగా పనులు

జిల్లా కలెక్టర్‌ పరిశీలన


అనంతపురం వైద్యం, అగస్టు5: కరోనా నియంత్రణ చర్యలు, బాధితులకు వసతులు, వైద్య సేవలపై జిల్లా అధికార యంత్రాంగంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇదివరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారే తప్పా.. పురోగతి కనిపించలేదు. ఇటీవల అనంతపురంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కరోనా సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి జిల్లాలో దారుణ పరిస్థితులున్నాయని మంత్రులు, అఽధికారుల సమక్షంలోనే కుండ బద్దలు కొట్టారు. దీంతో ఆరోగ్య మంత్రి అవసరమైన చర్యలు చేపట్టి, కరోనా బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు కరోనా వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ విభాగాల పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు, జేసీ డాక్టర్‌ సిరి ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌, జేసీ బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.


మరిన్ని 104, 108 వాహనాలు

జిల్లాలో మరిన్ని 104, 108 వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన తన కార్యాలయంలో 108, 104 వాహన సేవలపై డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, 108, 104 జోనల్‌, జిల్లా మేనేజర్లతో సమావేశమయ్యారు. వాహనాల పని తీరుపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 104 వాహనాలు 24, 108లు 50 పని చేస్తున్నాయన్నారు. శుక్రవారం నుంచి 104ల సంఖ్యను 62కి, 108 వాహనాలను 69కి పెంచుతున్నామన్నారు. ఇవన్నీ క్షేత్రస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 108, 104 వాహనాల ద్వారా సక్రమంగా ఆరోగ్య సేవలందేలా పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ, జోనల్‌, జిల్లా మేనేజర్లను కలెక్టర్‌ ఆదేశించారు.


Updated Date - 2020-08-06T09:35:17+05:30 IST