కట్టడి కాని కరోనా

ABN , First Publish Date - 2020-07-10T11:37:05+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా కట్టడి కావడం లేదు. ఒకరి నుంచి మరొకరికి కాకుండా, ఎవరికి ఎలా వస్తుందో తెలియని పరిస్థితి

కట్టడి కాని కరోనా

వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని వదలని వైరస్‌

మరో నలుగురు ఉద్యోగులకు పాజిటివ్‌

ఉమ్మడి పాలమూరులో కొత్తగా 13 కేసులు


మహబూబ్‌నగర్‌, వనపర్తి (వైద్యవిభాగం)/ జడ్చర్ల/ అచ్చంపేట/ గద్వాల క్రైం/ నారాయణపేట రూరల్‌, జూలై 9 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా కట్టడి కావడం లేదు. ఒకరి నుంచి మరొకరికి కాకుండా, ఎవరికి ఎలా వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వైద్య ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో వైరస్‌కు బాధితులవుతున్నారు. తాజాగా మరో నలుగురు వైద్య ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మొత్తంగా జిల్లాలో గురువారం ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లాకేంద్రంలోని పాత పాలమూరు, రామయ్యబౌళి, హబీబ్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వైద్య ఉద్యోగులు వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నారు. వీరందరికి పాజిటివ్‌ వచ్చింది.


అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఐడీఎస్‌పీలో పనిచేస్తున్న ఓ ఎపిడమాలజిస్టుకు కూడా పాజిటివ్‌ అని నిర్ధారించారు. లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి, పద్మావతి కాలనీలోని ఓ 42 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో పాటు జడ్చర్లలోని కావేరమ్మపేట వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన ఓ వ్యక్తికి, హన్వాడ మండల కేంద్రానికి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు తేలింది. 


వనపర్తి జిల్లా కొత్తకోటలో గురువారం ఒక పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. అయితే పట్టణంలోని సాయినగర్‌ కాలనీలో ఒక మహిళకు, ఒక కాంగ్రెస్‌ నాయకుడికి కరోనా సోకినట్లు చర్చలు జరుగుతున్నా, అధికారులు నిర్ధారించడం లేదు. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ శ్రీనివాసులును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, కేవలం ప్రభుత్వం చేస్తున్న పరీక్షల వివరాలు మాత్రమే తమకు తెలుస్తున్నాయన్నారు. ప్రైవేటులో ఎవరికి వారు చేయించుకుంటున్న పరీక్షల వివరాలు తెలవడం కష్టంగా మారుతోందన్నారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో పాతబస్తీకి చెందిన ఒక వ్యాపారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. బాధితుడి కుటుంబసభ్యుల నమూనాలు సేకరించి పరీక్షకు పంపినట్లు చెప్పారు. 


జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన దంపతులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ భీంనాయక్‌ తెలిపారు. 


నారాయణపేట మండలంలోని జాజాపూర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌ తెలిపారు.  

Updated Date - 2020-07-10T11:37:05+05:30 IST