Abn logo
Jul 8 2020 @ 00:56AM

కరోనాతోనైనా... కనువిప్పు కలిగేనా?

‘సర్వం నేనే’ అనే భావన సహజంగా మనిషిలో ఉంటుంది. తాను అన్నింటినీ జయించగలననీ, తనకు ఎదురే లేదనే ధీమాతో ప్రవర్తిస్తుంటాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలననీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తానన్న గర్వమూ కనిపిస్తుంది. తన శక్తి అపారమైందని, తనను ఎదిరించే శక్తి ప్రపంచంలో ఏదీ లేదన్న అహంకార ధోరణితో ఉన్న సందర్భంలో మానవాతీతమైన శక్తులు కూడా ఉంటాయని కొన్ని సందర్భాలు గుర్తు చేస్తుంటాయి. ‘డబ్బు, అధికారం, హోదాలు, ఆస్తులు, అంతస్తులు ఉంటే చాలు దేన్నయినా సొంతం చేసుకుంటాం’ అని కొందరు గర్వపడుతుంటారు. కొన్ని తరాలైనా తరగని ఆస్తులు సంపాదించి, రెండు కాదు నాలుగు చేతులా కూడబెట్టుకుంటున్నారు. కరోనా మహమ్మారితో ఇవన్నీ పటాపంచలవుతున్నాయి. 


వారసుల బంగారు భవిష్యత్తుకు నిరంతరం పరితపించి కరోనా కాటుకు బలైన ఓ వ్యక్తి ఉదంతాన్ని పరిశీలిస్తే చాలా బాధ కలిగింది. కడతేరిన కన్నతండ్రి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కన్నకొడుకు కరోనా భయంతో తలకొరివి పెట్టడానికి కూడా వెనకడుగువేసిన వైనం చూస్తే రక్తసంబంధాలు, ప్రేమలు ఏమైపోతున్నాయి అనే సందేహం కలిగింది. మనిషి ‘నా శ్రేయస్సు’ అనేంత స్వార్థానికి ఒడిగట్టే స్థితికి చేరుకున్నాడా? అనే ప్రశ్న మొదలైంది. కరోనా లాక్‌డౌన్‌ వేళ జేబుల్లో, బ్యాంకుల్లో కావలసినంత డబ్బు ఉన్నా, ‘తినడానికి పట్టెడు మెతుకులు దొరికితే చాలు’ అనే స్థితికి రావడం తెలిసిందే. మనం నమ్ముకున్న, పెంచుకున్న ఆస్తులు మనల్ని ఎప్పుడూ కాపాడలేవు. ఇకనైనా మనలో పరివర్తన అవసరమని కరోనా సంకేతాలు ఇస్తోంది. డబ్బుంటే ఏ రోగమూ ఏమీ చేయలేదనే మానసిక ధోరణి ఉన్నవారికి ‘కరోనా’ ఓ పెద్ద గుణపాఠం నేర్పింది. 


‘కరోనా’కు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, హోదా లేదు. ‘ఉన్నవాళ్లు... లేనివాళ్లు’ అనే తారతమ్యం లేదు. అమెరికా అధ్యక్షుని వైట్‌హౌస్‌ మొదలుకొని బ్రిటీష్‌ ప్రధాని వరకూ, భారతదేశంలో రాజ్‌భవన్‌ మొదలుకొని డాక్టర్ల వరకూ ఈ వ్యాధి అందరినీ కబళించే ప్రయత్నం చేస్తోంది. ‘బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు’ అనే దుస్థితి దాపురించింది. అందుకే ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని విధించుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. ప్రతి మనిషికి కావాల్సింది సమయానికి ఆహారం, నిద్ర, ఆరోగ్యం. వీటినే అందరూ ప్రగాఢంగా కోరుకునే దిశగా మానవాళి ఆలోచనలను పయనింపజేసిన కోవిడ్‌-19 గొప్పదేనని అనిపిస్తుంది. మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు అన్నార్తులను ఆదుకోవడం అభినందనీయం. మానవత్వాన్ని చాటుకోవడానికి ఎలాంటి ప్రచారమూ అవసరం లేదు. అయితే కొందరు వ్యక్తులు, నాయకులు, రాజకీయ పార్టీలు తమ ప్రచారార్భాటాల కోసం కరోనా వ్యాధిని కూడా ఉపయోగించుకోవడం చూస్తే జాలి కలుగుతోంది. ‘కాదేదీ అవినీతికి అనర్హం’ అంటూ మరికొందరు నేతలు బరితెగించి కరోనా కిట్లలోనూ, మాస్కుల్లోనూ సైతం చేతివాటం ప్రదర్శించారనే అభియోగాలు శవాల దగ్గర చిల్లర కోసం ఎగబడే చందంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా, ‘మంచి-చెడు’ అనే రెండు పదాల్లో చెడు ఉన్నప్పుడే మంచి విలువ తెలు స్తుంది. అలాగే ప్రచారాలు చేసుకునే నాయకులు ఉన్నప్పుడే నిస్వార్థంగా సేవ చేసే స్వచ్ఛంద సంస్థల దాతృత్వం అర్థమవుతుంది. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మనుషుల్లో, వారి మనసుల్లో పరివర్తన ప్రక్రియ మొదలైందా? మానవత్వానికి మచ్చతెచ్చే ఆలోచనలకు ఇది స్వస్తి చెప్పే పరిణామమా?


వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

Advertisement
Advertisement