విరుచుకుపడుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-05-29T09:54:08+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది.

విరుచుకుపడుతున్న కరోనా

ఉమ్మడి జిల్లాలో 22 పాజిటివ్‌ కేసులు నమోదు


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / మొయినాబాద్‌ రూరల్‌ /  షాద్‌నగర్‌ / ఆంధ్ర జ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మంగళవారం ఒక్కరోజే 24 కేసులు నమోదు కాగా.. బుధవారం 10 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం మరో 18 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పహాడిషరీఫ్‌లో 11 కేసులు నమోదు కాగా, సరూర్‌నగర్‌లో 5 కేసులు నమోదయ్యాయి. షాద్‌నగర్‌, మొయినాబాద్‌ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 203కు చేరింది.


పేకాట తెచ్చిన తంట : బోరబండకు చెందిన మటన్‌ వ్యాపారి కుటుంబ సమేతంగా పహాడిషరీఫ్‌ పరిధిలోని తమ బంధువుల వద్దకు వెళ్లారు. వారు అక్కడ రెండు రోజులు గడిపారు. అనంతరం ఆ దంపతులిద్దరు మహేశ్వరం మండలం హర్శగూడలో నివాసముంటున్న బంధువుల వద్దకు వెళ్లారు. రెండుచోట్ల మటన్‌ వ్యాపారి విందులు, వినోదాల్లో పాల్గొన్నాడు. ఒకచోట చేరి పేకాట ఆడారు. దీంతో ఈ మటన్‌ వ్యాపారి నుంచి ఈనెల 26న ఒక్కరోజే 19 మందికి కరోనా సోకింది. గురువారం 11 మంది కరోనా బారిన పడ్డారు. మరో 11 మంది నమూనాలు ల్యాబ్‌కు పంపారు. అందులో ఎంతమందికి వైరస్‌ సోకిందో నేడో రేపో తేలుతుంది.


మొయినాబాద్‌ మండలంలో.. : మొయినాబాద్‌లో కరోనా పంజా విసిరింది. వరుసగా రెండోరోజూ కేసు నమోదైంది. అజీజ్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఇటీవల నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చేసిన పరీక్షల్లో బుధవారం రాత్రి అతనికి పాజిటివ్‌ వచ్చింది. 


షాద్‌నగర్‌లో.. : షాద్‌నగర్‌ జంట పట్టణమైన ఫరూఖ్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు గురువారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ తెలిపారు. షాద్‌నగర్‌ పట్టణంలోని ఈశ్వర్‌కాలనీకి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌ జియాగూడలో అంత్యక్రియల్లో పాల్గొన్న విషయం విధితమే. అయితే ఆ కుటుంబం ద్వారా మహిళకు కరోనా వ్యాప్తి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.  ఇదిలావుండగా... పాజిటివ్‌ వచ్చిన మహిళ, ఆమె భర్త టిఫిన్‌ సెంటర్‌ నడిపిస్తారని తెలిసింది.


మేడ్చల్‌ జిల్లాలో నలుగురికి.. : మేడ్చల్‌జిల్లాలోని జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం కుత్బుల్లాపూర్‌లో రెండు, అల్వాల్‌లో, ఉప్పల్‌ మండలాల్లో ఒక్కో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-05-29T09:54:08+05:30 IST