సాయం సర్కారుది.. పెత్తనం నేతలది

ABN , First Publish Date - 2020-04-04T11:06:14+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం సాయం ప్రకటిస్తే.. దానిలోనూ నేతలు అజమాయిషీ చేస్తున్నారు.

సాయం సర్కారుది.. పెత్తనం నేతలది

కరోనా సాయానికి రాజకీయ రంగు

వారి ఆధ్వర్యంలోనే పంపిణీ

‘స్థానిక’ ఎత్తుగడతోనే

 వివిధ పదవులకు నామినేషన్లు వేసినవారూ జోక్యం

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వ్యూహాలు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం సాయం ప్రకటిస్తే.. దానిలోనూ నేతలు అజమాయిషీ చేస్తున్నారు. తామే ఇచ్చినట్లు ప్రజల్లో మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా చేపట్టిన రేషన్‌ పంపిణీ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరగడం చాలా చోట్ల కనిపించింది. ఆఖరుకు స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన వారు కూడా రేషన్‌ పంపిణీకి సిద్ధపడడం విశేషం. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ విధమైన వ్యూహంతో ముందు కు వెళుతున్నారు. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న సాయం ‘స్థానిక’ రాజకీయ రంగు పులుముకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో పేదలకు బతుకు భారమైంది. ఈ పరిస్థితిలో సహాయక చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.


నేరుగా ఖాతాల్లో జమ చేయగలిగే నగదు సహాయక చర్యలను సైతం బహిరంగంగా అందివ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ అభ్యర్థులకు స్థానిక ఎన్నికల్లో కలిసొచ్చేలా సంకేతాలు ఇచ్చింది. ఇదే అదనుగా నేతలు అన్నింటా ప్రత్యక్షమైపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.1000ని కూడా వలంటీర్లు, రాజకీయ నాయకులు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చేతుల మీదుగా అందించేలా నిర్ణయించారు. ఇప్పటికే అందిస్తున్న నిత్యావసర సరకులు, పింఛన్ల పంపిణీ ఇదే విధంగా సాగింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నైతిక విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. 


ప్రభుత్వం ఏప్రిల్‌ నెలకు సంబంధించిన బియ్యం నిల్వలను ఈసారి ఉచితంగా అందించింది. గత నెల 29నుంచే లబ్ధిదారులకు డీలర్ల ద్వారా రేషన్‌ అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉచిత బియ్యంతో పాటు కిలో కందిపప్పు అందజేస్తోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు రంగంలోకి దిగి వారి చేతుల మీదుగా అందిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజా ప్రతినిధులు అందించినా వారి పక్కనే అభ్యర్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా అధికార పార్టీ తమ గొప్పగా చెప్పుకుంటూ స్థానిక ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా అనుచిత లబ్ధిపొందేందుకు అధికార వైసీపీ నాయకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్జీటీసీ, వార్డుల్లో పోటీకి నామినేషన్లు వేసిన అభ్యర్థులు సైతం ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, నిత్యావసరాలు, పింఛన్లు అందించడాన్ని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. 


జిల్లాలోని 34 మండలాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు.. విపత్తు సాయాలు సక్రమంగా అందుతున్నదీ.. లేనిదీ ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. వారి ద్వారా అందించడం వరకు సబబే. కానీ ఇదే కారణం చూపి ఏకంగా పోటీలో ఉన్న అభ్యర్థులే నేరుగా రంగంలోకి దిగడం సరైంది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 7.10 లక్షల రేషను కార్డుల లబ్ధిదారులకు ఉచిత రేషను సరకులను అందిస్తున్నారు. రూ.77 కోట్ల రూపాయలు సామాజిక పింఛన్లుగా అందిస్తున్నారు.  పేద కుటుంబానికిరూ.1000 అందించే కార్యక్రమానికి రూ.67 కోట్లు సిద్ధం చేశారు. ఇలా ప్రభుత్వం చేపడుతున్న  సంక్షేమ పథకాలను పోటీలో ఉన్న అభ్యర్థులు, భర్తలు, తండ్రులు అందించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 


 ఇవిగో ఉదాహరణలు...

గత నెల 29న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఉచిత నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పక్కన ఉండగా పంపిణీని ప్రారంభించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇది అభ్యర్థుల కోసం ముందస్తు వ్యూహంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంగా ఆరోపణలు గుప్పుమన్నాయి.


విజయనగరంలోని కేఎల్‌ పురం 45వ వార్డులో సంతోషి అనే మహిళ కార్పొరేటర్‌ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.  ప్రస్తుతం అందిస్తున్న సరకుల పంపిణీలో ఆమె పాల్గొంటున్నారు. అభ్యర్థి భర్త తాళ్లపూడి గణేష్‌ ఇంటింటికీ వలంటీర్‌తో పాల్గొని పింఛన్లు అందిస్తున్నారు. 


బొబ్బిలి మున్సిపాలిటీలోని 30వ వార్డులో వైసీపీ అభ్యర్థులు ఉచిత నిత్యావసర సరకుల పంపిణీలో పాల్గొన్నారు. ఇటువంటి సంఘటనలు అనేకం మున్సిపాలిటీలో చోటుచేసుకున్నాయి. 


పాచిపెంట ఎంపీటీసీ-2 నుంచి వైసీపీ అభ్యర్థిగా టి.గౌరీశంకరరావు పోటీలో ఉన్నారు. ఆయన ఇటీవల ఉచిత నిత్యావసర సరకులను తన చేతుల మీదుగా అందించారు.

Updated Date - 2020-04-04T11:06:14+05:30 IST