కరోనా దెబ్బకు విలవిల

ABN , First Publish Date - 2021-05-17T05:04:42+05:30 IST

మార్చి 1వ తేదీ నుంచి మే15వ తేదీ వరకు (75 రోజులు) కరోనా ధాటికి జిల్లా విలవిలలాడిపోయింది. పచ్చని పల్లెలు వణికిపోతున్నాయి.

కరోనా దెబ్బకు విలవిల
కర్ఫ్యూతో నిర్మానుష్యంగా గాంధీబొమ్మ కూడలి

75 రోజుల్లో 45వేల కేసులు

సగటున రోజుకు 1500 పాజిటివ్‌లు 

పరీక్ష చేయించుకున్న ప్రతి వందమందిలో 14 మందికి పాజిటివ్‌

లెక్కకు మించి మరణాలు 

ప్రజాచైతన్యంతోనే కట్టడి సాధ్యం



నెల్లూరు. మే16(ఆంధ్రజ్యోతి): మార్చి 1వ తేదీ నుంచి మే15వ తేదీ వరకు (75 రోజులు) కరోనా ధాటికి జిల్లా  విలవిలలాడిపోయింది. పచ్చని పల్లెలు వణికిపోతున్నాయి. పట్టణాలు మరణయాతన అనుభవిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచి మే 15వతేదీ వరకు జిల్లా మొత్తంపై 45,867 పాజిటివ్‌ కేసులు రికార్డు కాగా, అందులో 18వేల పైచిలుకు కేసులు ఒక్క నెల్లూరు నుంచే ఉండటం గమనార్హం. పరీక్షలు జరిపిన ప్రతి వంద మందిలో 14.32 శాతం మందికి పాజిటివ్‌ రావడం ప్రమాదరకర అంశం. మరణాలు సైతం లెక్కకు మించి జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం రోజుకు ఆరేడు మరణాలు చూపుతున్నా వాస్తవ లెక్కలు మరణాలు పదుల సంఖ్యలో ఉంటున్నాయి. నేడో రేపో వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గిపోతుందని ఆశించడం తప్ప అది అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకు వైరస్‌ వ్యాప్తి తీవ్రత పెరుగుతోంది. మార్చిలో రోజుకు వంద..రెండొందల కేసులు రికార్డు అయితే మే వచ్చే సరికి రోజుకు 1500 నుంచి 2000 వరకు కేసులు రికార్డు అవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తే కాదు...తీవ్రత చాలా బలంగా ఉంది. తొలివిడతలో వైరస్‌కు గురైనవారు స్వల్ప అస్వస్థతతో బయటపడేవారు. కాని ఈ సారి తీవ్రంగా జబ్బుపడుతు న్నారు. మరణంతో పోరాడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకున్నాయి. ఆక్సిజన కొరత భయపెడుతోంది. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని అధికారులు హడలిపోతున్నారు. ఒకవైపు కరోనా విలయం ముంచుకువస్తున్నా..ప్రజలు మాత్రం కాసింత కూడా భయంలేకుండా తిరుగుతున్నారనే చెప్పాలి. అత్యవసరాలకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రమ్మంటే...అవసరం ఉన్నా లేకున్నా వీధులపై బలాదూర్‌ తిరుగుతున్నారు. కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. గడచిన 75 రోజుల కాలంలో కరోనా చేసిన గాయం తాలూకూ వివరాలు.. స్వీయ రక్షణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాల్లోకి వెళితే...


75 రోజులు.. 45వేల కేసులు


మార్చి ఒకటో తేదీన జిల్లాలో రెండో విడత కరోనా ప్రారంభం అయింది. అప్పటి నుంచి మే 15వ తేదీ వరకు అంటే 75 రోజుల్లో జిల్లా పరిధిలో 45,867 కేసులు రికార్డు అయ్యాయి. అంటే సగటున రోజుకు 1500 కేసులు. తొలివిడతతో పోల్చితే ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి వేగం పది రెట్లకు పైగా పెరిగింది. జిల్లా పరిధిలోని ప్రతి పట్ణణం పరిధిలో వేల సంఖ్యలో కేసులు రికార్డు అయ్యాయి. ఇక పల్లెల విషయానికి వస్తే దాదాపుగా అన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఇంటికో కేసు, వీధికో మరణం వంతున కొవిడ్‌ మహ్మమ్మారి జిల్లాను వణికిస్తోంది. గడచిన 75 రోజుల కాలంలో 3,20,212 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్ష చేయించుకున్న ప్రతి వంద మందిలో 14.32 శాతం మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగించే అంశం. గతంలో పాజిటివ్‌ రేటు 5శాతానికి మించి లేదు. కాని ఇప్పుడు అది మూడు రెట్లు పెరిగింది. రోజులు గడిచే కొద్ది పాజిటివిటీ శాతం పెరుగుతూ ఉండటం మరో ఆందోళన కలిగించే అంశం. పట్టణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా రికార్డు అయ్యింది. నెల్లూరులో పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 20.77 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆత్మకూరులో 13, బుచ్చిలో 16, కలువాయిలో 18, కలిగిరిలో 12, దగదర్తి, డక్కిలిలో 13, సూళ్లూరుపేట అర్బన 17, రూరల్‌ 15, నాయుడుపేట 14 శాతం పాజిటివ్‌ రేటు రికార్డు అయ్యింది. జిల్లాలో కేవలం 19 మండలాల్లో మాత్రమే పాజిటివ్‌ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉంది. మిగిలిన అన్ని మండలాలు, పట్టణాల్లో 11 నుంచి 20 శాతం వరకు రికార్డు అయ్యింది. వ్యాధి తీవ్రత ఎంత బలంగా ఉందో ఈ పాజిటివ్‌ రేటు స్పష్టం చేస్తోంది. 


లెక్కకు అందని మరణాలు

 

తొలివిడతతో పోల్చితే మరణాల శాతం చాలా ఎక్కువగా రికార్డు అవుతోంది. తొలి విడతలో మరణాలు ఒక్క శాతానికి మించి లేవు. అంతే కోవిడ్‌ వబారిన పడిన ప్రతి వంద మందిలో కేవలం ఒక్కరు మాత్రమే మరణించారు. అయితే ఈసారి మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం రోజుకు ఆరు నుంచి 9మంది మరణిస్తున్నట్లు ప్రకటిస్తున్నా వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నెల్లూరులో బోడిగానితోట శ్మశానంలో రోజుకు 20కి తక్కువ లేకుండా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. కొవిడ్‌ ఆసుపత్రుల వద్ద కొంత సేపు కాపుకాస్తే నల్లకవర్‌లో ప్యాక్‌ చేసిన కరోనా మృతదేహాలు గంటకు ఒకటి చొప్పున బయటకు వస్తూనే కనిపిస్తున్నాయి. ఆసుపత్రికి చేరిన ఒకటి రెండు రోజుల్లోనే మరణిస్తున్నవారు కొందరైతే, ఆసుపత్రి గేటు వద్దకు వచ్చే సరికే ప్రాణాలు వదులుతున్న వారు మరి కొందరు. అసలు ఆసుపత్రుల వద్దకు రాకనే ఇళ్లలోనే మరణిస్తున్న వారు ఇంకొందరు. వైరస్‌ తీవ్రత ఎంత బలంగా ఉందో చెప్పడానికి సంభవిస్తున్న మరణాలే నిదర్శనం. 


స్వీయ కట్టడే రక్ష


కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తోంది..! గతంలో ఎలా చేసింది అనే వాదనలను పక్కన పెడితే తమ వంతుగా ఏమి చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చినా సామాజికదూరం అనేది ఎక్కడా కనిపించడం లేదు. మాస్కుల విషయంలో ప్రజల్లో చైతన్యం వచ్చింది కాని అంతే ముఖ్యమైన సామాజిక దూరం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. రెండో విడత కరోనా  గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, రద్దీ ప్రదేశాల్లో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుం దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అవసరాల పేరుతో గుంపులు గుంపులుగా మార్కెట్లు, దుకాణాల్లో కనిపిస్తున్నారు. సామాజికదూరం అసలు పాటించడం లేదు. అత్యవసరాలకు తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటే ఎదో ఒక సాకుతో రోడ్లపై బలాదూర్‌ తిరుగుతూనే ఉన్నారు. నెల్లూరులో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12  వరకు ఏ రోడ్డు చూసినా కరోనా కబళిస్తోందన్న స్పృహ ప్రజలకు ఏమాత్రం లేదనే విషయం స్పష్టం అవుతుంది. ఆసుపత్రుల్లో బెడ్లు లేవని, బెడ్లు దొరికినా ఆక్సిజన బెడ్లు దొరికే పరిస్థితి లేదని తెలిసినా కనీస జాగ్రత్తలను పక్కన పెట్టి కరోనాను వెదుక్కొంటూ వెళుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీసులు, అధికారులు ఎంత కట్టడి చేసినా ప్రజల్లో చైతన్యం రాకుంటే కరోనాను అదుపు చేయడం అసాధ్యం. ఇప్పుడు రోజుకు 1500 కేసులు రికార్డు అవుతున్నాయి. ఇదే వేగం కొనసాగితే రాబోయే పది రోజుల్లో ఈ సంఖ్య 5వేలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు పరీక్షలు చేసుకొంటున్న ప్రతి వంద మందిలో 14 మందికి పాజిటివ్‌ వస్తోంది. రేపు పాజిటివ్‌ రేటు 30శాతానికి పెరగదనే గ్యారెంటీ లేదు. ఇప్పుడే ఎవరికి వ్యాధి ఉందో ఎవరికి లేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. వ్యాధి తీవ్రత మరింత కొనసాగితే కుటుంబ సభ్యుల మధ్య ఇళ్లలోనే ఉండాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు మూలల్లో దూరదూరంగా, భయం భయంగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదంటే అత్యవసరం అయితే తప్ప ఇంటి గడప దాటకపోవడం ఒక్కటే మార్గం. బయటకు వెళ్లినా సామాజికదూరం పాటించడం అన్నింటికన్నా ముఖ్యం. 


Updated Date - 2021-05-17T05:04:42+05:30 IST