సూళ్లూరుపేటలో శరవేగంగా..

ABN , First Publish Date - 2021-04-21T05:04:51+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ కొరలుచాస్తూ శరవేగంగా వ్యాపిస్తోంది. ఒక్క సోమవారం రోజే సూళ్లూరుపేట నియోజకవర్గంలో 104 మంది కరోనా బారిన పడ్డారు.

సూళ్లూరుపేటలో శరవేగంగా..

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 20 : కరోనా సెకండ్‌ వేవ్‌ కొరలుచాస్తూ శరవేగంగా వ్యాపిస్తోంది. ఒక్క సోమవారం రోజే సూళ్లూరుపేట నియోజకవర్గంలో 104 మంది కరోనా బారిన పడ్డారు. ప్రతి మండలంలో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల మేరకు సూళ్లూరుపేటలో 12 మంది, మండలంలో నలుగురు, నాయుడుపేటలో 18 మంది, మండలంలో ఏడుగురు, తడలో 38 మంది, ఓజిలిలో 10 మంది, దొరవారిసత్రంలో 9 మంది, పెళ్లకూరులో  ఆరుగురికి కరోనా సోకింది. సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఓ అధికారితోపాటు కొందరు కానిస్టేబుళ్లకు కరోనా సోకినట్లు తేలడంతో స్టేషన్‌లో కలకలం రేగింది. ఇంకా కొంతమంది కానిస్టేబుళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. విస్తరిస్తున్న కరోనా కట్టడికి అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉంది.


టీకాకు ఎగబడుతున్న జనం


మొన్నటిదాకా కరోనా టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపని ప్రజలు ఇప్పుడు ఎగబడుతున్నారు. నాలుగు రోజులుగా సూళ్లూరుపేటలో టీకా లేకపోవడంతో ప్రజలు వెనుతిరిగి వచ్చేశారు. అయితే,  మంగళవారం టీకాలు వేస్తుండటంతో ప్రజలు ఎగబడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 335 మందికి మంగళవారం కరోనా టీకా వేశారు. అలాగే మరో 15 మంది కి చెంగాళమ్మ ఆలయంలో టీకాలు వేశారు. 

 

స్విమ్మింగ్‌ఫూల్స్‌ మూసేయాలి


నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట) : జిల్లావ్యాప్తంగా ఉన్న స్విమ్మింగ్‌ఫూల్స్‌ (ఈతకొలనులు) మూసివేయాలని జిల్లా క్రీడాపాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ యతిరాజ్‌ ఒక ప్రకటనలో  ఆదేశించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్‌ఫూల్‌తోపాటు నగరంలోని మరో మూడు, కావలి, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో ఉన్న అన్నింటిని మూసేయలని ఆదేశించారు.



కొవిడ్‌ నియంత్రణకు అధికారుల బృందం : కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 20 : జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ, కొవిడ్‌ వైద్యశాలల నిర్వహణ, చికిత్స, పరీక్షలు, ల్యాబ్‌ల పరిశీలన, పర్యవేక్షణకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  జేసీ హరేందిర ప్రసాద్‌ కొవిడ్‌ వైద్యశాలల్లో టెస్టింగ్‌ ప్రక్రియను, మరోజేసీ డాక్టర్‌ ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి కొవిడ్‌ వైద్యశాలల నిర్వహణను, వైద్యశాలల సర్వీసెస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ డీ ప్రభావతి కొవిడ్‌ చికిత్సను, జేసీ టీ బాపిరెడ్డి ల్యాబ్‌ల పర్యవేక్షణను, జడ్పీ సీఈవో సుశీల కాంటాక్టు ట్రేసింగ్‌ను,  అదనపు ఎస్పీ వెంకటరత్నం కంటైన్మెంట్‌ నిర్వహణను, పశుసంవర్థకశాఖ జేడీ జీ విజయమోహన్‌ హోంక్వారంటైన్‌ను,  జిల్లా పంచాయతీ అధికారి  ఎం ధనలక్ష్మి  హోం ఐసోలేషన్‌ను, జిల్లా ఫారెస్ట్‌ అధికారి వైవీకే షణ్ముఖకుమార్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు.  డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి హెల్ప్‌ డెస్క్‌ను,  జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌  ప్రసాద్‌ ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌ను,  సెట్నెల్‌ సీఈవో  కేఎం రోజ్‌మాండ్‌ మందుల నిర్వహణను, డీఆర్వో చిన్నఓబులేసు మందుల అవసరాలను,  కలెక్టరేట్‌ ఏవో సుబ్రహ్మణ్యం 104 జిల్లాకాల్‌ సెంటర్‌ నిర్వహణను పర్యవేక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఆయా అంశాలకు సంబంధించి అధికారులు రోజువారీ నివేదికను సమర్పిస్తారని తెలిపారు. కాగా, కొవిడ్‌ నియంత్రణ.. పర్యవేక్షణకు నియమించిన నోడల్‌ అధికారులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయా అధికారులతో మంగళవారం ఆయన తిక్కన భనన్‌లో సమావేశం అయ్యారు.


Updated Date - 2021-04-21T05:04:51+05:30 IST