Abn logo
Apr 12 2021 @ 01:31AM

వైరస్‌ ఒణుకు పది రోజుల్లోనే 3,698 కేసులు


శనివారం ఒక్కరోజే 551


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ను కరోనా వైరస్‌ వణికిస్తోంది. పది రోజుల్లోనే అధికారిక లెక్కల ప్రకారం రికార్డు స్థాయిలో 3,698 కేసులు నమోదయ్యాయి. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో శనివారం ఒక్కరోజే 551 కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. పరీక్షల కోసం ఆయా కేంద్రాలకు అనుమానితులు పోటెత్తుతున్నారు. 


మాస్క్‌ మస్ట్‌.. స్పందించని జీహెచ్‌ఎంసీ

మాస్క్‌ లేకుంటే రూ.1000 జరిమానా అంటూ తాజాగా సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): శివార్లలో ఉన్న మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తుంటే గ్రేటర్‌ అధికారులు తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు ప్రారంభించ లేదని సర్ధి చెప్పుకుంటున్నారు. మాస్క్‌ ధరించని వారికి పెనాల్టీ వేసే బాధ్యతలు పోలీసులకు అప్పగించారని, అందుకే తాము జోక్యం చేసుకోవడం లేదని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు చెబుతున్నారు.


పాజిటివ్‌ వ్యక్తులూ రోడ్లపైకి

శరవేగంగా రెండో దశ వ్యాప్తి జరుగుతున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలు నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. తమకు ఆదేశాలు లేవని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతుండగా, పోలీసులు పూర్తిస్థాయిలో పెనాల్టీల విధింపు మొదలు పెట్టలేదు. చాలా మంది మాస్క్‌ లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి పెరగడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే పాజిటివ్‌గా నమోదైన వారు ఐసోలేషన్‌లో ఉంటున్నారా, లేదా..? అన్నది యంత్రాంగం పట్టించుకోవడం లేదు. వైరస్‌ సోకిన కొందరు జనం రద్దీ ఎక్కువగా ఉండే అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయాలని అడుగుతుండడం ఇందుకు నిదర్శనం.


ఇప్పుడైనా..? 

మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ, ఉల్లంఘనులకు రూ.1000 జరిమానా విధించాలని పేర్కొంటూ సర్కారు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు మొదలు పెడ్తారా, లేదా అన్నది చూడాలి. సంస్థలో ఏఎంఓహెచ్‌లతోపాటు ఈవీడీఎంలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగముంది. వారికి బాధ్యతలు అప్పగించే అవకాశమున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


ఏంటా సందేశం..? 

‘డియర్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌.. మీ పని ఒత్తిడి మాకు తెలుసు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పెనాల్టీల విధింపు అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసులకు అప్పగించారు. ఎవరైనా ఐసోలేషన్‌ మార్గదర్శకాలు పాటించకపోతే మీ పరిధిలోని పోలీసులకు సమాచారమివ్వండి. ఆ వ్యక్తి, చిరునామా, ఏరియాకు సంబంధించిన వివరాలు పోలీసులకు తెలపండి’ - ఏఎంఓహెచ్‌లకు ఇటీవల ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సందేశం ఇది.


వ్యాక్సినేషన్‌ షురూ

కేంద్రాల వద్ద రద్దీతో పొంచి ఉన్న ముప్పు

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌ మొదలైంది. ఇప్పటి వరకు 3 వేల మందికి టీకా వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంస్థలో 30 వేల మంది ఉద్యోగులు, కార్మికులున్నారు. ఈ నెల 15వ తేదీలోపు అందరికీ టీకా వేయించాలని కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ ఇటీవల ఆదేశించారు. మరో నాలుగు రోజులు మాత్రమే సమయముండడం.. పరిమిత స్థాయిలో యుహెచ్‌సీల్లో టీకా వేస్తోన్న నేపథ్యంలో గడువులోపు అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు యుహెచ్‌సీల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో అక్కడే కార్మికులకు టీకా వేస్తుండడంతో వైరస్‌ సోకే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


గ్రేటర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగులందరికీ వ్యాక్సిన్‌ వేసే దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సంస్థలో 45 ఏళ్లు పైబడిన వారు 9 వేల మంది ఉన్నారు వారందరికీ మూడు రోజుల్లో వ్యాక్సిన్లు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిపోకు సమీపంలోని యూపీహెచ్‌సీల్లో రోజుకు 70 - 100 మందికి వ్యాక్సిన్లు వేయించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. 


సిబ్బంది రక్షణ కోసం : వెంకటేశ్వర్లు, గ్రేటర్‌ ఆర్టీసీఈడీ

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రతిడిపోనూ రోజూ శానిటైజ్‌ చేయిస్తున్నాం.  డ్రైవర్లు, కండక్టర్లకు మాస్క్‌లతో పాటు శానిటైజర్‌ బాటిళ్లు పంపిణీ చేస్తున్నాం. అందరికీ వ్యాక్సిన్‌ వేయించే ఏర్పాట్లు చేశాం. సిబ్బందికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సెలవులు ఇస్తున్నాం. 


Advertisement
Advertisement