కరోనా @ 1902

ABN , First Publish Date - 2021-05-12T06:02:37+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

కరోనా @ 1902

రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

24గంటల్లో రెండువేలకు చేరువలో...

మరో ముగ్గురు మృతి

ప్రొద్దుటూరులో పెరుగుతున్న కేసులు

మండలాల్లోనూ అదే పరిస్థితి

కర్ఫ్యూ ఉన్నా... నాటి ఆంక్షలేవీ?


కడప, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరుకు వైరస్‌ వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రెండువేల కేసులకు చేరువగా నమోదవుతున్నాయి.  24గంటల వ్యవధిలో 1902 మంది మహమ్మారి బారిన  పడ్డారు. ఇంత పెద్ద స్థాయిలో కేసులు నమోదు కావడం జిల్లాలో ఇదే తొలిసారి. అలాగే మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మహమ్మారి జిల్లా నలుమూలల చేరడంతో కేసుల సంఖ్య రాబోవు రోజుల్లో సుమారు 5వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. 

వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు 18గంటల కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తికి బ్రేకులు పడ్డంలేదు. వరుసగా కేసుల సంఖ్య 1200 మార్కును దాటేసి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వైరస్‌ ఇంతలా వ్యాప్తి చెందుతూ ఆక్సిజన్‌ అందక ప్రాణాలు గాలిలో కలుస్తున్నా కొందరిలో ఇంకా నిర్లక్ష్యం వదల్లేదు. అత్యవసరమైతే బయటికి రావాలని చెబుతున్నా కొందరు పని లేకున్నా యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. ఇలాంటివారు జనంలో యధావిధిగా తిరిగేస్తూ వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఇప్పటి దాకా కడపలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఆ రికార్డును ప్రొద్దుటూరు దాటేసింది. అక్కడ ఒక్కరోజే 197 కేసులు నమోదయ్యాయి. తొలిదశ కరోనా సమయంలో ప్రొద్దుటూరు విలవిల్లాడింది. రెండో దశలో కడపలోనే కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి, బద్వేలులో కేసుల సంఖ్య భారీగా నమోదవుతూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. అలాగే సుండుపల్లె, రాజుపాలెం, చిట్వేలి, చాపాడు, నందలూరు, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, వేంపల్లెలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైరస్‌ విస్తరించడం కలవరపాటుకు గురి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందితే దాని ఎఫెక్ట్‌ వైద్యసేవలపై ఉంటుంది. అలాగే పల్లెల్లో హోం ఐసోలేషన్‌లో ఉండి ట్రీట్‌మెంటు తీసుకునే వసతులు ఉండవు. భౌతిక దూరం, మాస్కులు, చేతులు శుభ్రం చేసుకోవడం పట్ల అవగాహన తక్కువగా ఉంటుంది. ఇవి వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతున్నాయి.


నాటి ఆంక్షలేవీ..?

గత ఏడాది తొలిదశలో కరోనా కట్టడికి అఽధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడింది. రేయి పగలనక విధులు నిర్వహించింది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, ట్రీట్‌మెంటు ఇవ్వడం, అతని కాంటాక్టులను గుర్తించి వారందరికీ టెస్టులు నిర్వహించి ఐసోలేషన్‌లో ఉంచడం చేసేవారు. దీంతో పాటు పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్‌గా గుర్తంచేవారు. అయితే  ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పుడు కంటైన్మెంటు జోన్లు లేవు, పారిశుధ్య చర్యలు లేవు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిపై నిఘా కొరవడ్డంతో కొందరు బయట తిరిగేస్తుండడం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమని చెబుతున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్టులను గుర్తించడంలో గతంలో మాదిరి వ్యవహరించడంలేదనే విమర్శలున్నాయి. టెస్టింగగ్‌ చేసుకునే వారి ఫలితాలు ఆలస్యంగా వస్తుండడంతో అప్పటికే ఆ వ్యక్తి జనాల్లో ఇష్టారాజ్యంగా తిరిగేసి వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లనే వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు.


1902 పాజిటివ్‌ కేసులు నమోదు

జిల్లాలో కరోనా 24 గంటల వ్యవధిలో 1902 మందికి పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,215 కు చేరుకుంది. మరో ముగ్గురు మృతి చెందగా ఇంతవరకు 575 మంది మృత్యువాత పడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 617 మందిని డిశ్చార్జి చేశారు. మొత్తం రికవరీల సంఖ్య 66,252కు చేరింది. 1,897 మంది ఆసుపత్రుల్లో, 6,327 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.


మండలాలవారీగా నమోదైన కేసులు

ప్రొద్దుటూరులో 197, కడప 186, పులివెందుల 145, రాజంపేట 97, రైల్వేకోడూరు 91, ఓబులవారిపల్లె 74, నందలూరు 68, రాయచోటి 68, బద్వేలు 59, బద్వేలు 59, ఎర్రగుంట్ల 58, చాపాడు 51, చాపాడు 51, రాజుపాలెం 46, సుండుపల్లె 46, రాజుపాలెం 46, వేంపల్లె 37, వేంపల్లె 37, చిట్వేలు 35, వేముల 34, సీకేదిన్నె 34, సిద్దవటం 30, సిద్దవటం 30, లింగాల 28, లింగాల 28, వీరబల్లె 26, సింహాద్రిపురం 26, వీరబల్లె 26, సింహాదిపురం మండలంలో 26, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే రామాపురం మండలంలో 25, పోరుమామిళ్ల 24, పోరుమామిళ్ల 24, జమ్మలమడుగు 23, మైదుకూరు 23, జమ్మలమడుగు 23, మైదుకూరు 23, ఖాజీపేట 23, ఒంటిమిట్ట 23, చిన్నమండెం 22, వీఎన్‌పల్లె 19,  సంబేపల్లె 19, కొండూరు 18, బి.మఠం 17, కాశినాయన 17, బి.కోడూరు 16, గోపవరం 16, ముద్దనూరు 15, కమలాపురం 14,  పెనగలూరు 14, చెన్నూరు 14, గాలివీడు 14, చక్రాయపేట 13, లక్కిరెడ్డిపల్లె 12, పుల్లంపేట 12,  దువ్వూరు 10,  కొండాపురం 10, మైలవరం 10, పెండ్లిమర్రి 10, అట్లూరు 9, కలసపాడు 8, పెద్దముడియం 7,    తొండూరు మండలంలో 6, ఇతర జిల్లాలకు చెందిన వారికి సంబంధించి మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు

ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌... ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా సరే.. ఆక్సిజన్‌ కొరత గురించే వినిపిస్తోంది. కరోనా బారిన పడ్డ 40 శాతం మందికి పైగా బాధితులకు ఆక్సిజన్‌ అవసరమవుతోంది. అవసరాలకు తగ్గట్లు ఆక్సిజన్‌ దొరక్కపోవడంతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో కడప రిమ్స్‌, ప్రొద్దుటూరు, పులివెందుల ఆసుపత్రుల్లో 4వేల ఎల్‌పీయం సామర్థ్యం గల ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. జాతీయ రహదారుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. వీటికి సంబంధించిన ప్లాంట్లలో సివిల్‌ పనులను 15 రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే జిల్లాలో ఆక్సిజన్‌ కొరత తీరుతుంది. ప్రస్తుతం జిల్లాలో 20.5 కిలో లీటర్ల మేర ఆక్సిజన్‌ అందుబాటులో ఉంది. ఈ నెలలో కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆక్సిజన్‌ అవసరం పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారి, యర్రగుంట్ల నుంచి ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. ఈ నేపధ్యంలో కడప రిమ్స్‌లో 2వేల ఎల్‌పీయం (లీటర్‌ ఫర్‌ మినిట్‌), ప్రొద్దుటూరులో వెయ్యి, పులివెందులలో వెయ్యి ఎల్‌పీయం సామర్థ్యం గల ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఈ నెలాఖరుకు అందుబాటులోకి రావచ్చు. 

Updated Date - 2021-05-12T06:02:37+05:30 IST